Manu Bhaker News: మను భాకర్ కు షాక్- ఖేల్ రత్న నామినేషన్లలో తన పేరు గల్లంతు, అశ్విన్ కోసం తమిళ ఎంపీ లాబీయింగ్!
హాకీ మాంత్రి కుడు ధ్యాన్ చంద్ స్మారకార్థం ప్రతి ఏడాది క్రీడల్లో సత్తాచాటిన వారి కోసం ప్రతిష్టాత్మక ఖేల్ రత్న అవార్డును ప్రదానం చేస్తారు. ఈ ఏడాది ఇప్పటికే కొన్ని నామినేషన్లను ఆయా క్రీడా సంఘాలు చేశాయి.
Major Dhyan Chand Khel Ratna Award: పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో రెండు కాంస్య పతకాలతో మనూ భాకర్ సత్తా చాటిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత విభాగంలో ఒకటి, మరోకొటి టీమ్ విభాగంలో ఆమె కాంస్య పతకాలు సాధించింది. అయితే వచ్చే నెలలో ఇవ్వబోయే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న నామినేషన్లలో ఆమెకు షాక్ తగిలినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఆమెను ఈ అవార్డు కోసం సిఫారసు చేస్తూ నామినేషన్లు దాఖలు చేయబడలేదని సమాచారం. కొన్ని కొన్ని విభాగాల్లో ఇప్పటికే కొంతమంది అథ్లెట్ల పేరును ఈ అవార్డు కోసం సిఫారసు చేశారు. పారిస్ ఒలింపిక్స్ లో వరుసగా రెండోసారి కాంస్య పతకం గెలుచుకునేందుకు జట్టుకు ముందుండి నడిపించిన భారత హాకీ కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ పేరును భారత హాకీ సమాఖ్య ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీంతో ఖేల్ రత్న అవార్డుకు మనూ భాకర్ పేరు ఎందుకు సిఫారసు కాలేదని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
మరికొంతమందిని నామినేట్..
ఇక హర్మన్ ప్రీత్ సింగ్ తో పాటు పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ ను ఈ అవార్డు కోసం సిఫారసు చేశారు. పురుషల హై జంప్ టీ64 విభాగంలో ప్రవీణ్ పోటీపడ్డాడు. ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో తను ఆసియా రికార్డుతో బంగారు పతకాన్ని గెలిచి సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో సిఫారసులపై ఆసక్తి నెలకొంది. మరోవైపు మనూ భాకర్ వ్యక్తిగతంగా కూడా ఈ అవార్డు కోసం అప్లై చేయలేదని కేంద్ర క్రీడా శాఖ ధ్రువీకరించింది. నిజానికి మనూ కు కూడా ఈ అవార్డు కోసం సిఫారసు చేసుకోవాలని భావించిందని ఆమె కుటుంబీకులు తెలిపినట్లు సమాచారం. నిజానికి అథ్లెట్ అవార్డు కోసం అప్లై చేసుకోనప్పటికీ, వాళ్లు సాధించిన ఆయా ఘనతలను బట్టి సెలెక్షన్ కమిటీ సుమోటోగా పేరును పరిగణనలోకి తీసుకోవచ్చు. గతంలో అర్జున అవార్డు కోసం భారత పేసర్ మహ్మద్ షమీ అప్లై చేసుకోనప్పటికీ సెలెక్షన్ కమిటీ అతడి పేరును పరిశీలించిన విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. ఇక, ఖేల్ రత్న అవార్డు దక్కించుకోవాలని మనూ భాకర్ మనసులో కూడా ఉందని పలువురు పేర్కొంటున్నారు. పారిస్ ఒలింపిక్స్ ముగిశాక, తనను ఖేల్ రత్న అవార్డును స్వీకరించేందుకు అర్హురాలినా..? అని ఆమె ఒక పోల్ ను సోషల్ మీడియా వేదికగా రన్ చేశారు. ఆ తర్వాత కొద్ది సేపటికే దాన్ని డిలీట్ చేయడం విశేషం. దీన్ని బట్టి, షూటింగ్ లో పతకం సాధించిన తొలి భారత మహిళా ఒలింపియన్ గా రికార్డుల్లోకెక్కిన మనూ భాకర్ కు ఖేల్ రత్న స్వీకరించాలని ఉందని ఆమె అభిమానులు పేర్కొంటున్నారు.
అశ్విన్ పేరును పంపించాలని అభ్యర్థన..
మరోవైపు ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరును ఖేల్ రత్న అవార్డుకు సిఫారసు చేయాలని కాంగ్రెస్ ఎంపీ విజయ్ వసంత్ సోషల్ మీడియా వేదికగా భారత యువజన, క్రీడా మంత్రిత్వ శాఖను అభ్యర్థించారు. గతవారం బ్రిస్బేన్ టెస్టు ముగిసిన తర్వాత తన రిటైర్మెంట్ ను అకస్మాత్తుగా ప్రకటించి అశ్విన్ అందరికీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. టెస్టుల్లో 106 మ్యాచ్ లాడిన అశ్విన్ 537 వికెట్లు తీశాడు. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్లో 228 వికెట్లతో సత్తా చాటాడు. అతని ఖాతాలో టెస్టుల్లో 8 సార్లు పది వికెట్ల ప్రదర్శన, 37 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన ఘనతలు ఉన్నాయి.