Jayawardene on Rohit Sharma: ఎంతో సమయం పట్టదు! రోహిత్ శర్మ ఫామ్‌పై జయవర్దనె కాన్ఫిడెన్స్
IPL 2022: ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు కోచ్ మహేళా జయవర్దనె అండగా నిలిచాడు. అతడు ఫామ్‌లోకి రావడానికి ఎంతో సమయం పట్టదని ధీమా వ్యక్తం చేశాడు.
ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు కోచ్ మహేళా జయవర్దనె అండగా నిలిచాడు. అతడు ఫామ్‌లోకి రావడానికి ఎంతో సమయం పట్టదని ధీమా వ్యక్తం చేశాడు. మైటీ ముంబయి త్వరలోనే విజయాల బాట పడుతుందని వెల్లడించాడు.
'ఒకసారి రోహిత్ శర్మ ఆరంభాలు చూడండి. అతడు బంతిని కొడుతున్న తీరు అద్భుతంగా ఉంది. బంతిని చక్కగా టైమింగ్ చేస్తున్నాడు. చక్కని ఆరంభాలను ఇస్తున్నాడు. నిజమే, అతడు కాస్త నిరాశపరుస్తున్నాడు. ఆరంభాలను భారీ స్కోర్లుగా మలవడం లేదు. హిట్‌మ్యాన్ డీప్‌గా బ్యాటింగ్ చేయడం మనం చూశాం. 14-15 ఓవర్ల వరకు ఆడటం, భారీ స్కోర్లు చేయడం చూశాం. అతడో క్వాలిటీ ప్లేయర్. అందుకే అతడి గురించి ఎక్కువగా ఆందోళన చెందడం లేదు. త్వరలోనే దంచికొడతాడు' అని జయవర్దనె అంటున్నాడు.
మరోవైపు ముంబయి ఇండియన్స్ వరుసగా ఐదు మ్యాచులు ఓడిపోవడంతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకిలా ఆడుతున్నారోనని ఆందోళన చెందుతున్నారు. జట్టు కూర్పు కుదరకపోవడం, బ్యాటర్ లేదా బౌలర్ షార్ట్ అవ్వడం, బౌలింగ్ సరిగ్గా పడకపోవడంతో నిరాశ పడుతున్నారు. ఓటముల నుంచి తేరుకొని ఆత్మవిశ్వాసం సాధించాలని కోరుకుంటున్నారు. పంజాబ్ మ్యాచులో మంచి స్టార్ట్ ఇచ్చిన రోహిత్ ఔటవ్వడం చాలామందికి బాధ కలిగించింది.
PBKS మ్యాచులో MI ఛేదన ఎలా సాగిందంటే?
ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఓటముల పరంపర కొనసాగుతోంది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇది ముంబై ఇండియన్స్‌కు వరుసగా ఐదో ఓటమి. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లో ఐదు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. అనంతరం ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 186 పరుగులకే పరిమితం అయింది.
ఒత్తిడిలో రనౌట్
ఇక ముంబై ఇండియన్స్‌కు మాత్రం ఆశించిన ఆరంభం లభించలేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ (28: 17 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు), ఇషాన్ కిషన్ (3: 6 బంతుల్లో) వరుస ఓవర్లలో అవుటయ్యారు. అనంతరం యువ బ్యాటర్లు డెవాల్డ్ బ్రెవిస్ (49: 25 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు), తిలక్ వర్మ (36: 20 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) ముంబైని ఆదుకున్నారు. బౌండరీలు కొడుతూ స్కోరును ముందుకు నడిపించారు. అయితే అర్థ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో భారీ షాట్‌కు ప్రయత్నించి డెవాల్డ్ బ్రెవిస్ అవుటయ్యాడు.
అయితే సూర్యకుమార్ యాదవ్‌తో సమన్వయ లోపం కారణంగా కీరన్ పొలార్డ్ (10: 11 బంతుల్లో, ఒక ఫోర్), తిలక్ వర్మ అవుట్ కావడం ముంబైని దెబ్బ తీసింది. సూర్యకుమార్ (43: 30 బంతుల్లో, ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు) వేగంగా ఆడటానికి ప్రయత్నించినా తనొక్కడే స్పెషలిస్ట్ బ్యాటర్ కావడంతో ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో రబడ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. చివర్లో జయదేవ్ ఉనద్కత్ (12: 7 బంతుల్లో, ఒక సిక్సర్) ఆశలు రేపినా ముంబై విజయానికి ఆ ఊపు సరిపోలేదు.