Son Murder Father: వీడు కొడుకు కాదు యముడు - ఎంత శత్రువునైనా అంత ఘోరంగా చంపరు కదా.. తండ్రిని చంపుతారా ?
Crime News: పుత్రుడంటే పున్నామ నరకం నుంచి తప్పించేవాడంటారు. కానీ అ పుత్రుడు నడిరోడ్డుపై నరికేసి తండ్రిని నరకానికి పంపేశాడు.

Son hacked father to death : అది హైదరాబాద్ లోని కుషాయిగూడ ప్రాంతం. ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. శనివారం కూడా అలాగే ఉంది. ఇంతలో ఓ వ్యక్తి అరుచుకుంటూ పరుగెత్తుతూ రోడ్డుపై వచ్చాడు. అతన్ని వెంబడిస్తూ మరో యువకుడు వచ్చాడు. అతని చేతిలో కత్తి ఉంది. పరుగెత్తుతూ అతను కిందపడిపోయాడు.. వెంటనే యువకుడు వచ్చి కత్తితో కసా కసా నరికేశాడు. తర్వాత తీరిగ్గా వెళ్లిపోయాడు. అక్కడున్నవాళ్లంతా చూసి..ఇదేమైనా షూటింగా అనుకున్నారు. రెండు నిమిషాలకే అక్కడ ఘోరమైన హత్య జరిగిందని తెలుసుకుని నిలువెల్లా వణికిపోయారు.
తాగుడికి బానిసయ్యాడని తండ్రిని చంపాలని నిర్ణయం
చనిపోయిన వ్యక్తి పేరు ఆరెల్లి మొగిలిగా గుర్తించారు. చంపిన వ్యక్తి పేరు సాయికుమార్. వీరిద్దరి మధ్య ఎంతో శత్రుత్వం ఉండి ఉంటుందని హత్య జరిగిన తీరు చూసి ఎవరైనా అనుకుంటారు. నిజానికి వారిద్దరూ తండ్రీ కొడుకులు. ఆరెల్లి మొగిలి,సాయికుమార్ తండ్రీ కొడుకులు. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు. సికింద్రాబాద్ లాలాపేటకు చెందిన ఆరెల్లి మొగిలి, అతని కుమారుడు సాయి కుమార్ ఇద్దరూ కూడా ప్యాకర్స్ అండ్ మూవర్స్‌లో పని చేస్తున్నారు. అయితే తండ్రి మొగిలి మద్యానికి బానిసయ్యాడు. వచ్చే డబ్బులు మెుత్తం తాగుడుకు ఖర్చు పెడుతూ ప్రతి రోజూ ఇంట్లో గొడవకు దిగేవాడని చెబుతున్నారు. తాగి గొడవ చేయవద్దని కుమారుడు సాయికుమార్ ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదని.. దాంతో తండ్రిపై కోపం పెంచుకున్నాడని చెబుతున్నారు.
బస్సులో వెళ్తూంటే వెంటపడి మరీ నరికివేత
తండ్రి ఇలాగే వ్యవహరిస్తే పరువుపోతుందని అనుకున్నాడు. తీరు మార్చుకోకపోతే చంపేస్తానని హెచ్చరించినా మారలేదు. రెండు రోజుల కిందట.. మొగిలి మద్యం తాగి గొడవ చేయడంతో ఇక చంపేయాలని నిర్ణయించుకున్నాడు. శనివారం మధ్యాహ్నం లాలాపేట ఇంటి నుంచి మొగిలి ఆర్టీసీ బస్సులో బయలుదేరగా.. అతడిని సాయి కుమార్ తన బైక్‌పై వెంబడించాడు. ఈసీఐఎల్ బస్ టెర్మినల్ వద్ద తండ్రి మెుగిలి బస్సు దిగగా.. ఆ వెంటనే ఆకస్మాత్తుగా అతడిపై దాడికి తెగబడ్డాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితగా పొడిచాడు.
పోలీసుల అదుపులో కుమారుడు
తండ్రి మెుగిలి తప్పించుకునే ప్రయత్నం చేసినా వదిలి పెట్టలేదు. వెంబడించి వేటాడి దారుణంగా పొడిచి చంపాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. తీవ్రంగా గాయపడిన మొగిలిని ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయారు. సాయికుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తండ్రిని మొత్తం పదిహేను సార్లు పొడిచినట్లుగా గుర్తించారు. వారిద్దరూ తండ్రీ కొడుకులు అని తెలిసిన తర్వాత ఆ ఘటన చూసిన వాళ్లంతా షాక్ కు గురయ్యారు. ఎంత శత్రువును అయినా అంత దారుణంగా చంపరు కదా అని చర్చించుకుంటున్నారు.
Also Read: వివాహేతర సంబంధాలతో భార్యపై వేధింపులు, రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీపై కేసు నమోదు





















