CM Chandrababu: భవానీ ద్వీపం ఇండియా, పాక్ బార్డర్‌లో ఉందా? హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ కట్టలేకపోయా: సీఎం చంద్రబాబు
Bhavani Island | గుంటూరు జిల్లాలోని భవానీ ద్వీపం సర్వే విషయంలో ఎన్డీఆర్ జిల్లాతో వివాదం నెలకొందన్న అంశపై సీఎం చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది ఏమైనా భారత్, పాక్ సరిహద్దులో ఉందా అని ప్రశ్నించారు.

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యాటక రంగ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ సమీపంలోని భవానీ ద్వీపం అభివృద్ధికి సంబంధించి జిల్లా సరిహద్దు వివాదాల వల్ల ప్రాజెక్టులు ముందుకు సాగపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భవానీ ద్వీపం ఏమైనా ఇండియా, పాకిస్తాన్ సరిహద్దులో ఉందా? అని అధికారులను ప్రశ్నిస్తూ, ఇలాంటి చిన్నపాటి వివాదాల వల్ల రాష్ట్ర ప్రగతికి అవసరమైన ప్రాజెక్టులను నాశనం చేయవద్దని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
హైదరాబాద్‌లో ఒక్క ఫ్లై ఓవర్ కట్టలేకపోయాను..
పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ.. భవానీ ద్వీపం గుంటూరు జిల్లా పరిధిలోకి వస్తుందని, అయితే దానిపై సర్వే విషయంలో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల మధ్య కొంత వివాదం నెలకొందని వివరించారు. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు, గతంలో హైదరాబాద్‌లో కూడా ఇలాంటి సాంకేతిక ఇబ్బందుల వల్లే ఒక ఫ్లైఓవర్‌ను నిర్మించలేకపోయానని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ కారణాల వల్ల విజయవాడలో ఐదెకరాల స్థలంలో చేపట్టాల్సిన డిస్నీలాండ్ తరహా ఎమ్యూజ్మెంట్ పార్కు ప్రాజెక్టు అగిపోయిందని, అటువంటి వైఖరిని మార్చుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.


భవానీ ద్వీపం వద్ద మరో 45 ఎకరాల స్థలం అందుబాటులో ఉందని పేరొన్నారు. గతంలో ఎంపికైన సంస్థ ఆసక్తిగా ఉంటే వారినే కొనసాగించాలని, మిగిలిన స్థలాన్ని ఇతర పర్యాటక ప్రాజెక్టులకు కేటాయించి సత్వరమే అభివృద్ధి చేయాలని అధికారులను ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఉన్న చిన్న చిన్న అడ్డంకులను తొలగించి, పర్యాటక రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
అటవీశాఖ అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం..
కలెక్టర్ల సదస్సులో అటవీశాఖ అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శ్రీశైలంలో భక్తులను నిలిపివేయడం వల్ల జరిగిన తొక్కిసలాట, బద్వేలులో ఆలయ కూల్చివేత వంటి అంశాలను ప్రస్తావిస్తూ అధికారుల ప్రవర్తన ఏమాత్రం బాగాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివసిస్తున్న ప్రజలకు తాగునీరు, విద్యుత్, ఇళ్లు వంటి కనీస సౌకర్యాలకు అడ్డంకులు సృష్టించడం అభ్యంతరకరమని పేర్కొన్నారు. ఇలాంటి మొండి వైఖరి వల్లే తీవ్రవాదం వంటి సమస్యలు పుట్టుకొస్తాయని హెచ్చరించారు.
కేంద్ర వన్యప్రాణి చట్టాల సాకుతో అభివృద్ధి పనులను అడ్డుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ‘అయితే మీరు కళ్లు మూసుకోండి.. ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే సహించను’ అని పి.సి.సి.ఎఫ్ చలపతిరావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పోలీసులు పీపుల్స్ ఫ్రెండ్లీగా మారినా, అటవీశాఖలో మార్పు రాకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. సమస్యలుంటే తన వద్దకో లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్దకో రావాలని, కానీ సొంత నిర్ణయాలతో ఇబ్బందులు సృష్టించవద్దని స్పష్టం చేశారు. పద్ధతి మార్చుకోకపోతే తానే స్వయంగా కౌన్సెలింగ్ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ, కలెక్టర్లతో సమన్వయం చేసుకుని సమస్యలను పరిష్కరించాలని డీఎఫ్‌ఓలను ఆదేశించారు. సీఎం పదవి నాకు నాలుగోసారి అని, మీ పద్దతి మార్చుకోకపోతే కూర్చోబెట్టి కౌన్సెలింగ్ ఇస్తా అన్నారు.
ట్రెండింగ్ వార్తలు
























