Karthika Masam Special: దక్షుడు, ఇంద్రుడు, చంద్రుడు, రాముడు, కుమారస్వామి ప్రతిష్టించిన శివలింగాలివే...
దక్షుడు యజ్ఞం చేసిన స్థలం ఒకటి, ఇంద్రుడు ప్రతిష్టించిన శివలింగం మరొకటి, సీతారాములు ప్రతిష్టించిన లింగం ఇంకొకటి, చంద్రుడు, కుమారస్వామి కొలువుతీర్చిన ముక్కంటి రూపాలు మరో రెండు. అవెక్కడున్నాయి...
శివతత్వానికి ఆలవాలంగా విలసిల్లే క్షేత్రాలు పంచారామాలు. పంచాక్షరి మంత్రం ధ్వనించే ఈ క్షేత్రాల స్థలపురాణాన్ని స్కంద పురాణం వివరించింది. తారకాసురుడనే రాక్షసుడు పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సు చేసి..ఆత్మలింగాన్ని సంపాదిస్తాడు. వరగర్వంతో ముల్లోకాలనూ పీడించే తారాకాసురుడి నుంచి విముక్తి ప్రసాదించాలని దేవతలంతా విష్ణుమూర్తిని ప్రార్థించగా...కుమారస్వామి చేతుల్లో తారాకాసురుడు మరణిస్తాడని చెబుతాడు. తారకాసురుడిపై యుద్ధానికి వెళ్లిన కుమార స్వామి కంఠంలో కొలువై ఉన్న ఆత్మలింగాన్ని ఛేదిస్తాడు. ముక్కలైన ఆ ఆత్మలింగం ఐదు ప్రదేశాల్లో పడింది. వాటినే పంచారామాలుగా పిలుస్తున్నారు. జీవితకాలంలో ఈ పంచారామాలను ఒక్కసారైనా దర్శించుకుంటే పునర్జమ్మ ఉండదంటాడు. కార్తీకమాసం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయగోదావరి, గుంటూరు జిల్లాల్లో వెలసిన పంచారామ క్షేత్రాల విశిష్టతలేంటో చూద్దాం.
Also Read: ఉపవాసం దేవుడి కోసం మాత్రమే కాదు… ప్రకృతి వైద్యులు చెప్పిన విషయాలు మీరు తెలుసుకోండి
ద్రాక్షారామం
పంచారామాల్లో మొదటిదిగా, త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా విలసిల్లుతున్న పవిత్ర క్షేత్రం ద్రాక్షారామం. ఇది తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఉంది. దక్షప్రజాపతి యజ్ఞం నిర్వహించిన ప్రదేశం కావడంతో దీనికి ద్రాక్షారామం పేరు వచ్చిందని చెబుతారు. ద్రాక్షారామం పార్వతీదేవి జన్మస్థలమని భక్తులు విశ్వాసం. ఇక్కడ అమ్మవారు శ్రీచక్రస్థిత మాణిక్యాంబదేవిగా విరాజిల్లుతోంది. అష్టాదశ శక్తిపీఠాలలో ఇదీ ఒకటి. చాళుక్యరాజైన భీముడు ఈ ఆలయాన్ని నిర్మించాడంటారు. ఇక్కడ స్వామివారిని భీమేశ్వరుడిగా కొలుస్తారు. ఈ ఆలయంలో మహాలింగం ఎత్తు 60 అడుగులు. గర్భాలయం రెండు అంతస్తులుగా ఉంటుంది. మహాలింగానికి అర్చకులు పైఅంతస్తు నుంచి అభిషేకాలు చేస్తారు. ఇక్కడి శివలింగం సగం నలుపు, సగం తెలుపు వర్ణంలో ఉంటుంది.
Also Read: కార్తీక పౌర్ణమి, క్షీరాబ్ధి ద్వాదశి... కార్తీకమాసంలో ముఖ్యమైన రోజులివే...
