Bastar Dussehra 2024: కాకతీయ వారసులు జరిపే బస్తర్ దసరా గురించి తెలుసా!
Navratri 2024 Celebration: కాకతీయ వారసులు జరిపే బస్తర్ దసరా గురించి తెలుసా ..దసరా రోజుల్లో రాజ్యం మొత్తం మంత్రికి దానం ఇచ్చేసే రాజులు ..దసరా పూర్తయ్యాకే మళ్ళీ రాజ్యాన్ని స్వీకరించే సంప్రదాయం..
Dussehra Navratri 2024: మన దేశంలో ఎంతో ఘనం గా జరుపుకునే పండుగ దసరా. అయితే ఈ పండుగ దేశం మొత్తం ఒకేలా జరగదు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో నేపథ్యం ఉంటుంది. అలాంటి వాటిలో ఒకటి చత్తీస్ ఘడ్ లోని బస్తర్ లో జరిగే దసరా పండుగ.
10 రోజులపాటు రాజ్యాన్ని వదిలేసి దంతేశ్వరి పూజ లోనే గడిపే రాజు కుటుంబం
బస్తర్ రాజవంశం ఈ దసరాను ప్రారంభించిందని చెబుతారు. రాజా పురుషోత్తమ దేవ్ 15వ శతాబ్దంలో దసరా ఉత్సవాలు ప్రారంభించారు. అయితే ఇవి దేశంలోని ఇతర ప్రాంతాల్లో జరిగే దసరా పండుగలా ఉండవు. ముందుగా ఒకరోజు ఒక చిన్న పాపను రాజవంశ దేవత దంతేశ్వరి దేవి ఆవహిస్తుంది. ఆమె ఒక చెక్క ఖడ్గాన్ని పట్టుకొని ఒక వీరుడి భంగిమలో నిలబడుతుంది. అప్పుడు రాజు ఆమె అనుమతి తీసుకుని ప్రముఖులందరూ చూస్తుండగా తన రాజ్యాన్ని దివాన్ చేతిలో పెడతాడు. ఇది కున్వర్ అమావాస్య రోజు జరుగుతుంది. ఆ తర్వాత పది రోజులు పాటు ఆ దివానే సంస్థానానికి జమీందారుగా వ్యవహరిస్తాడు. రాజు కుటుంబం మొత్తం సామాన్యుల్లా దేవి ఆరాధన లోనే ఉండిపోతారు.
Also Read: దేవినవరాత్రులు ప్రారంభం - అక్టోబరు 03 మొదటి రోజు అలంకారం , నైవేద్యం!
రెండవ రోజున "ప్రతిపాద " అనే కార్యక్రమం జరుగుతుంది. దీనిలో హారతి, నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తారు. 9వ రోజున పల్లకిలో రాజప్రసాదానికి తీసుకువచ్చిన దంతేశ్వరి విగ్రహానికి రాజకుటుంబం స్వయంగా స్వాగతం పలుకుతుంది. పదవ రోజున అమ్మవారి అనుమతితో రాజ్యాన్ని తిరిగి స్వీకరిస్తాడు మహారాజు. అదే రోజు దర్బార్ ఏర్పాటు చేసి ప్రజల నుండి వినతులు స్వీకరిస్తాడు. ఆ రోజే దసరా పండుగ. అంతటి తో దసరా వేడుకలు పూర్తి అవుతాయి. దీనికి ముందు దంతీశ్వరి దేవి కొలువై ఉండే జగదల్పూర్ ఆలయం వద్ద రాజకుటుంబం,బస్తర్ ప్రజలు కలిసి పూజలు జరుపుతారు. అప్పుడు జరిగే ఉత్సవాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. ఇప్పటికీ అదే ఆచారాన్ని కొనసాగిస్తున్నారు బస్తర్ రాజ కుటుంబ వారసులు.
Also Read: దసరా నవరాత్రులు సులువుగా చేసుకునే విధానం...పాటించాల్సిన నియమాలు
కాకతీయ రాజుల వారసులు లేనా?
బస్తర్ రాజ కుటుంబం తమను తాము కాకతీయుల వారసులుగా చెప్పుకుంటారు. 1323లో ఢిల్లీ సుల్తాన్ ల చేతిలో ఓడిపోయిన కాకతీయ ప్రతాపరుద్ర చక్రవర్తిని వారు ఢిల్లీకి తీసుకుపోతున్న సమయంలో తప్పించుకుపోయిన ఆయన తమ్ముడు అన్నమదేవుడు బస్తర్ వెళ్లిపోయి అక్కడ స్థాపించిన రాజ్యమే తమదని చెబుతుంటారు బస్తర్ రాజ కుటుంబీకులు. 1324లో స్థాపించిన ఈ రాజ్యం 1948లో స్వతంత్ర భారతంలో చేరిపోయింది. మహారాజ కమల్ చంద్ర బంజ్ దేవ్ ఆ కుటుంబ వారసుడిగా ప్రస్తుతం ధార్మిక విధులు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆయన తన పూర్వీకులు పరిపాలించిన వరంగల్ ప్రాంతాన్ని సందర్శించారు.అయితే వీరి వంశ చరిత్రపై చరిత్రకారుల్లో భిన్నవాదన లు ఉన్నాయి. మీరు కాకతీయుల వారసులే అంటూ కొందరు నిర్ధారిస్తుండగా.. కాకతీయులతో వీరికి సంబంధం లేదని మరికొందరు వాదిస్తుంటారు.దీనిలోని నిజా నిజాలు ఏంటన్నది పక్కన పెడితే ఈ రాజ కుటుంబీకుల ఆధ్వర్యంలో జరిగే బస్తర్ దసరా మాత్రం దేశంలో జరిగే మిగిలిన దసరా వేడుకలతో పోలిస్తే చాలా డిఫరెంట్ గా ఉంటుంది.
Also Read: దసరాల్లో మీ ఇంట ఆధ్యాత్మిక శక్తిని పెంచేందుకు వాస్తు ప్రకారం అనుకూలమైన రంగులివే!