Revanth Reddy: కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
Telangana News | తెలంగాణలో కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం అని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ లో నిర్వహించిన మాట్లాడుతూ కేసీఆర్ కు రేవంత్ కౌంటర్ ఇచ్చారు.
Telangana CM Revanth Reddy sensational comments on BRS Chief KCR | ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలని తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుకుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నేడు ఉక్కు మహిళ ఇందిరమ్మ 107వ జయంతి సందర్భంగా వారికి నివాళులు, ఈ కార్యక్రమం మా ఆడబిడ్డలకు అంకితం చేశారు. వరంగల్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి, కేసీఆర్ కాస్కో అంటూ సవాల్ విసిరారు. నీ కష్టం ఏందో.. నీ బాధ ఏందో అసెంబ్లీకి రా.. చర్చ పెడదాం అన్నారు. ప్రజల్లోకి వచ్చి మాట్లాడు కేసీఆర్. నువ్వు చెప్పింది మంచి విషయాలు అయితే సరిచేసుకుంటాం. ప్రజలకు మెరుగైన పాలన అందిస్తాం. ఆయన బయటకు రాడట కానీ ఇద్దరు చిల్లర గాళ్లను రోడ్డుపైకి వదిలిండు అంటూ రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పాలకుర్తి గడ్డపై రాక్షసుడ్ని ఓడించింది ఆడబిడ్డే..
ఫామ్ హౌస్ లో పడుకుంటే కేసీఆర్ గురించి తెలువదనుకోకు. నాకు ముందు తెలుసు.. వెనక తెలుసు. ఈ ఆడబిడ్డలు ఆశీర్వదించడం వల్లే ఇవాళ ఈ స్థానంలో ఉన్నాను. ఓరుగల్లు ఆడబిడ్డ (కొండా సురేఖ)కు మంత్రివర్గంలో ప్రముఖ స్థానం కల్పించాం. పాలకుర్తిలో ఒక రాక్షసుడిని ఓడించి పాలకుర్తి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేసింది ఆడబిడ్డనే. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మహిళా అధికారి ఉన్నారు. ఇది ఆడబిడ్డల ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకుంటాం. టాటా బిర్లాలను తలదన్నేల ఆడబిడ్డలను వ్యాపారస్తులుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చిదిద్దబోతోంది.
‘మేం చేసిన పనులకు కాంగ్రెస్ వచ్చి కొబ్బరికాయ కొడుతున్నారని ఒకాయన అంటుండు. పదేళ్లుగా కాళోజీ కళాక్షేత్రం పూర్తి చేయనప్పుడే మీ బుద్ధి బయటపడింది. మీరు చేయలేదు కాబట్టే.. మేం పూర్తి చేసాం. వరంగల్ గడ్డపై రైతు డిక్లరేషన్ తో తెలంగాణలో కాంగ్రెస్ రూపురేఖలు మారాయి. ఓరుగల్లులో మొదలైన పోరాటంతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. కానీ పనిచేసే వారి కాళ్లల్లో కట్టెలు పెడితే వచ్చేసారి మీకు డిపాజిట్లు కూడా దక్కవు అని రేవంత్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్ కు ధీటుగా వరంగల్ అభివృద్ధి
వరంగల్ ను హైదరాబాద్ కు ధీటుగా తీర్చి దిద్దాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. చారిత్రాత్మక వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాం. అందుకే వరంగల్ అభివృద్ధికి దాదాపు రూ.6 వేల కోట్లు కేటాయించాం. వరంగల్ లో అభివృద్ధి జరిగితే సగం తెలంగాణ అభివృద్ధి జరిగినట్లే. వరగంల్ ను అభివృద్ధి చేసే వరకు నిద్రపోయేది లేదు. బీఆర్ఎస్ కుట్రలు, కుతంత్రాలు చేయొచ్చు.. కానీ మీ కుట్రలు గుర్తుపట్టి ఊచలు లెక్కబెట్టిస్తామంటూ మాజీ సీఎం కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
10 నెలల్లో తెలంగాణలో ఏం జరిగిందంటే..
తెలంగాణ ప్రజలు ఏదో కోల్పోయారో తెలుసుకున్నారని కేసీఆర్ మాట్లాడుతుండు. కానీ 10 నెలల్లో తెలంగాణలో మహిళలు స్వేచ్ఛను పొందారు. కేవలం అదానీ, అంబానీ లకే పరిమితమైన సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు చేసే స్థాయికి రాష్ట్ర మహిళలు ఎదుగుతున్నారు. కాంగ్రెస్ పాలనలో ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం పొందారు. రూ.500లకే ఆడబిడ్డలకు గ్యాస్ సిలిండర్, దేశంలో ఎక్కడైనా ఇలా అందిస్తున్నారా? అర్హులైన ప్రతీ పేద కుటుంబం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. కేసీఆర్ తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చాలనుకున్నారు. మీరు ఫాం హౌస్ లోనే ఉండటం మంచిది. మీకు కావలసినవి అక్కడికే పంపిస్తా.
మీ ఇంట్లో నలుగురు ఉద్యోగం కోల్పోయారు.. ఇందిరమ్మ ప్రభుత్వంలో 10 నెలల్లో 50వేల ఉద్యోగాలు భర్తీ చేసి చూపించాం. భద్రకాళీ, సమ్మక్క సారక్క అమ్మవార్ల సాక్షిగా చెప్పాం. 22 లక్షల రైతు కుటుంబాలకు రూ.18వేల కోట్లు రుణమాఫీ చేశాం. మిగిలిన అందరికీ రుణమాఫీ చేసే బాధ్యత మాది. కనీసం మీకు మమ్మల్ని అభినందించే మనసు లేదు కానీ.. శాపనార్ధాలు పెడుతుండ్రు అని కేసీఆర్ తీరుపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వరి వేసుకుంటే ఉరే అని చెప్పిన కేసీఆర్ తెలంగాణలో ఎక్కడా లేని విధంగా రైతులు 66 లక్షల 1కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం రైతులు పండించారు. దేశంలో ఎక్కడా ఈ స్థాయిలో వరి ధాన్యం పండిచలేదు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Also Read: Hydra Commissioner: కూల్చడాలే కాదు, ఆ అధికారులపై సైతం చర్యలు - హైడ్రా కమిషనర్ రంగనాథ్