Son Kills Father: తండ్రి పాలిట యముడిగా మారిన కొడుకు, కత్తితో పొడిచి హైదరాబాద్ ఘటన తరహాలోనే దారుణహత్య
Hanmakonda Crime News | ప్రతిరోజూ తాగొచ్చి వేధిస్తున్నాడని, క్షణికావేశంలో కత్తితో దాడి చేసి కుమారుడు తండ్రిని హత్య చేసిన ఘటన హన్మకొండ జిల్లాలో చోటుచేసుకుంది.

Son Murder His Father in Hanmakonda District | వరంగల్: హైదరాబాద్ లోని కుషాయిగూడలో ఓ కొడుకు తన తండ్రిని నడిరోడ్డు మీదే దారుణంగా హత్య చేసిన ఘటన మరువకముందే మరో ఘటన జరిగింది. తండ్రి తాగి వచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని కుమారుడు కత్తితో పొడిచి చంపిన ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే..
హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం ఫున్నెలు గ్రామానికి చెందిన మామునూర్ భాస్కర్ కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భాస్కర్ ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో కొంతకాలం కిందట భాస్కర్ మద్యానికి బానిసయ్యాడు. భాస్కర్ మద్యం సేవించి వచ్చి, ఇంట్లో తరుచూ గొడవ పడేవాడు. భార్య జమునను, కుమారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసేవాడు. తీరు మార్చుకోవాలని భార్య, పిల్లలు పదే పదే చెప్పినా పట్టించునేవాడు కాదు.
అంతులేని ఆవేదన, మరోవైపు పట్టరాని కోపం..
ఈ క్రమంలో మరోసారి మద్యం సేవించి ఇంటికి వచ్చిన భాస్కర్ తన భార్యను, కుమారులు అరుణ్, అన్వేష్ లను బూతులు తిడుతూ ఇబ్బందులకు గురిచేశాడు. వద్దని వారించినా ఎంతకూ వినకపోవడంతో చిన్న కుమారుడు అరుణ్ ఆవేశానికి లోనై తమను నిత్యం వేధిస్తున్న తండ్రి భాస్కర్‌పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తమను వేధిస్తున్నాడని ఓవైపు, ఆయన తీరుతో సమాజంలో తలెత్తుకుని తిరగలేకపోతున్నామన్న బాధలో ఉన్న అరుణ్ తన తండ్రిని పలుమార్లు పొడిచాడు. కుమారుడి కత్తి దాడిలో తీవ్ర రక్తస్రావమై పడి ఉన్న భాస్కర్ ను ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే భాస్కర్ చనిపోయాడని నిర్ధారించారు. తండ్రి హత్యపై పెద్ద కుమారుడు అన్వేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భాస్కర్ ను హత్య చేసిన అతడి చిన్న కుమారుడు అరుణ్ ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.






















