Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదంపై పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు, CBIకి చెప్పాలని సూచన
తిరుమల లడ్డూ వివాదంలో రాజకీయ నేతలు చేసే ప్రకటనల కంటే, ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు, కోర్టు పర్యవేక్షణలో ఉన్న అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సుప్రీంకోర్టు పిటిషనర్‌కు సూచించింది.

న్యూఢిల్లీ: తిరుమల లడ్డూ వివాదంపై దాఖలైన ఒక కీలక పిటిషన్‌ను విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిరాకరించింది. బహిరంగ ప్రకటనలు, పోస్టర్ల ద్వారా తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదంపై దుష్ప్రచారం వ్యాప్తి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మానురు శ్రీనివాస్ దాఖలు చేసిన ఈ పిటిషన్ W.P.(C) No. 279/2026ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఏదైనా ఉంటే సీబీఐ అధికారులకు చెప్పాలని సూచించింది. తిరుమల లడ్డూ వ్యవహారం శాంతి భద్రతలకు విఘాతం కలిగించే స్థాయికి సమస్య వెళ్లిందని పిటిషనర్ తరఫు లాయర్ పేర్కొన్నారు.
జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరు నిపుణులా అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ పిటిషనర్ ను ప్రశ్నించారు. పబ్లిక్ స్టేట్మెంట్లను సీబీఐ ఆపలేకపోతోందని, ఈ అంశంపై ఎక్కువగా దుష్ప్రచారం జరుగుతుంది కనుక అలాంటి పనులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరగా.. సుప్రీంకోర్టు ఈ పిటిషన్ ను కొట్టివేసింది. ఏదైనా సమస్య ఉందని గుర్తిస్తే, ఏమైనా ఆధారాలు కనుక ఉంటే అధికారులను సంప్రదించాలని పిటిషనర్ కు సీజేఐ ధర్మాసనం సూచించింది.
పిటిషనర్ వాదన ఏంటంటే..
పిటిషనర్ తరపు న్యాయవాది వాదన ఏంటే.. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు, కీలక నేతలు తిరుమల లడ్డూ అంశంపై తప్పుడు ప్రచారం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగే ఛాన్స్ ఉంది. సీబీఐ దర్యాప్తు బృందం కేవలం కల్తీ అంశాన్నే చూస్తుంది తప్ప, ఇలాంటి అంశాలను పట్టించుకోదు. కనుక తిరుమల లడ్డూ అంశంపై దుష్ప్రచారం చేయడం, లేక రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించాలని’ పిటిషనర్ కోరినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందన్న సీజేఐ..
పిటిషనర్ తరఫు లాయర్ వాదనలను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ పిటిషన్ కేవలం నిందితుల వాదనను సమర్థిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో మరో అంశం కనిపించడం లేదు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. కనుక విచారణ పెండింగ్‌లో ఉన్నప్పుడు ఇలాంటి పిటిషన్లను స్వీకరించం సరికాదు. రెగ్యూలర్ విచారణ కొనసాగించడానికి ఆటంకాలు తలెత్తుతాయని’ సీజేఐ సూర్యకాంత్ స్పష్టం చేశారు.
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఆరోపణలు.. సిట్ దర్యాప్తు
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిసిందనే ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ అంశంపై కొందరు రాజకీయ నాయకులు, ఇతర వ్యక్తులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని పేర్కొంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే, ఇప్పటికే ఈ లడ్డూ వివాదంపై విచారణ జరిపేందుకు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశామని సీజేఐ ధర్మాసనం పేర్కొంది. సిట్ విచారణ నివేదిక అంశాల పరిశీలన తరువాత తదుపరి నిర్ణయాలు ఉంటాయని కోర్టు పేర్కొంది. ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి సిట్ నివేదికతో పాటు లడ్డూ వివాదంపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందిస్తుందని ధర్మాసనం గుర్తుచేసింది. ఈ సమయంలో తిరుమల లడ్డూ వ్యవహారంలో ఇలాంటి పిటిషన్లను విచారించడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















