Rishabh Pant Border Gavaskar Trophy Heroics | ఒక్క ఇన్నింగ్స్ తో టెస్ట్ క్రికెట్ క్రేజ్ మార్చేశాడు
టీ20 క్రికెట్ వచ్చాక టెస్ట్ క్రికెట్ క్రేజ్ తగ్గిపోతూ వచ్చింది. అయితే గడచిన ఐదేళ్లలో మూడు ఘటనలు తిరిగి టెస్ట్ క్రికెట్ కు ఊపిరిపోశాయి. మొదటిది 2019 లో జరిగిన యాషెస్ సిరీస్ హెడింగ్లే టెస్టులో 359 పరుగులు ఛేజ్ చేసే క్రమంలో ఒక్క వికెట్ చేతిలో పెట్టుకుని ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ స్టోక్స్ కొట్టిన 135 పరుగులు అండ్ అతని బాజ్ బాల్ మోడల్ టెస్ట్ కెప్టెన్సీ అయితే, రెండోది విరాట్ కొహ్లీ దూకుడైన టెస్ట్ కెప్టెన్సీ. ఇక మూడోది 32ఏళ్లుగా గబ్బాలో టెస్ట్ ఓటమిని ఎరుగుని ఆస్ట్రేలియాను 2020-21 బీజీటీ సిరీస్ లో ఊహకందని ఛేజింగ్ తో వాళ్ల సొంతగడ్డపై మట్టికరిపించిన రిషభ్ పంత్ ఇన్నింగ్స్. ఈ మూడు ఘటనలే టెస్ట్ క్రికెట్ కు తిరిగి జవసత్వాలు తీసుకువచ్చాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా గడ్డపై బీజీటీని నిలుపుకోవాలంటే తప్పనిసరిగా భారత్ గెలవాల్సిన టెస్ట్ మ్యాచ్ లో ఓటమి అంచుల నుంచి జట్టును గెలుపుతీరాలకు చేర్చాడు రిషభ్ పంత్. అప్పటికే నాలుగు టెస్టుల సిరీస్ లో 1-1 తేడాతో సమంగా ఉన్న భారత్..ఓ టెస్టు డ్రా కాగా..నాలుగో టెస్టులో ఆల్మోస్ట్ ఓటమి అంచుల్లోకి వెళ్లిపోయింది. గిల్ కొట్టిన 91 పరుగులు, 211 బంతులు కాచుకుని పుజారా కొట్టిన 56 బంతుల ఇన్నింగ్స్ పోరాటాలు లక్ష్యంగా దిశగా తీసుకువెళ్లినా వికెట్లు పడిపోవటంతో ఆస్ట్రేలియా పట్టు సాధించింది. డ్రా సంగతి అటుంచితే ఆ మ్యాచ్ ఓడిపోతే సిరీస్ నే కోల్పోయే ప్రమాదంలో టీమిండియా పడిపోయిన తరుణంలో రిషభ్ పంత్ ఆడాడు ఓ ఫైటర్ ఇన్నింగ్స్. 138 బాల్స్ లో 9 ఫోర్లు, ఓ సిక్సర్ తో పంత్ కొట్టిన 89 పరుగులతో బిత్తర పోయిన ఆసీస్ గబ్బాలో 32 ఏళ్ల తర్వాత ఓటమిని చవిచూడటంతో పాటు సిరీస్ 1-2 తేడాతో భారత్ కు సమర్పించుకుంది. ఈ మ్యాచ్ ఈ విజయం భారత్ టెస్ట్ క్రికెట్ విజయాల్లో అతిగొప్పవిక్టరీల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్లకు ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ ఆడుతుండటంతో అందరూ గబ్బాలో పంత్ ఇన్నింగ్స్ ను జ్ఞాపకం చేసుకుంటున్నారు.