Target Revanth Reddy : రేవంత్‌ను టార్గెట్ చేస్తే కాంగ్రెస్ బలహీనమైనట్లే - పక్కా ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ రాజకీయం !
Telangana: రేవంత్ ను బలహీనం చేస్తే కాంగ్రెస్ ను బలహీనం చేసినట్లేనన్న వ్యూహం బీఆర్ఎస్ అమలు చేస్తోంది. అందుకే రేవంత్ తో పాటు ఆయన కుటుంబాన్ని ప్రధానంగా టార్గెట్ చేస్తోంది.
BRS is implementing the strategy that if Revanth: భారత రాష్ట్ర సమితి రాజకీయ వ్యూహం పక్కా ప్లాన్ ప్రకారం వెళ్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కన్నా రేవంత్ రెడ్డినే ఎక్కువ టార్గెట్ చేస్తోంది. ఒక్కో సారి కాంగ్రెస్ పార్టీని రేవంత్ నాశనం చేస్తున్నారని రాహుల్ కు చెబుతున్నారు కేటీఆర్. గాంధీభవన్ లో గాడ్సే అని.. గాడ్సే శిష్యుడు రేవంత్ అని తాజాగా కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని ప్రత్యేకంగా బలహీనం చేయాల్సిన పని లేదు..రేవంత్ ను బలహీనం చేస్తే చాలని బీఆర్ఎస్ ప్లాన్ చేసుకుంటోంది. హైకమాండ్ వద్ద రేవంత్ పలుకుబడి తగ్గించగలిగితే..ఆయన పనైపోయినట్లేనని తమ పని సులువు అవుతుందని అనుకుంటున్నారు.
బీఆర్ఎస్ కంట్లో నలుసు రేవంత్
కేసీఆర్‌కు ఎదురు లేదు అనుకున్న రోజుల్లో.. ఆయనకు పోటీగా ఉన్న నేత దరిదాపుల్లో లేరు. అయితే కింది స్థాయి నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి పదేళ్లలోనే సీన్ మార్చేశారు. కేసీఆర్ కు తానే ధీటైన నేత అని నిరూపించారు. దీంతో ప్రజలు ఆయన వైపు మొగ్గారు. కేసీఆర్ బదులు సీఎం పీఠం అయన ఎక్కారు. ఒక వేళ రేవంత్ కాకపోతే కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ కు ధీటైన నేత ఎవరూ లేరన్న అభిప్రాయం ఉండేది. 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడానికి అదే కారణమని 2023లో గెలవడానికి కేసీఆర్ ధీటైన నాయకత్వం ఉండటమే కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతారు.
రేవంత్ రెడ్డి ఇంకా యాభైల్లోనే ఉన్న నాయకుడు.ఆయన ఇప్పుడు సీఎంగా స్థిరపడిపోతే తెలంగాణలో ఆయనకు మించిన లీడర్ ఉండరు. ఈ విషయం రాజకీయాల్లో పండిపోయిన బీఆర్ఎస్ నేతలకు తెలియనిది కాదు. ప్రస్తుతానికి రేవంత్ కు ఉన్న పవర్ హైకమాండ్ వద్ద ఉన్న పలుకుబడితో ముడిపడి ఉంది. ఆయనను హైకమాండ్ వద్ద బలహీనపరిస్తే ఆటోమేటిక్ గా తెలంగాణలోనూ బలహీనమవుతారని అప్పుడు కాంగ్రెస్ కూ దిక్కుండనది బీఆర్ఎస్ పెద్దలు ఆలోచిస్తున్నారు. అందుకే ఏకపక్షంగా రేవంత్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు.ఆయనతో పాటు కొడంగల్ నియోజకవర్గాన్ని సోదరుని తరపున చూసుకుంటున్న రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డిపైనా ఆరోపణలు చేస్తున్నారు. ఆయన కుటుంబసభ్యులపై పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. విషయం ఉన్నా లేకపోయినా దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదులు చేసి ఏదో జరుగుతోందన్న అభిప్రాయం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ రాజకీయాన్ని రేవంత్ ఎలా ఎదుర్కొంటారు ?
బీఆర్ఎస్ వ్యూహం రేవంత్ రెడ్డి కి అర్థమైపోేయి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీని కాదని తనను టార్గెట్ చేస్తున్నారని.. తన కుటుంబాన్ని టార్గెట్ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టాలని అనుకుంటున్నారని ఆయనకు సులువుగానే అర్థమైపోయి ఉంటుంది. అందుకే వరంగల్ సభలో రేవంత్ కేసీఆర్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.తాను బీఆర్ఎస్ ను తొక్కకుంటూ వచ్చానని మరోసారి మొలకెత్తనీయనని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. అంటే.. తెలంగాణ రాజకీయం రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.