Car Safety Tips In Summer: మీ కార్‌ను కన్నకొడుకులా చూసుకోండి, ఈ తప్పులు చేస్తే మిగిలేది బూడిద!
Car Safety Tips: వేసవిలో కారు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ వాతావరణంలో కారుకు మంటలు అంటుకోవచ్చు. వేసవిలో ఈ తప్పు చేయకండి, లేకుంటే మీ కారు కాలిపోవచ్చు.

Dont Make These Mistakes In Summer In Car: వేసవి ఎండ మండిపోతోంది. దేశవ్యాప్తంగా వడగాలులతో వాతావరణం ఉడికిపోతోంది & వేడిని భరించలేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మండే ఎండలు, తీవ్రమైన వేడి జనంతో పాటు మూగజీవాల జీవితాలకు కూడా పరీక్ష పెడుతున్నాయి. ఈ వేడి జీవులను మాత్రమే ప్రభావితం చేయదు, నిర్జీవులను కూడా నిప్పుల కుంపటిలో నిలబెడుతుంది.
మన దేశంలో కోట్ల మంది కార్లు ఉపయోగిస్తున్నారు. మండే ఎండల నుంచిఉపశమనం కోసం, సాయంత్రం పూట కారులో షికారు తిరిగొస్తుంటారు. వేసవి సెలవులు కూడా వస్తున్నాయి కాబట్టి, దూర ప్రాంతాలకు హాలిడే ట్రిప్‌లు ప్లాన్ చేసి ఉంటారు. అయితే, ఈ వేసవిలో కారుకు కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. దానికి ప్రాణం లేదు కదా, ఎండలు ఏం చేస్తాయిలే, ఇష్టం వచ్చినట్లు వాడేస్తానంటే అస్సలు కుదరదు. ఈ వేడి వాతావరణంలో కారుకు మంటలు అంటుకోవచ్చు. సాధారణంగా, కార్లలో అగ్నిప్రమాదాలు వేసవిలోనే ఎక్కువగా జరుగుతుంటాయి.
ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి
వేసవిలో కారుకు మంటలు అంటుకోవడానికి అతి పెద్ద కారణం, కార్ వేడెక్కడం. మీ కారును ఎక్కువ సేపు ఎండలో పార్క్ చేస్తే అది వేడెక్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వేడెక్కడం వల్ల కార్‌లోని బ్యాటరీ లేదా వైర్లు కరిగిపోయి కలిసి అతుక్కుపోతాయి. దీని కారణంగా షార్ట్ సర్క్యూట్ అవుతుంది & కారు మంటల్లో చిక్కుకుంటుంది. కాబట్టి, వేసవి కాలంలో మీ కారును ఎండలో ఎక్కువ సేపు పార్క్ చేయకండి. ఎక్కువ సేపు పార్క్ చేయడం తప్పనిసరైనప్పుడు, నీడ ఉండే ప్రాంతం చూసుకోండి.
CNG కార్ ఓనర్లకు మరింత జాగ్రత్త అవసరం
మీకు CNG (Compressed Natural Gas) కారు ఉంటే ఈ వేసవి కాలంలో మీరు దాని పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకపోతే, త్వరగా ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు. CNG కారులో గ్యాస్ కిట్ ఉంటుందని మీకు తెలుసు. వేడి వాతావరణం వల్ల ఆ CNG కిట్ లీక్ కావడానికి అవకాశాలు ఉంటాయి. అంటే, పెట్రోల్ & డీజిల్ కార్లతో పోలిస్తే CNG కార్లలో మంటలు చెలరేగే అవకాశాలు ఎక్కువ. గ్యాస్ కిట్‌లో లీకేజీ సమస్య ఉందని మీకు అనుమానం వస్తే, ఆలస్యం చేయకుండా మీ కార్‌ను సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లండి & సమస్యను సత్వరం పరిష్కరించండి. ఇది మీ & మీ కుటుంబ సభ్యుల ప్రాణాలకు సంబంధించిన విషయం కాబట్టి నిర్లక్ష్యంగా ఉండొద్దు.
కారు లోపల ధూమపానం చేయొద్దు
కొంతమందికి కార్‌లో షికారుకు వెళ్తూ సిగరెట్ తాగడం మహా సరదా. వేసవి కాలంలో కూడా మీరు కార్‌లో ధూమపానం చేస్తుంటే, ఆ సిగరెట్‌తో పాటు మీ కార్ కూడా కాలిపోవచ్చు. ధూమపానం మహా ఖరీదైన వ్యవహారంగా మారవచ్చు. వేసవి వేడి వాతావరణంలో, కార్‌లో స్మోకింగ్ వల్ల మ్యాట్స్ లేదా సీట్ కవర్లకు మంటలు అంటుకునే ఛాన్సెస్ ఎక్కువ.
ఈ జాగ్రత్తలు తీసుకోండి
- మీ కార్‌ను నీడలోనే పార్క్ చేయండి
- ఇంజిన్ & వైరింగ్‌ను తరచూ చెక్ చేయించండి
- పెట్రోల్ & డీజిల్, పేపర్లు వంటి త్వరగా మంటలు అంటుకునే వస్తువులను కార్ లోపల నిల్వ చేయొద్దు
- కార్‌లో ధూమపానం చేయవద్దు, ఏ రూపంలోనూ అగ్నిని రగిలించవద్దు
- మంటలు ఆర్పే ఫోమ్ వంటివి కార్‌లో ఉంచండి
దురదృష్టవశాత్తు అగ్నిప్రమాదం జరిగితే టెన్షన్ పడవద్దు. ముందుగా, కార్ డోర్ తీసుకుని బయటపడండి. కార్ పేలిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి, వాహనానికి దూరంగా నిలబడండి. కార్ బయటకు వచ్చిన వెంటనే మొదట ఫైర్ ఇంజిన్‌కు, ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేయండి. మీకు గాయాలు అయితే వెంటనే ఫస్డ్ ఎయిడ్ చేసుకుని, ఆంబులెన్స్‌కు కాల్ చేయండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

