Chenab Railway Bridge: ఈఫిల్ టవర్ కన్నా ఎత్తైన బ్రిడ్జ్ రెడీ, భూకంపం వచ్చినా చెక్కు చెదరదు
Chenab Railway Bridge: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చింది.
Chenab Railway Bridge:
గోల్డెన్ జాయింట్ సిద్ధమైంది..
శ్రీనగర్‌ను మొత్తం దేశంతో అనుసంధానించే రైలు మార్గం అందుబాటులోకి వచ్చింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే బ్రిడ్జ్ అధికారికంగా ప్రారంభం కానుంది. గోల్డెన్ జాయింట్‌గా పిలుచుకునే ఈ వంతెనను నిర్మించేందుకు ఎంతో మంది సివిల్ ఇంజనీర్లు శ్రమించారు. 1315 మీటర్ల పొడవు, 359 మీటర్ల ఎత్తు ఉన్న ఈ బ్రిడ్జ్...పారిస్‌లోని ఈఫిల్ టవర్ ఎత్తు కన్నా ఎక్కువ. 476 మీటర్లు విల్లు ఆకారంలో,
ఉధంపూర్- శ్రీనగర్-బారాముల్లా రైల్వే సెక్షన్‌లో ఈ బ్రిడ్జ్‌ను నిర్మించారు. ఈ నిర్మాణానికి మొత్తం రూ.28 వేల కోట్లు ఖర్చు చేశారు. కాట్రా, బనహల్ ప్రాంతాల మధ్య ఈ బ్రిడ్జ్ కీలక మార్గం కానుంది. అంతేకాదు. ప్రపంచంలోనే నదికి రెండు వైపుల మాత్రమే సపోర్ట్ చేసుకుని.. మధ్యలో ఏ సపోర్ట్ లేకుండా ఉన్న వంతెనల్లో ఇది ఏడోది. ఈ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి రోజుకు 1,400 మంది శ్రమించారు. నిర్మాణం 2004 లో ఈ వంతెన నిర్మాణం ప్రారంభమైంది. అయితే...మధ్యలో కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి. 2008 నాటికే అందుబాటులోకి తీసుకు రావాలని చూసినా...అది వీలుపడలేదు. మళ్లీ ఇన్నాళ్లకు నిర్మాణ పనులు వేగవంతమై...వంతెన అందుబాటులోకి వచ్చింది. గంటకు 260 కిలోమీటర్ల వేగంతో గాలులు వచ్చినా..ఈ వంతెన చెక్కు చెదరదని చాలా ధీమాగా చెబుతున్నారు ఇంజనీర్లు. కనీసం 120 సంవత్సరాల పాటు ఇది మన్నికగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.
J&K | Golden joint of world's highest Chenab railway bridge to be launched today
— ANI (@ANI) August 13, 2022
This has been a long journey. The term 'Golden Joint' was coined by civil engineers.... It's the world's highest railway bridge: Sanjay Gupta, Chairman & MD, Konkan Railway pic.twitter.com/BxAss9BtWf
లోయప్రాంతాలకు రవాణా సులభం..
111 కిలోమీటర్ల కాత్రా- బనహల్ రైల్వే సెక్షన్ నిర్మాణంలో భాగంగా...చేపట్టిన ఈ వంతెన నిర్మాణం విజయవంతంగా పూర్తైంది. మిగతా రైల్వే మార్గాలను నిర్మించేందుకు హిమాలయాల్లోని కొన్ని ప్రాంతాలను తవ్వుతున్నారు. 111 కిలోమీటర్ల నిర్మాణం కోసం సుమారు 97 కిలోమీటర్ల మేర టన్నెలింగ్ చేపట్టాల్సి ఉంటుంది. దేశంలో రైలు మార్గాల నిర్మాణం కోసం ఎక్కడా ఈ స్థాయిలో తవ్వకాలు చేపట్టలేదని అధికారులు చెబుతున్నారు. 86 కిలోమీటర్ల మేర ఇప్పటికే టన్నెలింగ్ పూర్తైంది. ఈ బ్రిడ్జ్‌లో మొత్తం 17 పిల్లర్లు ఉన్నాయి. నిర్మాణం కోసం మొత్తం 28,660 మెట్రిక్ టన్నుల ఉక్కుని వినియోగించారు. ఈ బ్రిడ్జ్‌ని విల్లు ఆకారంగా మలిచేందుకు దాదాపు 10,619 టన్నుల ఉక్కుని వినియోగించాల్సి వచ్చింది. ఇది సాధారణ ఉక్కు కాదు. మైనస్ 10 డిగ్రీల ఉష్ణోగ్రతల నుంచి 40 డిగ్రీల సెల్సియస్ వరకూ తట్టుకునే సామర్థ్యం దీని సొంతం. దీనిపై రైలు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోవచ్చు. భూకంపాలను, బాంబు దాడులనూ తట్టుకుని నిలబడగలదు. ఈ బ్రిడ్జి పూర్తైనందున.. జమ్మూ కాశ్మీర్‌లోని లోయ ప్రాంతాలకు రవాణా మార్గం సులభం కానుంది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుంది.
Also Read: Har Ghar Tiranga: జాతీయ జెండా పాడైతే ఎలా డిస్పోస్ చేయాలో తెలుసా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Also Read: Salman Rushdie: ఎవరీ సల్మాన్ రష్దీ? ఆయన రాసిన బుక్ ఎందుకు వివాదాస్పదమైంది?