Exoplanet Water Vapour: ఎక్సో ప్లానెట్‌లో నీటి ఆవిరి, కొత్త విషయం గుర్తించిన నాసా హబుల్ టెలిస్కోప్
NASA News: ఎక్సోప్లానెట్ పై నీటి ఆవిరి జాడలు బయల్పడ్డాయి. ఈ జాడలను అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నేషనల్ ఏరోనాటిక్స్, స్పేస్ అడ్మినిస్ట్రేషన్ కు చెందిన హబుల్ టెలిస్కోప్ గుర్తించింది.
Water Vapour Found On Exoplanet: ఎక్సోప్లానెట్ (Exoplanet) లేదా ఎక్స్‌ట్రాసోలార్ ప్లానెట్‌గా పిలిచే సౌర వ్యవస్థ (Solar System)కు బయట ఉన్న గ్రహంపై నీటి ఆవిరి జాడలు బయల్పడ్డాయి. ఈ జాడలను అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నేషనల్ ఏరోనాటిక్స్, స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) కు చెందిన హబుల్ టెలిస్కోప్ గుర్తించింది. నాసా వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఎక్సోప్లానెట్ GJ 9827d గ్రహం మూడు సంవత్సరాల వ్యవధిలో 11 సార్లు గమనం చేయగలదని గుర్తించారు.
భూమికి రెండు రెట్లు
నాసా (NASA) ఖగోళ శాస్త్రవేత్తలు హబుల్ స్పేస్ టెలిస్కోప్‌ను ఉపయోగించి వాతావరణంలో నీటి ఆవిరిని గుర్తించే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎక్సోప్లానెట్(Exoplanet)ను గుర్తించారు. దీనికి GJ 9827d గ్రహం అని పేరును నిర్దారించారు. భూమికి రెండు రెట్లు వ్యాసంతో ఉండే ఈ ఎక్సో ప్లానెట్.. గెలాక్సీలో నీరు అధికంగా ఉండే వాతావరణం కలిగిన ఇతర గ్రహాల అన్వేషణకు ఇది కీలకమని భావిస్తున్నారు.
శుక్ర గ్రహంతో సమానంగా వేడి
నాసా (NASA) శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం కొత్తగా కనుగొన్న ఎక్సోప్లానెట్ 800 డిగ్రీల ఫారెన్‌హీట్ కలిగిఉంది. అంతేకాకుండా.. శుక్రగ్రహం మాదిరిగా ఇది భారీ వేడిని కలిగి ఉందని గుర్తించారు. GJ 9827d 2017లో నాసా (NASA) కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ దీనిని పూర్తిస్థాయిలో అధ్యయనం చేసింది. ప్రతి 6.2 రోజులకు ఒక ఎర్ర మరగుజ్జు నక్షత్రం చుట్టూ ఒక కక్ష్యను పూర్తి చేస్తుంది. అదేవిదంగా GJ 9827 మీన రాశిలో భూమికి 97 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని గుర్తించారు.
ప్రత్యక్షంగా చూపడం తొలిసారి
``వాతావరణాన్ని గుర్తించడం ద్వారా మనం ప్రత్యక్షంగా చూపించగలగడం ఇదే మొదటిసారి. నీరు అధికంగా ఉండే వాతావరణం ఉన్న ఈ గ్రహాలు వాస్తవానికి ఇతర నక్షత్రాల చుట్టూ ఉండగలవు" అని మాంట్రియల్ విశ్వవిద్యాలయంలోని ఎక్సోప్లానెట్‌లపై పరిశోధన చేస్తున్న ట్రాటియర్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన బృంద సభ్యుడు జోర్న్ బెన్నెకే(Jern Bern k) అన్నారు. రాతి గ్రహాలపై వాతావరణం యొక్క ప్రాబల్యం, వైవిధ్యాన్ని నిర్ణయించడానికి ఇది ఒక ముఖ్యమైన దశగా ఆయన పేర్కొన్నారు.
మినీ నెఫ్ట్యూన్
``ఇప్పటి వరకు, మేము ఇంత చిన్న గ్రహం వాతావరణాన్ని నేరుగా గుర్తించలేకపోయాము. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా వాటిని గుర్తిస్తున్నాం`` అని బెన్నెకే తెలిపారు. "ప్రస్తుతం, ఈ గ్రహం ఇప్పటికీ నీటితో నిండిన హైడ్రోజన్-రిచ్ ఎన్వలప్‌ను అంటిపెట్టుకుని ఉంది. దీనిని మినీ-నెప్ట్యూన్‌గా పరిగణిస్తున్నాం.`` అని వివరించారు.
ప్రధాన ఘట్టం
GJ 9827d గ్రహం సగం నీరు, సగం రాతి పలకలతో ఉండి ఉండొచ్చని బెన్నెకే అభిప్రాయపడ్డారు. కొన్ని చిన్న రాతి పలకాలపై నీటి ఆవిరి ఉందని తెలిపారు. నాసా అంచనా ప్రకారం.. 11 గమనాల సమయంలో GJ 9827d గ్రహం మూడు సంవత్సరాల వ్యవధి పడుతోందని హబుల్ ప్రోగ్రామ్ గమనించింది. కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలోని నాసాకు చెందిన అమెస్ రీసెర్చ్ సెంటర్‌లోని ఖగోళ భౌతిక శాస్త్రవేత్త థామస్ గ్రీన్ మాట్లాడుతూ, "నీటిని పరిశీలించడం ఇతర విషయాలను కనుగొనడానికి ఇది ఒక ప్రధాన మార్గంగా మారనుంది`` అని వివరించారు. అంతరిక్ష సంస్థ నాసా.. ఇప్పుడు గ్రహం మూలకాల మొత్తం జాబితాను కనుగొనడంపై దృష్టి సారించింది, ఇది కక్ష్యలో ఉన్న నక్షత్రంతో పోల్చడానికి, దాని నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ఏమిటీ గ్రహం?
ఎక్సో ప్లానెట్ (Exoplanet) అనేది సౌర వ్యవస్థ వెలుపల ఉన్న గ్రహం. అసలు ఇది ఉన్నట్టుగా 1917లోనే గుర్తించారు. అయితే.. పూర్తిస్థాయిలో దీనిని గుర్తించి, నిర్ధారించింది మాత్రం 1992లోనే. మొత్తం 4,113 గ్రహ వ్యవస్థల్లో 5,576 నిర్ధారిత ఎక్సోప్లానెట్‌లు ఉన్నాయని గత ఏడాది శాస్త్రవేత్తలు నిర్ధారించరు. అదేవిధంగా 887 వ్యవస్థల్లో ఒకటి కంటే ఎక్కువ గ్రహాలు ఉన్నాయని గుర్తించారు. వీటిపై మరింత అధ్యయనం చేసేందుకు నాసా ప్రయత్నిస్తోంది. దీనికిగాను జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్(JWST)ను వినియోగించాలని నిర్ణయించారు. ఎక్సోప్లానెట్‌ల కూర్పు , పర్యావరణ పరిస్థితులు, వాటి జీవితకాలం తదితర అన్ని అంశాలపైనా అధ్యయనం చేస్తున్నారు.