Ratha Sapthami 2023: సూర్యకాంతిలో పొంగేపాలు సిరుల పొంగుకి సంకేతం, రథసప్తమి విశిష్టత ఇదే!
రథసప్తమి 2023: జనవరి 28 శనివారం రథసప్తమి. ఆదిత్యుడికి అత్యంత ప్రియమైన ఈ రోజున ఆకాశంలో నక్షత్ర కూటమి రధం ఆకారంలో కనిపిస్తుందట. ఈ రోజున ప్రత్యక్షదైవం అయిన సూర్యుడిని పూజించడం వెనుక విశిష్టత ఏంటంటే..
![Ratha Sapthami 2023: సూర్యకాంతిలో పొంగేపాలు సిరుల పొంగుకి సంకేతం, రథసప్తమి విశిష్టత ఇదే! Ratha Saptami 2023 importance and specialty of Ratha Sapthami in telugu Ratha Sapthami 2023: సూర్యకాంతిలో పొంగేపాలు సిరుల పొంగుకి సంకేతం, రథసప్తమి విశిష్టత ఇదే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/18/c5a937132d6124c5d39780f185160dde1674019820266217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ratha Sapthami 2023: చీకట్లను పారద్రోలి సమస్త లోకానికి వెలుగు ప్రసాదించేవాడు సూర్యుడు. ఉదయం బ్రహ్మ దేవుడిగా, మధ్యాహ్నం పరమేశ్వరుడిగా, సాయంత్రం శ్రీ మహా విష్ణువుగా.. త్రిమూత్య్రాత్ముకుడై తెల్లటి ఏడు గుర్రాల రథంపై శ్వేతపద్మాన్ని ధరించి దర్శనమిచ్చే సూర్య భగవానుడిని ప్రత్యక్షదైవంగా కొలుస్తారు. అదితి కశ్యపుల సంతానంగా మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి రోజు సూర్యుడు అవతరించిన రోజే సూర్య జయంతిగా,రథ సప్తమిగా జరుపుకుంటారు. సూర్యరథానికి ఉండే ఏడు గుర్రాలు ఏడు వారాలకు.. రథానికి ఉండే న్నెండు చక్రాలు పన్నెండు రాశులకు సంకేతం. సూర్యుడి పేరుతో ప్రారంభమయ్యేది భానువారం(ఆదివారం).
పుణ్యాన్ని ప్రసాదించే మాఘమాసం
మేషం నుంచి మీనం వరకూ పన్నెండు రాశుల్ని పూర్తిచేయడానికి సూర్యుడి రథానికి ఏడాది పడుతుంది. ఈ పన్నెండు రాశుల్లో సంచరిస్తున్నప్పుడు ఆదిత్యుడిని ఒక్కో నెల ఒక్కో పేరు పెట్టి పిలుస్తారు. మాఘ మాసంలో సూర్యుడు "అర్క'' నామంతో సంచరిస్తాడు. మాఘ అంటే పాపం లేనిదనిని అర్థం. పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అన్నారు. వాస్తవానికి ఉత్తరాయణ పుణ్యకాలం సంక్రాంతి నుంచి ప్రారంభమైనప్పటికీ..పూర్తిగా మొదలయ్యేది మాత్రం రథసప్తమి నుంచే. సంక్రాంతి సమయానికి దక్షిణ దిక్కున ప్రయాణం పూర్తిచేసుకుని..రథ సప్తమి నుంచి ఉత్తర దిక్కున ప్రయాణం ప్రారంభిస్తాడు. అందుకే రథ సప్తమి నుంచి వాతావరణంలో మార్పు కనిపిస్తుంది. ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుంది.
Also Read: ఈ ఏడాది రథసప్తమి ఎప్పుడొచ్చింది, సూర్యుడిని ఎందుకు ఆరాధించాలి
సూర్యకాంతిలో పొంగేపాలు సిరుల పొంగుకి సంకేతం
రథసప్తమి రోజు..ఆరుబయట సూర్యకిరణాలు పడేదగ్గర ఇంటి ముందు ఆవుపేడ పిడకలపై పరమాన్నం చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆరుబయట సూర్య కాంతిలో పొంగేపాలు 'సిరులు పొంగు' కి సంకేతంగా భావిస్తారు. సూర్యోదయానికి ముందే ఇంటిల్లిపాదీ స్నానాలు ముగిస్తారు. గాయత్రీ జపం, ఆదిత్య హృదయం, సూర్యాష్టకం, సూర్య సహస్రం వంటి స్తోత్ర పాఠాలు వల్లిస్తూ పూజలు చేస్తారు.
Also Read: దశాబ్దాల తర్వాత కలసిన శుక్రుడు-శని, ఈ నాలుగు రాశులవారి జీవితంలో ఊహించని మార్పులు
దేశ విదేశాల్లోనూ సూర్యభగవానుడికి పూజలు
మహా విష్ణువు ప్రతిరూపంగా పూజించే సూర్యభగవానుడికి దేశవిదేశాల్లో ఘనంగా పూజలు నిర్వర్తిస్తారు. రథసప్తమి రోజున అరసవల్లి సూర్యదేవాలయం, కర్ణాటకలోని మైసూరు ఆలయాల వద్ద సూర్యమండల, సూర్యదేవర ఊరేగింపులు నిర్వహిస్తారు. తిరుమలలో మలయప్పస్వామిని రథసప్తమి నాడు అలంకరించి- శ్రీదేవి, భూదేవి సమేతంగా సప్త వాహనాలపైన ఊరేగిస్తారు. సూర్యుడి దేవాలయాల్లో కోణార్క్, విరించి నారాయణ క్షేత్రాలు (ఒడిశా), మొధేరా (గుజరాత్) ప్రఖ్యాతమైనవి. ఆయా ఆలయాల్లో రథసప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ. అందుకే సూర్యోపాసన చేస్తే రుణ, రోగ, శత్రుబాధలు నశిస్తాయంటారు. సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజసిద్ధంగా విటమిన్ 'డి' లభిస్తుంది. సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రసరించాలి. అందుకే వైదిక వాజ్మయం.. సంధ్యావందనం, సూర్యనమస్కారాలు,అర్ఘ్యం అనే ప్రక్రియలు ప్రవేశపెట్టారు. అందుకే సూర్యారాధన అత్యంత ఉత్తమం అంటారు పండితులు...
సూర్య గాయత్రి మంత్రం
ఓం భాస్కరాయ విద్మహే మహాధ్యుతికరాయ ధీమహే
తన్నో ఆదిత్యః ప్రచోదయాత్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)