BCCI Red Alert: ఆ హైదరాబాద్ వ్యాపారితో జాగ్రత్త- ఐపీఎల్ యాజమాన్యాలు, జట్లకు బీసీసీఐ హెచ్చరిక!
BCCI Red Alert: ఫిక్సింగ్ ముగ్గులోకి దింపేందుకు హైదరాబాద్ వ్యాపారి ప్రయత్నాలు చేస్తున్నారని బీసీసీఐ హెచ్చరించింది. ఐపీఎల్ పది జట్లు వారి సపోర్టింగ్ స్టాఫ్ జాగ్రత్తగా ఉండాలని చెప్పింది.

IPL 2025 మ్యాచ్ ఫిక్సింగ్: ఐపీఎల్ ఆటగాళ్లకు, యజమానులకు భారతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త అక్రమ కార్యకలాపాల కోసం ఆటగాళ్లను సంప్రదించే ప్రయత్నాలు చేస్తున్నాడని హెచ్చరికలో పేర్కొంది. ఒక మీడియా నివేదిక ప్రకారం, BCCI అన్ని క్రికెటర్లు, కోచ్‌లు, కమెంటేటర్లు, సపోర్ట్ స్టాఫ్‌కు ఈ అలర్ట్ ఇచ్చింది. ఈ వ్యాపారవేత్త గురించి జాగ్రత్తగా ఉండమని సూచించింది. ఈ వ్యాపారవేత్త అనేక మంది బుకీలతో సంబంధం కలిగి ఉన్నాడని తెలిసింది. ఈ వ్యక్తి టోర్నమెంట్‌లో స్టాఫ్‌ను సంప్రదించి ఖరీదైన బహుమతులు ఇచ్చి బుట్టలో పడేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుస్తోంది.
క్రిక్‌బజ్‌లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం... ఈ వ్యాపారవేత్త సాధారణంగా మొదట జట్టు యజమానులు, ఆటగాళ్ళు, కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్, కమెంటేటర్ల కుటుంబ సభ్యులను సంప్రదించడానికి ప్రయత్నిస్తాడు. యాంటీ-కరప్షన్ యూనిట్ అభిప్రాయం ప్రకారం, ఈ వ్యక్తి గతంలో కూడా అక్రమ కార్యకలాపాల్లో పాల్గొన్నాడు.
ఫ్యాన్‌గా మభ్యపెట్టి మోసం చేస్తాడు
ఈ నివేదికలో, హైదరాబాద్‌కు చెందిన ఈ వ్యాపారవేత్త ఐపీఎల్‌లో పాల్గొంటున్న ఆటగాళ్ళు, కోచ్‌లు కమెంటేటర్లను ఏదో రూపంలో సంప్రదించే ప్రయత్నాలు చేస్తున్నాడు. ముఖ్యంగా ఫ్యాన్ అంటూ చెప్పుకొని వాళ్లకు దగ్గరయ్యేందుకు యత్నిస్తున్నట్టు పేర్కొంది. జట్లు, వారికి సంబంధించిన వాళ్లు ఉండే హోటళ్లు, ఆడే మైదనాల చుట్టూ తిరుగుతూ మచ్చిక చేసుకునేందుకు ట్రై చేస్తున్నాడు. అతను ఆటగాళ్ళు స్టాఫ్‌ను ప్రైవేట్ పార్టీలకు ఆహ్వానించి, ఆభరణాలు సహా అనేక ఖరీదైన బహుమతులు ఇస్తాడు.
ఈ విషయంలో ఐపీఎల్ 2025లో పాల్గొంటున్న అన్ని జట్లు, ఆ జట్ల తరఫున ఆడుతున్న ఆటగాళ్ళు వారికి సహకరించే వారు సహకరించాలని BCCI రిక్వస్ట్ చేసింది. మ్యాచ్ ఫిక్సింగ్ వంటి ఘటనలకు పూర్తిగా వ్యతిరేకం, క్రికెట్ సమగ్రతను కాపాడటానికి కట్టుబడి ఉన్నామని బీసీసీఐ ప్రకటించింది.
గతంలో ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్
2013లో జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ ఘటనను ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అతిపెద్ద స్కామ్‌గా భావిస్తారు. మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్ళు, ఎస్ శ్రీశాంత్, అజిత్ చాండిలా, అంకిత్ చౌహాన్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో తరువాత చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్టు అధిపతులను కూడా అరెస్ట్ చేశారు.




















