Delhi liquor case: రౌస్ అవెన్యూ కోర్టు తీర్పుపై స్టే ఇవ్వండి - ఢిల్లీ హైకోర్టులో గంటల్లోనే సీబీఐ పిటిషన్
Delhi liquor Scam case: ఢిల్లీ లిక్కర్ కేసును కొట్టివేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టులో సీబీై పిటిషన్ దాఖలు చేసింది. తీర్పు వచ్చిన గంటల్లోనే సీబీఐ వేగంగా స్పందించింది.

CBI challenges Rouse Avenue court verdict in High Court: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా ఇతర నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని సీబీఐ తన పిటిషన్‌లో కోరింది.
ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన అవినీతి కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా , బీఆర్ఎస్ నాయకురాలు కె. కవిత సహా 23 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితులపై మోపిన అభియోగాలకు తగిన సాక్ష్యాధారాలు లేవని, నేరపూరిత కుట్ర జరిగినట్లు ఎక్కడా నిరూపితం కాలేదని ప్రత్యేక న్యాయమూర్తి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో అనేక లోపాలు ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది.
ట్రయల్ కోర్టు తీర్పు వెలువడిన కొద్ది గంటల్లోనే కేంద్ర దర్యాప్తు సంస్థ దీనిని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణలో భాగంగా తాము సేకరించిన కీలక అంశాలను మరియు సాక్ష్యాలను ట్రయల్ కోర్టు సరిగ్గా పరిగణనలోకి తీసుకోలేదని సీబీఐ వాదించింది. దర్యాప్తు సంస్థ సమర్పించిన సాక్ష్యాధారాలను విస్మరించడం వల్ల న్యాయం జరగలేదని, తక్షణమే ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని హైకోర్టును కోరింది.
రౌస్ అవెన్యూ కోర్టు తీర్పుతో ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇది తమ నిజాయితీకి దక్కిన విజయమని, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తప్పుడు కేసులు పెట్టారని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు హాలులోనే ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. సత్యమే గెలిచిందని, న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని ఆప్ నాయకులు పేర్కొన్నారు.
#BREAKING | केजरीवाल पर फैसले के खिलाफ HC पहुंची CBI@chitraaum | @DhirendraSinha1 | @Aloksharmaaicchttps://t.co/smwhXUROiK
— ABP News (@ABPNews) February 27, 2026
#ChitraTripathiOnABP #MahaDangalWithChitra #DelhiExciseCase #RouseAvenueCourt #ArvindKejriwal #AAP #Acquitted pic.twitter.com/U0RZ4v57O9
అయితే, సీబీఐ హైకోర్టుకు వెళ్లడంతో ఈ వివాదం మళ్లీ మొదటికి చేరింది. సుమారు రెండేళ్లుగా సాగుతున్న ఈ కేసులో ఇప్పటికే కేజ్రీవాల్, సిసోడియా తదితరులు జైలు శిక్షను అనుభవించి బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇప్పుడు ట్రయల్ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ, హైకోర్టు ఈ అప్పీల్‌ను స్వీకరించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది రాజకీయంగా, న్యాయపరంగా అత్యంత ఆసక్తికరంగా మారింది.























