Ind Vs Eng Test Series: ఇంగ్లాండ్ సిరీస్ కు టీమిండియా కెప్టెన్ అతనే.. నమ్మకముంచిన సెలెక్టర్లు.. సిరీస్ కోసం బీసీసీఐ కసరత్తు
గతేడాది ఆసీస్ పర్యటనలో ఘోరంగా భారత్ దెబ్బతినడంతో, బీసీసీఐ పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇంగ్లాండ్ పర్యటన కోసం కసరత్తు చేస్తోంది. ఈ సిరీస్ కు కెప్టెన్ పై కూడా స్పష్టత వచ్చింది.

Team India Captain News: వచ్చే జూన్ లో ఇండియా ప్రతిష్టాత్మక ఇంగ్లాండ్ పర్యటన చేయబోతోంది. అందులో ఐదు టెస్టులను ఆడబోతోంది. జూన్ 20 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్ ద్వారా 2027 ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ ను టీమిండియా మొదలు పెట్టనుంది. అయితే ఇంగ్లాండ్ సిరీస్ కు కెప్టెన్ రోహిత్ శర్మ వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని రోహిత్ సారథ్యంలోనే భారత్ నెగ్గిన నేపథ్యంలో, ఈ సిరీస్ కు కూడా అతడినే కెప్టెన్ గా ఎంపిక చేసే అవకాశముందని సమాచారం. నిజానికి టెస్టుల్లో రోహిత్ ప్రదర్శన అంత బాగా లేదు. అటు ఆటగాడిగా, ఇటు కెప్టెన్ గా తను గతేడాది ఘోరంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా తను కెప్టెన్ గా ఉన్నప్పుడే సొంతగడ్డపై 12 ఏళ్ల తర్వాత భారత్ టెస్టు సిరీస్ కోల్పోయింది. న్యూజిలాండ్ 3-0తో ఇండియాను క్లీన్ స్వీప్ చేసింది. అలాగే ఆస్ట్రేలియాలో సిరీస్ ను 3-1తో కోల్పోయింది. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్ కు వెళ్లే అర్హతను భారత్ కోల్పోయింది. అలాగే ప్లేయర్ గాను తాను ఈ సిరీస్ లో ఘోరంగా విఫలమయ్యాడు.
స్వయంగా తప్పుకున్న రోహిత్..
కెప్టెన్ గా టీమ్ ను లీడ్ చేస్తూ, ఫామ్ కోల్పోవడంతో సిడ్నీలో జరిగిన ఆఖరి టెస్టులో రోహిత్ తనకుతానుగా తప్పుకున్నాడు. ఈ మ్యాచ్ కు జస్ప్రీత్ బుమ్రా సారథ్యం వహించాడు. ఇక ఆ సిరీస్ లో మూడు టెస్టులాడి కేవలం 31 పరుగులు మాత్రమే హిట్ మ్యాన్ చేశాడు. అయితే ఆ తర్వాత నుంచి భారత జట్టు స్థిరపడింది. సొంతగడ్డపై ఇంగ్లాండ్ పై వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. అలాగే మెగా టోర్నీని నెగ్గింది. అందుకే రోహిత్ సారథ్యంపై నమ్మకముంచి, జట్టు పగ్గాలు అతనికే అప్పజెప్పనున్నారు. 2007లో చివరిసారిగా ఇంగ్లాండ్ లో టెస్టు సిరీస్ నెగ్గిన భారత్, అప్పటి నుంచి మరో సిరీస్ కోసం ఎదురు చూస్తోంది.
జట్టు ప్రకటన అప్పుడే..
ఐపీఎల్ చివరివారంలో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టును ఎంపిక చేయనున్నారు. అప్పటికే నాకౌట్ మ్యాచ్ లపై స్పష్టత వచ్చే నేపథ్యంలో ఆటగాళ్ల అందుబాటుపై క్లారిటీ వస్తుంది. సీరీస్ లో ఆడబోయే ప్లేయర్ల గురించి ఆయా ఫ్రాంచైజీలకు బోర్డు సమాచారం ఇవ్వనుంది. ఇక సిరీస్ కోసం బీసీసీఐ భారీగానే సన్నాహకాలు చేస్తోంది. టీమిండియా ప్లేయర్లతో ఇండియా-ఏ టీమ్ ను ఏర్పాటు చేసి, రెండు ప్రాక్టీస్ మ్యాచ్ ను ఇంగ్లాండ్ గడ్డపై ఆడించనున్నారు. ప్రాక్టీస్ మ్యాచ్ ల్లో ఆడటం ద్వారా అక్కడి పరిస్థితులకు అలవాటు కావచ్చనేది బీసీసీఐ ఆలోచనగా తెలుస్తోందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజులు పాటు జరిగే ఈ మ్యాచ్ లను కాంటర్ బరీ, నార్తాంప్టన్ లో ఆడతారు. మే 30, జూన్ 6 నుంచి ఈ మ్యాచ్ లు జరుగుతాయి. ఇక జూన్ 20 నుంచి ప్రారంభమయ్యే ఇంగ్లాండ్ పర్యటన 45 రోజులపాటు సాగి, ఆగస్టు ఫస్ట్ వీక్ లో ముగుస్తుంది. ఈ సిరీస్ లో ఇరుజట్లు ఐదు టెస్టులు ఆడుతాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

