Hydra Commissioner: కూల్చడాలే కాదు, ఆ అధికారులపై సైతం చర్యలు - హైడ్రా కమిషనర్ రంగనాథ్
Telangana News | సంగారెడ్డి జిల్లాలోని అమీన్ పూర్ మునిసిపాలిటీ పరిధిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. ఆక్రమణలు జరిగాయని, కబ్జాలు అంటూ స్థానికులు రంగనాథ్ కు ఫిర్యాదు చేశారు.
Hydra Commissioner Ranganath visits Ameenpur area | సంగారెడ్డి: ప్రభుత్వ భూముల్లో, చెరువులు, జలాశయాల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలను హైడ్రా కొన్ని నెలల నుంచి కూల్చివేయడం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైడ్రా వ్యవస్థను తీసుకురాగా, ఐపీఎస్ ఏవీ రంగనాథ్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను కూల్చివేయడం మాత్రమే కాదు, అధికారులు తప్పు చేశారని తేలితే వారిపై సైతం చర్యలు తీసుకుంటామని రంగనాథ్ స్పష్టం చేశారు.
అమీన్‌పూర్ మున్సిపాలిటీలో పర్యటించిన హైడ్రా కమిషనర్
సంగారెడ్డి అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మంగళవారం పర్యటించారు. అమీన్‌పూర్ పెద్ద చెరువు, శంభునికుంట, వెంకరమణ కాలనీ, హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీ, పద్మరావు నగర్ ప్రాంతాల్లో పర్యటించిన ఆయన అక్కడి ప్రజలతో కాసేపు మాట్లాడారు. అక్రమ నిర్మాణాలు ఎక్కడ ఉన్నా, ప్రభుత్వం వాటిపై చర్యలు తీసుకుంటుందన్నారు. అమీన్ పూర్ మున్సిపాలిటీ ప్రజలు స్థానికంగా ఆక్రమణలు, అక్రమ లే అవుట్లపై రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లారు. అమీన్ పూర్ చెరువు పరిధిలో అక్రమ నిర్మాణాలు, కబ్జాలపై వరుస ఫిర్యాదులు రావడంతో నేరుగా ఆయన పరిశీలనకు వెళ్లారు. ఇటీవల అమీన్ పూర్ చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపి, కూల్చివేతలు చేపట్టింది.
అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలో పర్యటించి, స్థానికులను కలిసిన అనంతరం హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ.. చాలా రోజుల నుంచి అమీన్‌పూర్ పెద్ద చెరువు ప్రాంతంలో కబ్జాలు, అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. అలుగులు, తూములు ఏదో కారణంతో మూసేయడంతో ఎఫ్‌డీఎల్ పెరిగిందని స్థానికులు తనకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. త్వరలోనే దీనిపై టెక్నికల్ టీమ్‌తో అమీన్ పూర్ చెరువు భూములు, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పై సర్వే చేయిస్తాం అన్నారు. వచ్చే సర్వే నివేదికను ప్రభుత్వానికి అందజేసి, మూడు నెలల్లో ఇక్కడికి మళ్లీ వస్తానని. పద్మావతి లేఅవుట్ పై ఫిర్యాదులు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆక్రమణలకు పాల్పడ్డారని తమ దృష్టికి వచ్చిందన్నారు. హైడ్రాకు అధికారం ఉన్నందున వీటిపై విచారణ చేపట్టి, అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు నిజమని తేలితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అధికారులపై సైతం చర్యలు తీసుకుంటాం..
అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు, పార్కులు, చెరువులు కబ్జాకు గురైనట్లు చాలా ప్రాంతాల నుంచి తమకు ఫిర్యాదులు వస్తున్నాయని రంగనాథ్ తెలిపారు. అధికారులు తప్పు చేసినట్లు తేలితే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫిర్యాదులపై విచారణ చేపట్టి, బాధ్యలపై చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలో చెరువులు, ఇతర జలాశయాల పునరుద్ధరణపై ఫోకస్ చేసింది. నాలాలు, చెరువులు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టడంతో వర్షపు నీరు వెళ్లేందుకు లేక, నీళ్లు కాలనీలను వరదలో మునిగిపోతాయన్నారు. మరోవైపు చెరువులు, జలాశయాలలు లేకపోతే నీటి సమస్య మరింత తీవ్రమవుతోందని, వీటికి అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.