Pithapuram Latest News: చంద్రబాబుకే గుర్తింపు లేదంటే ఇక మా పరిస్థితేంటి? పిఠాపురంలో వర్మకు మళ్లీ కోపమొచ్చింది!
Pithapuram Latest News: స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంద్ర సమావేశంలో పెట్టిన ప్లెక్సీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో చిన్నదిగా పెట్టారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Pithapuram Latest News: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకే మీరు గుర్తింపు ఇవ్వడం లేదంటే, ఇక మమ్మల్ని ఏం గౌరవిస్తారు. కూటమిలో అధికారులే చిచ్చు పెడుతున్నట్లుగా పరిస్థితి ఉందంటూ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం పిఠాపురం మున్సిపల్ కళ్యాణ మండపంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో పారిశుద్ధ్య కార్మికులకు శిక్షణ సందర్భంగా వర్మ మున్సిపల్ కమిషనర్ కనకరావును ప్రశ్నించారు. కార్యక్రమం ప్రారంభంలో స్టేజిపై ఉన్న ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో రెవెన్యూ స్టాంపు సైజులు చిన్నదిగా ప్రచురించడంపై వర్మ అధికారులను నిలదీశారు. చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మాకు ఎలాగూ గౌరవం ఇవ్వరూ కనీసం ముఖ్యమంత్రికైనా గౌరవం ఇవ్వరా అంటూ నిలదీశారు. దీంతో కమిషనర్ కనకారావు వర్మకు సర్థి చెప్పే ప్రయత్నం చేసినా వర్మ పట్టించుకోలేదు.
కూటమిలో అధికారులే చిచ్చుపెడుతున్నారంటూ మండిపడ్డ వర్మ..
నేను ఊరుకున్నా, మా పార్టీ కార్యకర్తలు ఊరుకోరంటూ మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే వర్మ.. ఇది సరికాదు, కూటమిలో చిచ్చుపెట్టేది అధికారులేనంటూ అసహనంతో వర్మ భావోగ్వేదానికి లోనయ్యారు. ఎవరినైనా గౌరవించాల్సిందే. ఇది మూడు పార్టీలకు వర్తిస్తుంది. ఇప్పటికే చాలా సార్లు ఇటువంటి అవమానాలు జరిగాయని ఆవేదనను వెళ్లగక్కారు. ఇలా మీ ప్రవర్తన ఉంటే, మమ్మల్ని కార్యక్రమాలకు కూడా పిలవడం అనవసరం, పిలిచి అవమానించకండంటూ అధికారులకు వర్మ సూచించారు. తాను సమావేశంలో ఉండటం సరికాదంటూ లేచి వెళ్లిపోయారు. అధికారుల తీరుపట్ల టిడిపి కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం తెలిపారు.
మరోసారి పిఠాపురం కూటమిలో బీటలు..
పిఠాపురం నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యేగా పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ దాదాపుగా అన్ని కార్యక్రమాలు జనసేన ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. కేవలం టిడిపి అతిథి పాత్రకు మాత్రమే పరిమితమైంది. బీజేపీ కూడా టిడిపి బాటలోనే నడుస్తోంది. తాజాగా వర్మ వ్యాఖ్యలు కూటమి నేతల్లో చర్చ రేపాయి. బహిరంగ సమావేశాల్లో వర్మ ప్రశ్నలు కూటమి నేతలను కలవరపెడుతున్నాయని అంటున్నారు. పార్టీ పరంగా వర్మ కార్యకర్తలకు బలంగా ఉన్నప్పటికీ, క్షేత్ర స్థాయిలో జనసేన-టిడిపి కలవడం ఇక్కడ కష్టతరంగా మారింది. గతం నుంచి ఇదే విధానం కొనసాగడం, రెండేళ్ల పాలన పూర్తైన కూటిమి నేతల్లో ఎటువంటి మార్పులు రాకపోవడంతో రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ ప్రభావం ఉండే అవకాశాలున్నాయని కూటమి కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు






















