Ideas of India 2026 Nara Lokesh: గ్లోబల్ ఎకనామిక్ పవర్‌హౌస్‌గా ఏపీని మార్చడమే లక్ష్యం -ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో నారా లోకేష్
ABP Ideas of India Summit 2026 : వచ్చే 2 దశాబ్దాల్లో గ్లోబల్ ఎకనామిక్ పవర్‌హౌస్‌గా ఏపీని మార్చడమే ప్రధాన ఆశయమని నారా లోకేష్ అన్నారు. ముంబైలో ఐడియాస్ ఆఫ్ ఇండియా కాంక్లేవ్‌లో పాల్గొన్నారు.

Ideas of India 2026 Nara Lokesh: ముంబైలో జరిగిన ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సదస్సులో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర భవిష్యత్తు మరియు అభివృద్ధి ప్రణాళికలపై తన విజన్‌ను పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వచ్చే రెండు దశాబ్దాల్లో గ్లోబల్ ఎకనామిక్ పవర్‌హౌస్‌గా మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన ఆశయమని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. 2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. గతంలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నగరాన్ని ఐటీ హబ్‌గా మార్చిన అనుభవం తమకు ఉందని, ఇప్పుడు అదే తరహాలో ఏపీలో వికేంద్రీకృత అభివృద్ధిని అమలు చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా విశాఖపట్నం, అమరావతి, తిరుపతి వంటి ప్రాంతాలను ఆర్థిక క్లస్టర్లుగా మారుస్తూ మొత్తం 22 పారిశ్రామిక జోన్లను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
పెట్టుబడుల ఆకర్షణకు వినూత్న వ్యూహాలు
రాష్ట్రానికి పెట్టుబడులను రాబట్టడంలో పోటీ ఉన్నప్పటికీ, వ్యాపార నిర్వహణలో వేగం , స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తమ ప్రత్యేకత అని లోకేష్ పేర్కొన్నారు. ఐటీ కంపెనీలకు కేవలం 99 పైసలకే భూమిని కేటాయించడం వెనుక ఉన్న ఆర్థిక లాజిక్కును ఆయన వివరించారు. భూమిని విక్రయించడం కంటే ఒక శక్తివంతమైన ఎకోసిస్టమ్ నిర్మించడం ముఖ్యం అని ఆయన అభిప్రాయపడ్డారు. ఉదాహరణకు విశాఖలో కాగ్నిజెంట్ వంటి సంస్థలకు భూమి ఇవ్వడం ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగాల సృష్టితో పాటు, ఏటా రూ. 1500 కోట్ల ఆర్థిక కార్యకలాపాలు సాగుతాయని, ఇది భూమి విలువ కంటే ఎంతో ప్రయోజనకరమని స్పష్టం చేశారు.
సోషల్ మీడియా నియంత్రణకు చట్టం
యువత , పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సోషల్ మీడియాపై కఠినమైన నిబంధనలు తీసుకురాబోతున్నట్లు లోకేష్ వెల్లడించారు. 11 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియాకు దూరంగా ఉండేలా, 16 ఏళ్ల లోపు వారికి పరిమిత కంటెంట్ మాత్రమే అందుబాటులో ఉండేలా వచ్చే 90 రోజుల్లో కొత్త చట్టం తెస్తామని ప్రకటించారు. ఇక తిరుపతి లడ్డూ కల్తీ వివాదంపై ఆయన స్పందిస్తూ, ప్రభుత్వ ప్రతినిధిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు క్షమాపణలు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా తిరుమలలో అంతర్జాతీయ స్థాయి నాణ్యత పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఏపీలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్
కేంద్రంతో సంబంధాల విషయంలో ఘర్షణ వైఖరి కంటే సామూహిక సమాఖ్యవాదాన్ని తాము నమ్ముతామని లోకేష్ వివరించారు. ప్రధాని మోదీ చంద్రబాబు నాయుడు కలయికను డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ గా అభివర్ణించిన ఆయన, అందుకే దేశంలోకి వచ్చే మొత్తం పెట్టుబడుల్లో 25 శాతం వాటాను ఏపీ దక్కించుకోగలిగిందని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో తనది అన్నదమ్ముల అనుబంధమని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో చట్టాన్ని అతిక్రమించి ఇబ్బందులు పెట్టిన వారి పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయని, వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. అమరావతి నగరం దేశం గర్వపడేలా నిర్మాణం అవుతుందని, పెట్టుబడిదారులకు ఇది సరైన సమయమని ఆయన పిలుపునిచ్చారు.























