Heart Attack: చిన్న వయసులోనే గుండెపోటు.. ప్రమాదంలో భారత యువత, కారణాలు ఇవే..
భారత యువతను గుండె జబ్బులు పొట్టన పెట్టుకుంటున్నాయి. చిన్న వయస్సులోనే ప్రాణాలు తీసుకుంటున్నాయి. అధ్యయనాలు కూడా భారత యువత ప్రమాదంలో ఉన్నట్లు హెచ్చరిస్తున్నాయి.
‘బిగ్ బాస్’ సీజన్ 13 విజేత, ‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్‌లో కలెక్టర్‌గా ఆకట్టుకున్న సిద్ధార్థ్ శుక్లా గురువారం గుండె నొప్పితో చనిపోయారు. ఆయన వయస్సు కేవలం 40 ఏళ్లు మాత్రమే. ఆయన క్రీడల్లో కూడా చురుగ్గానే పాల్గొంటాడు. నిత్యం వ్యాయయం కూడా చేస్తాడు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని కూడా తీసుకుంటాడు. అయినా సరే.. ఆయన గుండె నొప్పితో చనిపోయారు. హీరో అర్జున్ బంధువు, కన్నడ నటుడు చిరంజీవి సర్జ కూడా 39 ఏళ్ల వయసులోనే గుండె పోటుతో మృతి చెందారు. మరి, గుండెపోటుకు కారణాలేమిటీ? చిన్న వయస్సులోనే గుండె జబ్బులు ఎందుకు వస్తున్నాయి? ఆకస్మిక గుండె నొప్పికి కారణాలేమిటీ? ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే ఏం చేయాలి?
ఒకప్పుడు గుండె జబ్బులు, డయాబెటీస్ వంటి రోగాలు వయస్సు పైబడిన తర్వాతే కనిపించేవి. కానీ ఈ రోజుల్లో.. అరవైలో వచ్చే వ్యాధులు ఇరవైలోనే దాడి చేస్తున్నాయి. నిండు నూరేళ్లు జీవించాల్సిన మనిషి.. మధ్యలోనే ప్రాణాలు వదిలేస్తున్నాడు. ముఖ్యంగా మన దేశంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది. చిన్న వయస్సులోనే గుండెపోటుతో ఎంతోమంది మరణిస్తున్నారు. ఇటీవల జరిపిన పలు అధ్యయనాల్లో మరెన్నో భయానక వాస్తవాలు బయటపడ్డాయి. ఇండియాలో చాలామంది 30 నుంచి 50 ఏళ్ల లోపు వయస్సులోనే తీవ్రమైన గుండె నొప్పితో మరణిస్తున్నారని తెలిసింది.
జీన్సే కారణమా?: ఇటీవల జరిపిన ఓ పరిశోధన ప్రకారం.. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే దక్షిణాసియా దేశాల ప్రజల్లోనే గుండె సమస్యలతో బాధపడేవారి సంఖ్య నాలుగు రెట్లు ఎక్కువ ఉన్నట్లు తేలింది. ఇందుకు జీన్స్ మాత్రమే కాదు.. మారుతున్న జీవన శైలి కూడా కారణమని పరిశోధకులు తేల్చి చెప్పారు. నాగరికత పెరిగే కొద్ది ప్రజల లైఫ్‌స్టైల్ కూడా మారుతోంది. ఫలితంగా ప్రజల ఆరోగ్యం క్రమేనా క్షీణిస్తోంది. 2030 నాటికి ఇండియాలో 80 మిలియన్ మంది డయాబెటీస్‌తో బాధపడుతుంటారని అంచనా.
భారత జనాభాలో సుమారు 10 శాతం యువత ఇప్పటికే పలు లైఫ్‌స్టైల్ రోగాలతో బాధపడుతున్నారు. అధిక బరువులేని వ్యక్తుల్లో కూడా టైప్-2 డయాబెటీస్ ఏర్పడుతోంది. రక్తపోటు, ఊబకాయం సమస్యల వల్ల ఆరోగ్యం క్షీణిస్తోంది. ఉప్పు, కొవ్వులు, చక్కెర అధికంగా ఉండే ఆహారాన్ని అతిగా తీసుకోవడం కూడా ఒక కారణం. వీటి వల్ల శరీరంలో చెడు కొవ్వులు బాగా పెరిగిపోతాయి. దీంతో హైపర్ టెన్షన్ పెరిగి గుండెపై ఒత్తిడి పెరుగుతుంది.
