Vallabhaneni Vamsi: వంశీకి షాక్ - బెయిల్ పిటిషన్ డిస్మిస్ - ఇంకా చాలా కాలం జైలు జీవితం తప్పదా ?
Vamsi: వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టి వేసింది. ఆయనకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని సీఐడీ లాయర్లు వాదించారు.

Vallabhaneni Vamsi No bail: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి గట్టి తగిలింది. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై సీఐడీ కోర్టులో మంగళవారం వాదనలు ముగిశాయి. వంశీకి బెయిల్ ఇవ్వొద్దని... బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని సీఐడీ వాదనలు వినిపించింది. ఈ కేసును రాజకీయ కక్షలో భాగంగా పెట్టారని... వంశీ అనారోగ్యం దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాది కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఆ తీర్పును గురువారం ప్రకటించారు. సీఐడీ లాయర్ల వాదనలను సమర్థించిన సీఐడీ కోర్టు వంశీ బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది.
వల్లభనేని వంశీని పోలీసులు టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టు చేయలేదు. ఈ కేసులో ఆయన ఏ 71గా ఉన్నారు. కేసు నమోదు అయిన తర్వాత ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు. ఆ క్రమంలో ఆయన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు అరెస్టు నుంచి రక్షణ కల్పించింది. అయితే ఆ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న సత్యవర్ధన్ ను బెదిరించి కోర్టులో వాంగ్మూలాలు నమోదు చేయించడం, ఆయనను కిడ్నాప్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో వంశీని అరెస్టు చేసి జైలుకు పంపించారు.
వంశీ జైల్లో ఉన్నప్పుడే.. ఈ టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్ విచారణ పూర్తయి తీర్పు వచ్చింది. ఆయనకు ముందస్తు బెయిల్ ను హైకోర్టు నిరాకరించింది. దాంతో వేరే కేసులో జైల్లో ఉన్నందున.. ఆ కేసులో బెయిల్ వస్తే పోలీసులు మళ్లీ ఈ కేసులో అరెస్టు చూపిస్తారన్న ఉద్దేశంతో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఆయనకు నిరాశే ఎదురయింది. ఇప్పటికీ సత్యవర్ధన్ పై కిడ్నాప్ కేసులో ఇంకా బెయిల్ పిటిషన్ వేయాల్సి ఉంది.
వంశీకి బెయిల్ రావడం అనేది క్లిష్టమైన వ్యవహారంగా సీనియర్ న్యాయవాదులు చెబుతున్నారు. బెయిల్ షరతుల్లో ప్రధానంగా ఉండేది సాక్షుల్ని ప్రభావితం చేయకూడదని. అయితే వంశీ అసలు బెయిల్ రాక ముందే ఏకంగా ఫిర్యాదు దారునే బెదిరించి.. కిడ్నాప్ చేసి.. బలవంతంగా ఫిర్యాదును ఉపసంహరింప చేశారు. స్వయంగా ఫిర్యాదు దారును తన ఇంటికి తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా విడుదలయ్యాయి. అలాగే విశాఖలో సత్యవర్ధన్ ను ఆయన అనుచరులు షాపింగ్ తీసుకెళ్లిన దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అసలు అరెస్టు కాక ముందు ఫిర్యాదుదారుడిపైనే ఇలా వ్యవహరిస్తే బెయిల్ ఇస్తే ఇక సాక్షులను ప్రభావితం చేయకుండా ఎలా ఉంటారన్న ప్రశ్నలు వస్తాయి. అందుకే కోర్టు అంత తేలికగా వంశీకి బెయిల్ మంజూరు చేయదని అంటున్నారు. ఎగువ కోర్టుల్లోనే ఆయన ప్రయత్నించాల్సి ఉంటుందని అంటున్నారు. మరో వైపు ఆయన భద్రత కారణంగా ఒక్కడినే ఉంచుతున్నారు. కానీ తనను అందరితో పాటు ఉంచాలని ఆయన కోరుతున్నారు.





















