Tirupati To Palani APSRTC Bus Timings: తిరుపతి - పళని మధ్య ఆర్టీసీ సర్వీసు ప్రారంభం - బస్ టైమింగ్స్ ఇవే!
Tirupati To Palani APSRTC Bus Timings: తిరుపతి నుంచి పళనికి బస్ సర్వీస్ ప్రారంభించాలని షష్ట షణ్ముఖ యాత్ర సందర్భంగా పవన్‌కు భక్తులు విజ్ఞప్తి చేశారు. హామీ ఇచ్చినట్టుగానే బస్ సర్వీస్ ప్రారంభించారు.

Tirupati To Palani APSRTC Bus Timings: తిరుపతి-పళని ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య ఆంధ్రప్రదేశ్ నుంచి నూతన ఆర్టీసీ బస్సు సర్వీసును ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురువారం ప్రారంభించారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో వేద పండితులు శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి నూతన బస్సు సర్వీసును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బస్సులో కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. “ఈ ఏడాది ఫిబ్రవరిలో తమిళనాడులో షష్ట షణ్ముఖ యాత్ర చేపట్టాను. యాత్రలో భాగంగా పళని కొండపై వెలసిన సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నాను. అక్కడి భక్తులు పళని నుంచి తిరుపతికి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తోందని చెప్పారు. రెండు, మూడు బస్సులు మారాల్సివస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తమిళనాడు స్టేట్ కందన్ ఛారిటబుల్ ట్రస్ట్, పళని టౌన్ సిటిజన్ ఫోరమ్ సభ్యులు బాలాజీ, సుబ్రహ్మణ్యం వినతి పత్రం అందించారు. వెంటనే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లగా... ఆ మురగన్ ఆశీస్సులతో అరగంటలోనే అనుమతి ఇచ్చారు".
505 కిలోమీటర్లు... 680 రూపాయలు
కలియుగ ప్రత్యక్షదైవం వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో తిరుపతి- పళని మధ్య రెండు లగ్జరీ బస్సులతో సర్వీసులు ప్రారంభించామన్నారు పవన్. తిరుపతి నుంచి పళనికి, పళని నుంచి తిరుపతికి ఒకే సమయంలో ఈ రెండు బస్సులు మొదలవుతాయి. 505 కిలోమీటర్ల ఈ ప్రయాణం దాదాపు 11 గంటలపాటు సాగుతుంది. తిరుపతి నుంచి రాత్రి 8 గంటల సమయంలో మొదలైన బస్సు చిత్తూరు, క్రిష్ణగిరి, ధర్మపురి మీదుగా ఉదయం 7 గంటల సమయంలో పళని చేరుకుంటుంది. పళని నుంచి రాత్రి 8 గంటల సమయంలో బస్సు బయల్దేరనుంది. తిరుపతికి ఉదయం 7 గంటల సమయంలో చేరుకుంటుంది. భద్రతతో కూడిన ప్రయాణం ఇవ్వాలని ఈ సర్వీసులను ప్రారంభించాం. పెద్దలకు రూ.680, చిన్నపిల్లలకు రూ. 380గా టికెట్ ధరలు నిర్ణయించారు. ఇది కలియుగ దైవం వెంకన్న భక్తులకు, అలాగే మురగన్ ఆరాధించే భక్తులకు అనుసంధానంగా నిలుస్తుందని పవన్ తెలిపారు.
భక్తుల అభీష్టం మేరకు బస్ సర్వీసు : రాంప్రసాద్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ “తిరుపతి- పళని రెండు ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు. ఈ రెండు క్షేత్రాలను కలుపుతూ బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. భక్తుల అభీష్టం మేరకు ఈ సర్వీసును అందించడం వల్ల అందరికీ మేలు కలుగుతోంది. రెండు రాష్ట్రాల భక్తుల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పాటుకు ఇది బాటలు వేస్తుంది" అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, శాసనమండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, తిరుపతి శాసనసభ్యుడు ఆరణి శ్రీనివాసులు, ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్ , ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

