Mysuru Dasara 2024: దసరా ఉత్సవాలకు రారాజు మైసూరు దసరా - రాచరికం ఉట్టిపడేలా జంబూసవారి!
Navratri 2024: దసరాల్లో రారాజు - మైసూర్ దసరా. చాముండేశ్వరిని కొలుస్తూ 10 రోజులు పాటు జరిగే అద్భుతంగా వేడుకలు నిర్వహిస్తారు... నేటికీ మైసూర్ దసరా వేడుకలు అంటే స్పెషల్ క్రేజ్
Mysore Dasara 2024: దేశవ్యాప్తంగా ఏటా దసరా వేడుకలు జరుగుతూ ఉంటాయి. వాటిలో కొన్ని ప్రాంతాల్లో జరిగే వేడుకలకు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అలాంటి వాటిలో మైసూర్ నగరంలో జరిగే దసరా ఒకటి. ఈ వేడుకలు చూసి తరించేందుకు ఎక్కడెక్కడ నుండో టూరిస్టులు, భక్తులు మైసూర్ చేరుకుంటారు. మైసూర్ రాజ వంశీకులు పది రోజులు పాటు జరిపే ఈ ఉత్సవాలను చూడడానికి రెండు కళ్ళు చాలవు. ఈ టైంలో మొత్తం మైసూర్ నగరం విద్యుత్ కాంతులతో వెలిగిపోతుంది.
మహిషాసురుడి రాజధాని - మైసూర్
మైసూర్ అసలు పేరు "మహిషూరు " అని చెబుతారు. పురాణాల ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుడి రాజధాని ఈ నగరం. ప్రజా కంటకుడైన మహిషాసురుడ్ని ఇక్కడికి దగ్గరలో కొండపై కొలువైయున్న చాముండేశ్వరి దేవి తొమ్మిది రోజులపాటు యుద్ధం చేసి పదో రోజున సంహరించింది ఆ విజయాన్ని చేసుకుంటూ ఏటా దసరా వేడుకలు మైసూర్ లో ఘనంగా జరుగుతూ వస్తున్నాయి.
Also Read: అయోధ్య రాముడిని దొంగతనం చేసి జరుపుకునే " కుల్లు దసరా"
విజయనగర సామ్రాజ్య హయాంలో ఘనంగా దసరా వేడుకలు
దక్షిణ భారతదేశానికే గర్వకారణమైన విజయనగర సామ్రాజ్యం హయాంలో దసరా వేడుకలు ఘనంగా జరుగుతూ ఉండేవి. వీటిని చూడడానికి ఇతర రాజ్యాల నుంచి ఇంకా చెప్పాలంటే ఇతర దేశాల నుంచి కూడా అతిథులు వస్తూ ఉండేవారు. ఆ సామ్రాజ్యకాలంలో పర్యటించిన విదేశీ యాత్రికులు ఈ దసరా వేడుకల గురించి తమ పుస్తకాల్లో రాశారు.. ఇవన్నీ నాటి చరిత్రకు సాక్ష్యాలుగా గా నిలిచాయి. విజయనగర సామ్రాజ్యం పతనం అయ్యాక వారి సామంతులుగా ఉన్న మైసూర్ వడయార్లు తమరాజ్యంలోనూ దసరా ఉత్సవాలు జరపడం కొనసాగించారు. 1637లో మైసూర్ స్వతంత్ర రాజ్యాంగ మారినా దసరా వేడుకలు మాత్రం పాత పద్ధతుల్లోనే ఘనంగా జరుగుతూ వచ్చాయి. మధ్యలో కొంతకాలం హైదరాలీ, ఆయన కుమారుడు టిప్పు సుల్తాన్ చేతిల్లోకి మైసూర్ రాజు వెళ్లినా 1799 లో బ్రిటిష్ సేనల చేతిలో టిప్పు ఓటమి తర్వాత మళ్లీ వడయారులకే రాజ్యాన్ని అప్పగించారు బ్రిటిష్ పాలకులు. అప్పటినుండి దసరా ఉత్సవాలు మరింత ఘనంగా జరుపుతూ వస్తున్నారు వడయార్ మహారాజులు.
Also Read: ఉపవాసాల దసరాగా పేరుబడ్డ తమిళనాడు ముత్త రమ్మన్ దసరా గురించి తెలుసా!
దసరా ప్రత్యేకం - మైసూర్ రాజ దర్బార్
మైసూర్ రాజుల రికార్థుల ప్రకారం 1610 లో వడయార్ రాజులు శ్రీరంగపట్నంలో పది రోజుల దసరా వేడుకలకు నాంది పలికారు . 1805లో మూడవ కృష్ణరాజ వడయార్ దసరా ఉత్సవాల్లో మైసూర్ ప్యాలెస్ లో ప్రత్యేక రాజధర్బార్ ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. ఆరోజు రాజ కుటుంబీకులు, రాజ్య ప్రముఖులు, అతిథులు, అధికారులు, ప్రజలు ఒకేసారి దర్బార్ కు హాజరై దసరా వేడుకలను చూసి ఆనందిస్తారు. ఈ సంప్రదాయం 2013 లో శ్రీకంఠ వడయార్ మరణించే వరకు కొనసాగింది. ప్రస్తుతం బంగారు సింహాసనంపై వడయార్ వంశీకులు బదులు వారి రాచఖడ్గం "పట్టడ కత్తి " ని ఉంచి దర్బార్ నిర్వహిస్తున్నారు. దసరా ఉత్సవాల్లో 9వ రోజున ఈ రాజ ఖడ్గాన్ని అంబారి పై ఉంచి ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు తో ఊరేగింపుగా తీసుకొని వచ్చి అమ్మవారి ముందు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సమయంలో జరిగే జంబూ సవారి అత్యంత ప్రత్యేకం. అటవీ అధికారులు తీసుకొచ్చిన ఏనుగుల గుంపుని ప్రత్యేకంగా అలంకరించి జంబూ సవారీ నిర్వహిస్తారు..ఇందులో పాల్గొనబోయే ఏనుగులకు ముందుగానే ప్రత్యేక శిక్షణ ఇస్తారు. సవారీలో భాగంగా దేవతను తీసుకెళ్లే ఏనుగుకు 750 కిలోల హౌడాను ధరింపచేస్తారు...ఇది రాజవైభవానికి చిహ్నం.
Also Read: కాకతీయ వారసులు జరిపే బస్తర్ దసరా గురించి తెలుసా!
మైసూర్ ప్యాలెస్ లైటింగ్ ఒక అద్భుతం
మైసూర్ దసరా ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా మైసూర్ ప్యాలెస్, చాముండేశ్వరి ఆలయాల లైటింగ్ నిలుస్తాయి. ఉత్సవాల సమయంలో విద్యుత్ దీపకాంతులతో మెరిసిపోయే మైసూర్ ప్యాలెస్ చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. కర్ణాటక ప్రభుత్వం మైసూర్ దసరా ఉత్సవాలను రాష్ట్ర పండుగగా జరుపుతోంది. ఈ ఉత్సవాలు చూడడానికి వచ్చే పర్యాటకుల కోసం ప్రత్యేక బస్సులు, రైళ్లు నడుస్తుంటాయి. పది రోజులూ మైసూర్ నగరం అతిథులతో కిటికిటలాడిపోతూ ఉంటుంది.