Betting Apps promotion Case: బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు, సిట్ చీఫ్‌గా రమేష్
తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసును సీరియస్‌గా తీసుకుంది. సిట్ ఏర్పాటు చేస్తామని రేవంత్ ప్రకటించగా.. తాజాగా సిట్ ఏర్పాటైంది. డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

Betting Apps promotion Case | హైదరాబాద్: తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. మొత్తం 5 గురు పోలీస్ అధికారులతో స్పెషల్ టీం ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్ గా సీఐడి డీజీ ఎం రమేష్‌ను నియమించారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సిట్ టీంలో సీనియర్ పోలీస్ అధికారి ఐజీ రమేష్ రెడ్డి, ఎస్పీలు సింధు శర్మ, వెంకట లక్ష్మి, అడిషనల్ ఎస్పీ చంద్రకాంత్, డీఎస్పీ శంకర్ సభ్యులుగా ఉంటారు. 90 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
అన్ని కేసులు సిట్‌కు బదిలీ..
ఆన్లైన్ బెట్టింగ్ కు సంబంధించి కేసులను సిట్ కు బదిలీ చేయనున్నారు. ఆన్లైన్ బెట్టింగును నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలను సైతం సిట్ ప్రభుత్వానికి సూచించనుంది. పేమెంట్ లకు సంబంధించిన వ్యవహారాలపై RBI కి సిట్ సూచనలను చేయనుంది. పంజాగుట్ట, సైబరాబాద్, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో 25 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి. ఇతర పోలీస్ స్టేషన్లలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్లకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. ఇదివరకే యాంకర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. యాంకర్లు విష్ణుప్రియ, శ్యామల సహా పలువురు విచారణకు హాజరై బెట్టింగ్ యాప్ వ్యవహారంపై పోలీసుల ప్రశ్నలు ఎదుర్కొన్నారు. తమపై నమోదైన కేసులు కొట్టివేయాలని సెలబ్రిటీలు కోర్టులను ఆశ్రయించగా.. న్యాయస్థానాలు ఆ పిటిషన్లను వాటిని కొట్టివేస్తున్నాయి.
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సీరియస్
సినీ నటులు దగ్గుబాటి రానా, ప్రకాష్‌రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీతోపాటు 25మంది సెలబ్రిటీలపై బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులు నమోదయ్యాయి. ఫణీంద్ర శర్మ అనే వ్యక్తి ఫిర్యాదుతో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న కొందరిపై కేసులు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. టీజీఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేసిన ట్వీట్లతో తెలంగాణ పోలీసులు, ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం స్పందించి పలువురు సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశాయి. ఎవరి వల్ల మీరు మోసపోయారో, బెట్టింగ్ యాప్ లవైపు మిమ్మల్ని ఎవరు మళ్లించారు, వారి కారణంగా మీరు ఎంత మోసపోయారో పోలీసులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేయాలని సజ్జనార్, పోలీసులు బాధితులకు సూచించారు. ఏపీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి బెట్టింగ్ వ్యవహారంపై ప్రత్యేక చట్టం తీసుకురానుందని సీఎం చంద్రబాబు తెలిపారు.
అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రకటన
తెలంగాణ ప్రభుత్వం ఈజీ మనీ వ్యవహారాలను తేలికగా తీసుకోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి, నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. సులువుగా ఏదీ రాదని, కష్టపడి పనిచేయాలని సూచించారు. నటీనటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం ద్వారా అమాయకుల జీవితాలు నాశనం అవుతాయన్నారు. కనుక తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు ఈ వ్యహారాన్ని అంత తేలికగా తీసుకోవడం లేదన్నారు.






















