Anant Ambani Net Worth: ఏ సంపన్నుడి కొడుకూ అనంత్ అంబానీతో సరితూగలేడు!
Anant Ambani Wealth Value: రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి అనంత్ అంబానీ తీసుకుంటున్న వార్షిక వేతనం రూ. 4.2 కోట్లు. ఇది, అతని అక్క ఇషా అంబానీ జీతంతో సమానం.

How Much Wealth Does Anant Ambani Have: రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ముద్దుల కొడుకు అనంత్ అంబానీ, ద్వారక వరకు 140 కిలోమీటర్ల సుదీర్ఘ ధార్మిక యాత్ర (Anant Ambani's religious pilgrimage)తో ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నారు. అనంత్ అంబానీ, తన 30వ పుట్టిన రోజు (Anant Ambani's 30th birthday) సందర్భంగా ఈ పాదయాత్ర చేస్తున్నారు. ద్వారకాధీశుడి దర్శనంతో పాదయాత్ర పూర్తవుతుంది. భారతదేశంలోనే కాదు, ఆసియాలోనే అత్యంత ధనవంతుడి కుమారుడు అయినప్పటికీ భగవంతుడి దర్శనం కోసం కాలినడకన వెళ్తున్నారని నెటిజన్లు అనంత్‌ను ప్రశంసిస్తున్నారు. అనంత్ అంబానీ, సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా రాత్రి పూట మాత్రమే తన యాత్రను కొనసాగిస్తున్నారు. జంతు ప్రేమికుడైన అనంత్, పాదయాత్ర సమయంలో ఓ కోళ్ల వ్యాన్ ఆపి అందులో కోళ్లను కొన్నారు & వాటికి ప్రాణదానం చేసి మంచి మనస్సు చాటుకున్నారు.
పాదయాత్రలో వార్తల్లోకి వచ్చిన అనంత్ అంబానీ గురించి తెలుసుకోవడానికి ప్రజలు ఆన్‌లైన్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారు. అనంత్ అంబానీ రిలయన్స్ గ్రూప్‌లో ఎలాంటి బాధ్యతలు నిర్వహిస్తున్నారు, అతని జీతం ఎంత, సంపద ఎంత వంటి ప్రశ్నలను గూగుల్ చేస్తున్నారు.
అనంత్ అంబానీకి భారీ జీతం
1995 ఏప్రిల్ 10న జన్మించిన అనంత్ అంబానీ, సువిశాలమైన రిలయన్స్ సామ్రాజ్యాన్ని నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా, ఇంధన రంగంలో ఆయనది కీలక పాత్ర. ఇది, కంపెనీ భవిష్యత్ నిర్మాణంలో అనంత్‌ను ఒక ముఖ్యమైన వ్యక్తిగా నిలుపుతుంది. నివేదికల ప్రకారం, అనంత్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి ఏడాదికి రూ. 4.20 కోట్ల జీతం అందుకుంటున్నారు. ఇది, తన సోదరి (అక్క) ఇషా అంబానీ జీతానికి (Isha Ambani's salary) సమానం. ఈ జీతం అనంత్‌కు ఒక లెక్కలోది కాదు. అతని నిజమైన సంపద కంపెనీ షేర్లు & పెట్టుబడుల నుంచి వస్తుంది. అనంత్ పేరిట ఉన్న అపార సంపద అతన్ని ప్రపంచంలోని అత్యంత సంపన్న యువకులలో ఒకరిగా నిలిపింది.
అనంత్ అంబానీ ఆస్తిపాస్తుల విలువ ఎంత?
నివేదికల ప్రకారం, 2024 నాటికి అనంత్ అంబానీ ఆస్తిపాస్తుల విలువ (Anant Ambani Net Worth) 40 బిలియన్ డాలర్లు లేదా సుమారు 3,35,770 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. పెట్రోకెమికల్స్, ఆయిల్ & గ్యాస్, టెలికాం, రిటైల్ వంటి రంగాలలో విస్తరించి ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్‌లోని అతని వాటా నుంచి ఈ సంపద వచ్చింది. భారత్‌లో రెండో ధనవంతుడైన గౌతమ్ అదానీ (Gautam Adani) కుమారుడు జీత్ అదానీ (Jeet Adani) సంపద విలువ దాదాపు రూ. 1000 కోట్లని అంచనా.
రిలయన్స్‌లో అనంత్ పాత్ర
పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ ఎనర్జీ ప్రధాన విభాగాలుగా ఉన్న రిలయన్స్ ఇంధన వ్యాపారాన్ని అనంత్ పర్యవేక్షిస్తారు. ప్రపంచవ్యాప్తంగా స్థిరంగా పెరుగుతున్న ఇంధన అవసరాల నేపథ్యంలో, అనంత్ పాత్రకు అత్యంత ప్రాధాన్యత ఉంది. దీంతో పాటు, అనంత్ అంబానీ జియో ప్లాట్‌ఫామ్స్, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ బోర్డుల్లోనూ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.





















