Pastor Death Mystery: హైదరాబాద్ పాస్టర్ రాజమండ్రిలో అనుమానాస్పద మృతి - లోకేష్ దృష్టికి తీసుకెళ్లిన మహాసేన రాజేష్
Rajahmundry: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై రాజమండ్రిలో హైటెన్షన్ నెలకొంది. ఆయనను చంపేశారని అనుచరులు అంటున్నారు. పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.

Pastor Praveen Pagadala: ప్రముఖ క్రైస్తవ ప్రబోధకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. రాజమండ్రి దివాన్ చెరువు- కొంతమూరు హైవేలో నాలుగో బ్రిడ్జి దగ్గర ప్రవీణ్ పగడాల రోడ్డు పక్కన మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గమనించారు. బైక్ ప్రమాదంలో ఆయన మృతి చెందినట్లు తొలుత భావించినా ప్రవీణ్ పగడాల మృతదేహంపై ఉన్న గాయాలతో ఆయన స్నేహితులు, బంధువులు, అనుచరులు దీన్ని అనుమాస్పద మృతిగా భావిస్తున్నారు.
హైదరాబాద్ లో ఉండే పాస్టర్ ప్రవీణ్ పగడాల రాజమండ్రి ఎందుకు వచ్చారు?
ప్రవీణ్ పగడాల హైదరాబాద్ లో పాస్టర్ గా ఉన్నారు. ఆయనకు రాజమండ్రిలో ఎలాంటి కార్యక్రమాలు లేవు. అయితే ఆయన రాజమండ్రికి వచ్చి బైక్ మీద వెళ్లారు. కొంతమూరు హైవే పక్కన అనుమానాస్పద స్థితిలో ప్రవీణ్ మృతదేహం కనిపించింది. అంతేకాకుండా ఒంటిపై గాయాలు ఉండటంతో ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణ జరపాలని పాస్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి ప్రమాదం జరిగిన స్థలం వరకు సంబంధించిన మొత్తం సీసీ ఫుటేజీని పోలీసులు విశ్లేషిస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ మృతికి సినీనటుడు రాజా కూడా సంతాపం తెలిపారు.
ఆయనను పిలిపించిన వారు ఎవరు ?. బైక్ పై కట్ట మీదకు ఎందుకు వెళ్లారు ?
హైదరాబాద్ లో నివసించే వ్యక్తి రాజమండ్రి ఎందుకు వచ్చారని బైక్ పై ఎందుకు తిరుగుతున్నారనే విషయాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రవీణ్ పగడాల అనుచరులు, స్నేహితులు ఆయన్ను హత్య చేసి ఉంటారన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ముఖం మీద గాయాలు, రాడ్ తో కొట్టినట్లు చితికిపోయి ఉండటాన్ని అనుమానంగా తీసుకుంటున్న ప్రవీణ్ పగడాల స్నేహితులు..ఆయన శరీరానికి తక్షణమే పోస్ట్ మార్టమ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. నెలరోజుల క్రితమే తన ప్రాణాలకు హాని ఉందని ప్రవీణ్ పగడాల సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఎవరో ఉద్దేశపూర్వకంగానే క్రైస్తవ సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేయాలని ఇలా పాస్టర్ ను హత్య చేశారని ఆరోపిస్తున్నారు.
సీసీ ఫుటేజీని విశ్లేషిస్తున్న పోలీసులు
క్రైస్తవ మత ప్రచారకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై విచారణ చేయాలని మహాసేన రాజేష్ డిమాండ్ చేశారు. రాజమండ్రిలో అనుమానాస్పద రీతిలో చనిపోయిన పాస్టర్ మృతిపై ఉన్న అనుమానాల మీద విచారణ జరగాలని కోరిన మహాసేన రాజేష్..ఈ విషయాన్ని మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు.పాస్టర్ ప్రవీణ్ కు ఉన్న వివాదాలు, ఆర్థిక లావాదేవీలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అసలు రాజమండ్రి ఎందుకు వచ్చారు.. ఎవరు చంపి ఉంటారన్నదానిపై ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పరిశోధన చేస్తున్నారు.





















