YSRCP : వైఎస్ఆర్‌సీపీలో మళ్లీ ఆ సీనియర్లకే జిల్లాలను రాసిచ్చిన జగన్ - ఓటమికి బాధ్యుల్ని చేయకుండా పెత్తనం ఎందుకిస్తున్నారు ?
YSRCP senior leaders have been announced as district incharges dissatisfaction among the cadre
YSRCP senior leaders : వైఎస్ఆర్‌సీపీలో పరిస్థితుల్ని చక్క బెట్టాలని జగన్ అనుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీగా పూర్తి రోల్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాల అధ్యక్షుల్ని నియమించారు. చాలా చోట్ల సీనియర్లకు అవకాశం కల్పించారు. తాజాగా ఆరుగురు సీనియర్ నేతలకు ఆ బాధ్యతలు ఇచ్చారు. వారు కొత్తవాళ్లు కాదు. గత ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన వాళ్లే. వాళ్ల వాళ్ల జిల్లాల్లో ఘోరంగా ఓటములు తెచ్చి పెట్టిన వాళ్లే. జిల్లాలు మార్చినా మళ్లీ వారికే బాధ్యతలివ్వడంతో వైసీపీ క్యాడర్‌లో నమ్మకం ఏర్పడటం లేదు.
ఆ ఆరుగురే పార్టీని నడిపేది !
ఆంధ్రప్రదేశ్ ని ఆరుగా విభజించి ఆరుగురు కోఆర్డినేటర్లకు జగన్ బాధ్యతలిచ్చారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాలకు ఎంపీ మిథున్ రెడ్డిని నియమించారు. గతంలో మిధున్ రెడ్డి గోదావరి జిల్లాలకు ఇంచార్జ్ గా ఉన్నారు. ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు జిల్లాల ఇంచార్జ్ గా వ్యవహరించనున్నారు. గత ఎన్నికల్లో అనంతపురం , చిత్తూరు జిల్లాలకు ఇంచార్జ్ గా ఉన్నారు. అయోధ్యరామిరెడ్డికి ఈ సారి ఉమ్మడి కృష్ణా జిల్లా ఇచ్చారు. వైవీ సుబ్బారెడ్డికి కడప, అనంతపురం, కర్నూల్ జిల్లాలకు ఇంచార్జ్ పదవి ఇచ్చారు. విజయసాయిరెడ్డికి ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం జిల్లాలకు ఇంచార్జులుగా ఇచ్చారు.
సరైన ప్రతిపక్షం లేకనే టీడీపీ ఎమ్మెల్యేల ఇష్టారాజ్యం - చంద్రబాబు అడ్డుకట్ట వేయగలరా ?
మళ్లీ వాళ్లకేనా అని క్యాడర్‌లో ఆేదన !
ఇంచార్జుల జాబితా ప్రకటన తర్వాత పార్టీని పాతాళంలోకి నెట్టింది వీరే అయినా మళ్లీ వీళ్లకే ఎందుకు చాన్స్ ఇచ్చారన్న ప్రశ్నలు క్యాడర్ నుంచి వస్తున్నాయి. పెద్దిరెడ్డి, ఆయన కుమారుు మిధున్ రెడ్డి గత ఎన్నికల్లో బాధ్యతలు తీసుకున్న జిల్లాల్లో వైసీపీ తుడిచి పెట్టుకుపోయింది. చిత్తూరు, అనంతపురం జిల్లాల ఇంచార్జిగా ఉన్న పెద్దిరెడ్డి రెండు సీట్లలో మాత్రమే పార్టీని గెలిపించగలిగారు. అందులో ఆయన ఒకటి, ఆయన సోదరుడు మరొకటి గెలిచారు. మిథున్ రెడ్డి రెండు గోదావరి జిల్లాలకు ఇంచార్జిగా వ్యవహరించారు. కానీ ఒక్కటీ గెలవలేదు. ఉత్తరాంధ్రకు వైవీ సుబ్బారెడ్డి, బొత్స ఇంచార్జులుగా చేశారు. రెండు ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల్లో తప్ప దిగ్గజాలు కూడా గెలవలేదు. అంటే ఇప్పుడు జిల్లాలకు బాధ్యతలు తీసుకున్న వారంతా గత ఎన్నికల ఫలితాలకు బాధ్యత వహించాల్సిన వారే. కానీ అందరికీ మళ్లీ పెత్తనం వచ్చింది.
పార్టీ క్యాడర్‌లోనే కాదు బయట కూడా అన్ని వర్గానికేనా అన్న చర్చ జరుగుతోంది. మొత్తం ఆరుగురు ఇంచార్జుల్లో ఐదుగురు ఒకే సామాజికవర్గానికి చెందినవారు. ఒక్క బొత్స మాత్రమే ఇతర వర్గం. ఆయనకు ఉభయగోదావరి జిల్లాలు ఇచ్చారు. గతంలో వైసీపీలో బీసీలకు ఇతర వర్గాలకు పదవులు ఇచ్చినా పవర్ మాత్రం ఓ వర్గం చేతుల్లో ఉంటందని ఆరోపణలు వచ్చేవి. ఇప్పుడు పార్టీలో కూడా జిల్లాల అధ్యక్షులుగా ఇతర వర్గాలను నియమించినా కోఆర్డినేటర్లుగా ఒకే వర్గం వారిని పెట్టడంతో ఇక వారిదే పెత్తనం అవుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే జగన్ మాత్రం వారిపైనే నమ్మకం పెట్టుకుంటున్నారు.