Ram Navami 2025: వాల్మీకి మహర్షికి రాముడు దర్శనమిచ్చిన ప్రదేశం ఇది - ఏప్రిల్ 3 నుంచి 11 వరకు పట్టాభిరాముడి బ్రహ్మోత్సవాలు!
ఏప్రిల్ 06 శ్రీరామనవమి. ఈ సందర్భంగా రామచంద్రుడు వాల్మీకి మహర్షికి దివ్య దర్శనభాగ్యం కల్పించిన ప్రదేశం అయిన వాల్మీకిపురంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.

Sri Pattabhirama Swamy Vari Annual Brahmotsavam: వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 3 న ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 11వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఏప్రిల్ 2వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి 9 గం.ల వరకు అంకురార్పణం, సేనాధిపతి ఉత్సవంతో బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. వాహన సేవలు కన్నులపండువగా జరుగుతున్నాయి.
శ్రీరామచంద్రుడు వాల్మీకి మహర్షికి దివ్యదర్శన భాగ్యాన్ని కలిగించిన ప్రదేశమే వాల్మీకి పురం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లాలో ఉంది ఈ పుణ్య ప్రదేశం. లక్ష్మణ, భరత, శతృఘ్న, హనుమంతునితో శ్రీ సీతా సమేతంగా పట్టాభిరాముడిని ఇక్కడ జాంబవంతుడు ప్రతిష్టించాడని స్థలపురాణం. వల్మీకము (పుట్ట) నుంచి శ్రీరామచంద్రుడి విగ్రహం బయటపడినందున ఈ ప్రదేశం వాల్మీకి పురంగా పేరొచ్చింది.
శ్రీ పట్టాభి రామాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు 1997 ఫిబ్రవరి 23న దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి స్వాధీనం చేసుకున్నారు. మరమ్మతులు జరిపిన తర్వాత 2005లో అష్టబంధన మహా సంప్రోక్షణ నిర్వహించారు.
శ్రీ పట్టాభిరామ స్వామి వారికి నిత్యం కైంకర్యాలతో పాటు ఏటా చైత్ర మాసంలో నవాహ్నిక బ్రహ్మోత్సవాలు, శ్రావణ మాసంలో పట్టాభిషేక మహోత్సవాలు, ఆశ్వయుజ మాసంలో పవిత్రోత్సవాలు శ్రీ పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారం నిర్వహిస్తారు.
ఈ ఏడాది ఏప్రిల్ 03 నుంచి 12వ తేదీ వరకు తొమ్మిది రోజులు పాటు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల్లో భక్తులందరూ పాల్గొని శ్రీరామచంద్రమూర్తి వివిధ వాహన సేవలను దర్శించుకుని భగవదనుగ్రహానికి పాత్రలు కావాలని TTD కోరుతోంది. ఇప్పటికే వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు తుదిదశకు చేరాయని టిటిడి పేర్కొంది.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా రోజూ ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు.
వాహనసేవల వివరాలు
03-04-2025
ఉదయం – ధ్వజారోహణం(ఉదయం 8.30 నుండి 9 గంటల వరకు),
రాత్రి – గజవాహనం
04-04-2025
ఉదయం – ముత్యపుపందిరి వాహనం,
రాత్రి – హనుమంత వాహనం
05-04-2025
ఉదయం – కల్పవృక్ష వాహనం,
రాత్రి – సింహ వాహనం
06-04-2025
ఉదయం – సర్వభూపాల వాహనం,
రాత్రి – పెద్ద శేష వాహనం
07-04-2025
ఉదయం – సూర్యప్రభ వాహనం,
రాత్రి – చంద్రప్రభ వాహనం, పల్లకీలో మోహినీ అవతారోత్సవం
08-04-2025
ఉదయం – తిరుచ్చి ఉత్సవం,
రాత్రి – కల్యాణోత్సవం (రాత్రి 8 నుంచి 10 గంటల వరకు)
గరుడ వాహనం (రాత్రి 11 గంటల నుంచి )
09-04-2025
ఉదయం – రథోత్సవం(ఉదయం 9.30 గంటలకు)
రాత్రి – ధూళీ ఉత్సవం( సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు)
10-04-2025
ఉదయం – తిరుచ్చి ఉత్సవం,
రాత్రి – అశ్వవాహనం, పార్వేట ఉత్సవం
11-04-2025
ఉదయం – వసంతోత్సవం (ఉదయం 8 గంటలకు), చక్రస్నానం ( మధ్యాహ్నం 12.05 గంటలకు)
రాత్రి – హంస వాహనం( రాత్రి 8 నుంచి 10 గంటల వరకు), ధ్వజావరోహణం(రాత్రి 10 గంటలకు)
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 8న రాత్రి 8 నుంచి 10 గంటల వరకు శ్రీ సీతారామ కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, రవికె, లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు.
ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయంలో స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7 గంటల వరకు పుష్పయాగం ఘనంగా జరుగనుంది.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా TTD హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.






















