Dappu Culture in Telangana: డప్పు ఎలా వచ్చింది? తెలంగాణలో డప్పు సంస్కృతి పునరుద్ధరణకు కళాకారులు కృషి
Dappu Culture in Telangana |
Revival of Traditional Dappu Culture | డప్పు సప్పుల్లు, డోలు దరువులు — ఏ వేడుక అయినా ఇవి లేకపోతే అసంపూర్ణంగా అనిపిస్తుంది. ఈ విధంగా తెలంగాణ సాంస్కృతిక వారసత్వంలో డప్పు దరువు ప్రత్యేక క్రేజ్ సంపాదించుకుంది. డప్పు వాయించడం కేవలం ఒక వృత్తి కాకుండా, తెలంగాణ పల్లె ప్రజల జీవనశైలితో ముడిపడిన ఒక సాంస్కృతిక సంప్రదాయం గా నిలుస్తోంది.
ఒకప్పుడు, డప్పు కళను ప్రధానంగా మాదిగ సామాజిక వర్గానికి చెందినవారు వాయించేవారు. వివాహాలు, పండగలు, దివంగతుల కార్యక్రమాలు, బహిరంగ సమ్మేళనాలు వంటి సందర్భాలలో ఈ డప్పులను వాయించేవారు. డప్పు దరువు సామాజిక ఉద్యమాల్లో కూడా కీలక పాత్ర పోషించింది. తెలంగాణ ఉద్యమం, దళిత ఉద్యమాలు వంటి వాటిలో డప్పు ప్రత్యేకతను చాటారు.
కొన్ని సంవత్సరాల క్రితం, ప్రతి గ్రామంలో ఏదైనా కార్యక్రమం లేదా విశేషాన్ని తెలియజేయడానికి డప్పు వాయించేవారు. తెలుగు రాష్ట్రాలలో వివాహాలు, అమ్మవారి జాతర్లు, పూజలు మొదలైన వాటికీ ఈ డప్పు వాయిద్యాన్ని ఎక్కువగా ఉపయోగించేవారు. అయితే, పాశ్చాత్య సంగీతం, ఆధునిక సంగీతం ప్రభావం వల్ల ఈ కళ క్రమంగా కనుమరుగు అవుతూవస్తోంది. ఈ తరుణంలో, తెలంగాణ భాషా-సాంస్కృతిక శాఖ డప్పు కళను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రముఖ డప్పు కళాకారుడు అందే భాస్కర్, డప్పు కళను పునరుద్ధరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆయన ఆధ్వర్యంలో కళాకారులకు శిక్షణ ఇస్తూ, వారి ప్రదర్శనలను దేశవ్యాప్తంగా విస్తరింపజేస్తున్నారు.
డప్పు ఎలా వచ్చింది?
“ఆది మానవుల కాలంలో, చనిపోయిన జంతువు చర్మం ఎండకు, వానకు తడిసినప్పుడు, ఒక ఆదిమానవుడు ఆ దారిలో నడుస్తూ, తన కాలికి చిన్న రాయి తగిలి, ఆ చర్మం మీద ‘డం’ అనే శబ్దం వచ్చిందట. ఆ శబ్దం విని ఆదిమానవుడు భయపడ్డాడు. రెండవ సారి అదే శబ్దం విని, క్రూర మృగాలు పారిపోయాయి. ఈ విధం గా డప్పు కాలక్రమేణ మన జీవన శైలి లో భాగం అయింది,” అని భాస్కర్ తెలిపారు.
తెలంగాణలో డప్పు కళను పునరుద్ధరించేందుకు, రాష్ట్రవ్యాప్తంగా వివిధ శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించారు. తెలంగాణ భాషా-సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ శిక్షణా కార్యక్రమాల్లో అన్ని వయసుల వారికి శిక్షణ అందిస్తున్నారు. యువతకు డప్పు కళకు సంబంధించిన అన్ని బీట్స్ మరియు ఆర్టిస్టిక్ ఫార్మేషన్స్ నేర్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అందే భాస్కర్ తెలిపారు.
ఒకప్పుడు ఈ డప్పు కళ కొన్ని వర్గాలకే పరిమితమైనప్పటికీ, ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా మహిళలు కూడా ఈ కళను నేర్చుకుంటున్నారు.
2024 రిపబ్లిక్ డే వేడుకల్లో ఢిల్లీలో 16 మంది డప్పు కళాకారుల బృందం తెలంగాణ డప్పును ప్రదర్శించి, తెలంగాణ కళను దేశవ్యాప్తంగా పరిచయం చేశారు. జెండర్, వయస్సు, కులం, మతం అనే భేదాలు లేకుండా డప్పు కళను నేర్చుకునేందుకు అవకాశాలను కల్పిస్తూ, తెలంగాణ భాషా-సాంస్కృతిక శాఖ కృషి చేస్తోంది. రవీంద్రభారతి, పీపుల్స్ ప్లాజా వంటి పెద్ద వేదికలపై డప్పు కళాకారులను ప్రదర్శించడానికి ఆహ్వానిస్తూ, డప్పు కళకు అంతర్జాతీయ వేదికలపైన కూడా గుర్తింపు వస్తోంది.