India IT Sector: డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ వార్‌తో భారత్ ఐటీకి గడ్డు కాలం - మాస్ లే ఆఫ్స్ తప్పవా?
Trump Tariffs: ప్రతీకార సుంకాలతో ప్రపంచాన్ని బాదేసిన ట్రంప్ నిర్ణయాలు భారత్ పై ఎంత ప్రభావం పడుతుందన్న చర్చ ప్రారంభమైంది. ఐటీ రంగంపై గట్టి ప్రభావం పడుతుందని, మాసే లే ఆఫ్స్ తప్పవని అంచనా వేస్తున్నారు.

India IT Sector Faces Crisis: అమెరికా భారత్ నుంచి చేసుకుంటున్న దిగుమతలపై పెద్ద ఎత్తున పన్నులు విధించింది. డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో తగ్గేది లేదని 25 శాతం టారిఫ్‌లు ప్రకటించారు. భారత్ నుంచి అమెరికాకు సాఫ్ట్ వేర్, సాఫ్ట్ వేర్ అధారిత ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ఇప్పుడు ప్రతీకార పన్నుల్లో భాగంగా వించిన టాక్సుల ప్రభావం ఐటీ రంగంపై చాలా ఎక్కువగా ఉంటుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని కొత్త సుంకాలు విధించడం వల్ల ఐటీ రంగంలో మాస్ లే ఆఫ్స్ ఉండవచ్చని ఎక్కువ మంది నిపుణులు అంచనా వేస్తున్నారు.
భారత జీడీపీలో 31 బిలియన్ డాలర్లు తగ్గే అవకాశం
ట్రంప్ విధించిన 25 శాతం సుంకం కారణంగా భారతదేశ GDP 31 బిలియన్ డాలర్లు తగ్గిపోతుందని ఎమ్కే గ్లోబల్ ఓ నివేదికలో వెల్లడించింది. ఇది మొత్తం GDPలో దాదాపు 0.72 శాతం. 2024 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎగుమతులు 77.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. భారతదేశ అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానంగా అమెరికా కొనసాగుతున్నందున సుంకాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
"మేక్ అమెరికన్ వెల్తీ ఎగైన్" పేరుతో ట్రంప్ సుంకాలు విధిస్తున్నారు. సుంకాలను విధించే నిర్ణయాన్ని ప్రకటిస్తున్న సమయంలో ఆయన భారతదేశ వాణిజ్య విధానాలను విమర్శించారు. "భారతదేశం చాలా చాలా కఠినమైనది. ప్రధాన మంత్రి మోదీ నాకు గొప్ప స్నేహితుడు, కానీ మీరు మాతో సరిగ్గా వ్యవహరించడం లేదు. వారు మా నుండి 52 శాతం వసూలు చేస్తారు , మేము వారి నుండి దాదాపు ఏమీ వసూలు చేయడం లేదు" అని చెప్పుకొచ్చారు.
నియామకాలు తగ్గించుకుంటున్న ఐటీ కంపెనీలు
టారిఫ్ అనిశ్చితి మధ్య ఐటీ కంపెనీలు నియామకాల విషయంలో వేచి చూస్తున్నాయి. అమెరికాకు అతిపెద్ద సేవల ఎగుమతిదారులలో ఒకటైన భారతదేశ ఐటీ రంగం దీని తీవ్రత ఎంత ఉంటుందా అని ఆందోళన చెందుతుంది. ఐటీ రంగం ఇప్పటికే ఆర్థిక అనిశ్చితితో కొట్టు మిట్టాడుతోంది. ఇప్పుడు సుంకాల అంశం మరింత ఇబ్బంది పెడుతోంది. పన్నుల కారణంగా US క్లయింట్లు ఖర్చును తగ్గించుకుంటే తీవ్ర మందగమనాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని ఐటీ రంగం భావిస్తోంది.
ఎమ్కే గ్లోబల్ నివేదిక ప్రకారం ఇప్పటికే ఐటీ సేవలలో నియామకాలు నెమ్మదిగా ఉన్నాయి. నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ మార్చి 2025లో 2.5 శాతం వార్షికంగా , 8 శాతం నెలవారీగా నియామకాలు తగ్గాయి. BPO/ITES రంగం కూడా సంవత్సరానికి 7.5 శాతం తక్కువగా నియమాకాలు జరిపింది. నియామకాలు 'అవసరం' ప్రాతిపదికన ఉంటాయని.. కంపెనీలు హెడ్‌కౌంట్‌ను విస్తరించడం కంటే శ్రామిక శక్తి వినియోగాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
US సుంకాలపై అనిశ్చితి , మాంద్యం భయాలతో అనేక ఐటీ సంస్థలు విచక్షణా వ్యయం , కొత్త నియామకాల గురించి జాగ్రత్తగా ఉంటున్నాయి. TCS, Infosys, Wipro వంటి లార్జ్-క్యాప్ కంపెనీలు తమ కాస్ట్ ఆప్టిమైజేషన్ వ్యూహంలో భాగంగా ఫ్రెషర్లకు ప్రాధాన్యత ఇస్తున్నాయి, FY26లో వరుసగా 40,000, 20,000 , 10,000, 12,000 మంది ఫ్రెషర్లను నియమించుకునే ప్రణాళికలను ప్రకటించాయి.
అతి పెద్ద ఉద్యోగ సంక్షోభం ఎదుర్కోబోతున్న భారత్
ట్రంప్ భారతదేశం నుండి సాఫ్ట్‌వేర్ దిగుమతులపై 20 శాతం సుంకాన్ని కూడా వర్తింపజేస్తే, భారతదేశంలోని ఉద్యోగులందరినీ తొలగించడం తప్ప మాకు వేరే మార్గం ఉండదని రాజేష్ నాయక్ అనే ఐటీ కంపెనీ అధిపతి సోషల్ మీడియాలో చెప్పారు. ఇది మా 16 సంవత్సరాల చరిత్రలో మొదటి తొలగింపు అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
If Trump applies even a 20% tariff on software imports from India, we will have no other option but to layoff all our employees in India.
— Rakesh Nayak (@OdiSriUS) March 9, 2025
I'm preparing for the most difficult decision of my professional life - this will be the first layoff in our 16 year history. 🥲🥲
డాట్-కామ్ సంక్షోభం, సబ్‌ప్రైమ్ సంక్షోభం మొదలైన వాటి కారణంగా ఉద్యోగ సంక్షోభం ఏర్పడింది. వాటిని మించి ఇప్పుడు అతి పెద్ద ఉద్యోగాల తొలగింపు సక్షోంభం అవుతుందని నెటిజన్లు అంచనా వేస్తున్నారు.
రాబోయే ఉత్పాతాన్ని భారత్ ఎలా ఎదుర్కొంటుంది ?
భారతదేశం విదేశీ మూలధనం , చెల్లింపులను ఎక్కువగా పొందే దేశం. టెక్నాలజీ రంగంలో ఉద్యోగ నష్టాలు వినియోగదారుల వ్యయం , ఆర్థిక వృద్ధిని బలహీనపరుస్తాయి. ఈ సంక్షోభాన్ని ఐటీ రంగం ఎలా అధిగమిస్తుందనేది ఇప్పుడు అసలు ప్రశ్న ?





