అమరారామం
పంచారామాల్లో అమరారామం రెండోది. ఇది గుంటూరు జిల్లా కృష్ణానది తీరంలో వెలసింది. ఇక్కడ స్వామివారు అమరేశ్వరుడిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమరేశ్వర లింగం ఎత్తు 35 అడుగులు. గర్భాలయంలో 15 అడుగుల లింగం కనిపిస్తుంది. మిగిలిన 20 అడుగులు భూమిలోపల ఉందని చెబుతారు. ఈ లింగాన్ని దేవతల రాజయిన ఇంద్రుడు ప్రతిష్ఠించాడని స్థలపురాణం. అందుకే ఈ క్షేత్రానికి అమరావతి అనే పేరు.
క్షీరారామం
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఉంది క్షీరారామం. ఇక్కడి శివలింగాన్ని త్రేతాయుగంలో సీతారాములు ప్రతిష్ఠించారని విశ్వసిస్తారు. ఇక్కడ శివలింగం శ్వేత వర్ణంలో కనిపిస్తుంటుంది. లింగం పైభాగం మొనదేలి ఉండటం వలన స్వామివారిని 'కొప్పు రామలింగేశ్వరుడు' అని కూడా పిలుస్తారు. ఇక్కడ స్వామివారు ఈశాన్య ముఖస్వరూపుడుగా దర్శనమిస్తాడు. కౌశిక ముని కుమారుడు ఉపమన్యుడు శివుడిని నిత్యాభిషేకానికి కావాల్సిన క్షీరాన్ని కోరాడట. అనుగ్రహించిన పరమేశ్వరుడు స్వయంగా క్షీర సముద్రాన్నే సృష్టించి అక్కడి పుష్కరిణికి పాలు స్రవించేలా చేశాడట. అందుకే క్షీరారామంగా...కాలక్రమేణా పాలకొల్లుగా మారింది. 9 అంతస్తులతో నిర్మించిన 125 అడుగుల ఆలయ గోపురం అపురూప శిల్పసంపదతో విశేషంగా ఆకట్టుకుంటుంది. చాళుక్య రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు.
Also Read: వనభోజనాలు కార్తీకమాసంలోనే చేస్తారెందుకు .. ఉసిరి చెట్టుకిందే తినాలని ఎందుకు చెబుతారు..!
సోమారామం
పంచారామాల్లో సోమారామం నాల్గవది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలో ఉన్నఉంది ఆలయం. ఈ శివలింగానికి ఉన్న ఓ ప్రత్యేకత ఏంటంటే మామూలు రోజుల్లో శ్వేతవర్ణంలో కనిపించే శివలింగం అమావాస్య నాటికి గోధుమరంగులోకి మారుతుంది. తిరిగి పౌర్ణమికి తెల్లగా మెరిసిపోతుంది. చంద్రుడు ప్రతిష్ఠించడం వల్లే ఈ ప్రత్యేకత అని చెబుతారు. సోముడు ప్రతిష్ఠించినందున ఈ క్షేత్రానికి సోమారామం అనే పేరు స్థిరపడింది.
కుమారారామం
పంచారామాల్లో చివరిది కుమారారామం. ఈ దివ్యక్షేత్రం తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు కిలోమీటరు దూరంలో ఉంది. ఇక్కడి శివలింగాన్ని కుమారస్వామి ప్రతిష్ఠించడం వల్ల ఈ క్షేత్రానికి కుమారరామం అన్న పేరు వచ్చింది. భీమేశ్వరలింగం ఎత్తు 14 అడుగులు. రెండతస్తుల మండుపంగల గర్భాలయం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఈ పట్టణానికి చాళుక్య భీమవరం అన్న పేరు కూడా ఉంది. పూర్వం చాళుక్య రాజు భీముడు రాజధానిగా చేసుకుని పాలించాడని చారిత్రక ఆధారాలున్నాయి.
Also Read: కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి… అంత చలిలో అవసరమా…!
Also Read: పన్నెండు నెలల్లో కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం .. ఈ నెలలో ఈ పనులు మాత్రం చేయకండి..!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి