Tirumala Kshethra Palakudu Rudrudu Temple | కోనేటి రాయుడి క్షేత్రానికి కాపలా ఈయనే | ABP Desam
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని నిత్యం లక్షలాదిగా భక్తులు తరలివస్తుంటారు. ముందుగా వరాహ స్వామి దర్శనం చేసుకుని తిరుమల శ్రీవారిని దర్శనానికి వెళ్తుంటారు. అయితే స్థానిక కథనాల ప్రకారం తిరుమలకు క్షేత్ర పాలకుడు రుద్రుడు అని చెప్తారు. ఆయన ఆలయమే ఇది. మహాశివరాత్రి సందర్భంగా తిరుమల రుద్రుడి ఆలయాన్ని చూసేద్దాం రండి.
తిరుమలలోని గోగర్భ తీర్థం దీన్నే పాండవ తీర్థం అని కూడా ఉంటారు. ఈ తీర్థం దగ్గర ఈ చిన్న బండరాయిపై ఉన్నా ఆ బాల లింగరూపమే రుద్రుడు. ఈయన్నే తిరుమలకు క్షేత్రపాలకుడు అంటారు. పురాణాల ప్రకారం ఈ లింగం రూపం గతంలో శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభ మండపం ఆవరణలో బలిపీఠానికి ఈశాన్యమూలన ఉండేదిట. అప్పట్లో దీన్ని క్షేత్రపాలక శిల అని పిలిచేవారు. ప్రతి రోజూ రాత్రి అర్చకులు ఇంటికి వెళ్ళేటప్పుడు గుడి తాళాలు ఈ శిల పై పెట్టి నమస్కారం చేసి వెళ్ళేవారు.. మళ్లీ తెల్లవారుజామున వచ్చి నమస్కారం చేసి తాళాలు తీసుకునేవారు. ఈ ఆచారం కొనసాగుతుండగానే...చీకట్లో ఓ బాలుడు పొరపాటున ఈ శిల తగిలి దానిపై పడి మరణించాడట. అప్పటి నుంచి ఈ బలిపీఠాన్ని శివలింగాన్ని గోగర్భతీర్థానికి తరలించారని చెబుతారు.
తిరుమల క్షేత్రానికి క్షేత్రపాలకుడైన రుద్రుడే వేంకటాచల క్షేత్ర మూలంలో శ్రీ కపిలేశ్వర మహాలింగంగా ఆవిర్భవించారని చెబుతారు. ఆయనే కపిలతీర్థం జపాతం వద్ద కపిలేశ్వరస్వామిగా పూజలు అందుకుంటున్నారని పురాణాలు చెబుతున్నాయి. ఏటా మహాశివరాత్రి సందర్భంగా పాండవ తీర్థం లోని క్షేత్రపాలక శిలపై కొలువైన ఉన్న పరమేశ్వరుడికి అభిషేకం చేస్తారు. మహాశివరాత్రి పర్వదినం రోజున స్వామివారి ఆలయం నుండి అర్చకులు, ఆలయ అధికారులు, యాత్రికులకు మంగళవాయిద్యాలతో పాండవతీర్థానికి చేరుకుంటారు. అక్కడ ఏకాదశ రుద్రం తో ఉన్న కేత్రపాలకుడు అయిన రుద్రుడి కి అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం ఆ గుండునకు వెండినామాలు కళ్లు అతికించి పుష్పాలంకరణ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తారు. రుద్రునకు ఆరగింపు అయిన వడపప్పు, పండ్లు, తాంబూలంను భక్తులకు పంపిణీ చేస్తారు.





