ఎవరికి ఎక్కువ ముప్పు?: గ్రామీణ ప్రాంతాల్లో నివసించే భారతీయ యువత కంటే.. పట్టణాల్లో నివసించే యువతకే ఎక్కువ ముప్పు పొంచి ఉంది. సరైన ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం, నిద్రకు దూరం కావడం ఇందుకు ప్రధాన కారణాలు. కొందరు అర్ధరాత్రిళ్లు కూడా నిద్రమానుకుని మొబైళ్లు, టీవీలు, ఓటీటీలు చూస్తుంటారు. ఆ అలవాటు వల్ల వారు తెలియకుండా తమ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. ఒత్తిడి, డిప్రషన్ కూడా పెరుగుతుంది. ఫలితంగా డయాబెటీస్, ఊబకాయం వంటి సమస్యలు ఏర్పడతాయి. అవి క్రమేనా గుండె జబ్బులకు దారి తీస్తాయి.
మధుమేహ రోగులూ జాగ్రత్త: దేశంలో చిన్న వయస్సులోనే చాలామంది డయాబెటీస్ (మధుమేహం) బారిన పడుతున్నారు. డయాబెటీస్ వల్ల గుండె జబ్బులు వస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల ధమనుల్లో రక్తం గడ్డకడుతుంది. వీటినే బ్లడ్ క్లాట్స్ అని కూడా అంటారు. రక్తం గడ్డ కట్టడం వల్ల గుండెకు వెళ్లే రక్త ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడతాయి. ఫలితంగా గుండె నొప్పి వస్తుంది. వెంటనే చికిత్స పొందకపోతే గుండె ఆగిపోయి చనిపోయే ప్రమాదం కూడా ఉంది.
చెడు అలవాట్ల వల్ల కూడా: చెడు అలవాట్లు కూడా గుండె జబ్బులకు దారితీస్తుంది. ముఖ్యంగా దూమపానం, మద్యపానం గుండెను మరింత బలహీనం చేస్తాయి. నేటి యువత చిన్న వయస్సులోనే స్మోకింగ్, డ్రింకింగ్‌కు అలవాటు పడుతున్నారు. సిగరెట్లు, బీడీల్లో ఉండే కార్బన్ మోనాక్సైడ్ మన రక్తంలోని ఆక్సిజన్ శాతాన్ని తగ్గించేస్తుంది. దాని వల్ల శరీరంలోని అవయవాలు పాడవుతాయి. ముఖ్యంగా గుండెకు చాలా హానికరం. గుండె సక్రమంగా పనిచేయాలంటే రక్తంలో ఆక్సిజన్ సరఫరాకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడకూడదు. సిగరెట్ పొగ పేరుకుపోవడం వల్ల ధమనులు మొద్దుబారి కొవ్వు పేరుకుపోతుంది. ఫలితంగా ఆక్సికరణ చెందిన రక్తం గుండె నుంచి శరీరంలోని ఇతర భాగాలకు చేరడం కష్టమవుతుంది. సాధారణంగా ధమనులు వయస్సు పెరిగే కొద్ది గట్టిగా మారుతుంటాయి. అయితే, ఆల్కాహాల్ తీసుకోవడం వల్ల సాధారణం కంటే వేగంగానే గట్టిపడతాయి. ఫలితంగా రక్తపోటు ఏర్పడి గుండె నొప్పికి దారితీస్తుంది.
ఏం చేయాలి?: మీ గుండె ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ఆరోగ్యానికి హాని చేసే ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. వ్యాయామం చేయడం వల్ల గుండె జబ్బులకు కారణమయ్యే అంతర్గత పరిస్థితులను చక్కదిద్దవచ్చు. మీ కుటుంబంలో ఎవరికైనా ఊబకాయం, గుండె జబ్బు సమస్యలు ఉన్నట్లయితే మీరు తప్పకుండా ముందస్తు స్క్రీనింగ్ చేయించుకోవాలి. తప్పకుండా వైద్యుడి సలహా తీసుకుని తగిన డైట్, ఔషదాలు తీసుకోవాలి.