సునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులు
2004 డిసెంబర్ 26. తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా గుర్తుండిపోయే రోజు. క్యాలెండర్‌లో ఆ తేదీ కనబడితే ఇప్పటికీ భయపడిపోయే విధంగా ఆ విధ్వంసాన్ని కళ్లారా చూసిన వాళ్లున్నారు. హిందూమహా సముద్రంలో పుట్టిన కల్లోలం..ఎంతో మంది జీవితాల్ని ముంచేసింది. బీభత్సాన్ని సృష్టించింది. తీర ప్రాంతాల్లోని ఊళ్లన్నీ రాకాసి అలలకు బలి అయ్యాయి. వీటిలో శ్రీకాకుళం కూడా ఉంది. పొరపాటున ఎవరైనా సునామీ అనే పేరుని తలిస్తే చాలు..ఇక్కడి ప్రజలు ఉలిక్కిపడతారు. మరీ ముఖ్యంగా మత్స్యకారులు ఆ రోజుని గుర్తు చేసుకుంటే వణికిపోతారు. అలల ధాటికి చేపల వేట కోసం ఉపయోగించే పడవలన్నీ ముక్కలైపోయాయి. కెరటాల రూపంలో మృత్యువు తరుముకొస్తుంటే..ప్రాణం కాపాడుకోవడం కోసం పెనుగులాడి చివరకు సముద్రంలో కలిసిపోయిన వాళ్లెంతో మంది ఉన్నారు. సునామీ వచ్చి 20 ఏళ్లు గడిచిన సందర్భంగా మరోసారి ఆ రోజుని గుర్తు చేసుకుంటున్నారు మత్స్యకారులు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న మత్స్యకార కుటుంబాలు స్థానికంగానే కాకుండా దేశంలో వివిధ ప్రాంతాల్లో మత్స్యవేటకు వెళుతూ ఉంటారు. వీళ్లలో చాలా మంది సునామీ విధ్వంసాన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్లున్నారు.