Tirumala Latest News: తిరుపతి గోశాలపై రగులుతున్న రాజకీయం- రేపు పవన్ టూర్- మేమే వచ్చి లెక్కలు చూపిస్తామన్న భూమన
Tirumala Latest News: తిరుమల గోశాల వివాదం మరింత ముదురుతోంది. దీనిపై నిజాలు నిగ్గుతేల్చేందుకు రేపు డీసీఎం పవన్ గోశాలను సందర్శించనున్నారు. ఇంతలో ఇవాళే తాము విజిట్ చేస్తున్నట్టు భూమన ప్రకటించారు.

Pawan Tirumala Tour: తిరుమల అంశం మరోసారి రాజకీయ కాకకు కారణమవుతోంది. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో ఆవులు భారీగా చనిపోయాయని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అలాంటిదేమీ లేదని టీటీడీ ప్రకటించింది. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే మాత్రం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ క్రమంలో అక్కడి పరిస్థితులు తెలుసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం తిరుమల వెళ్తున్నారు.
తిరుమలకు వెళ్లనున్న పవన్ కల్యాణ్
గోశాలలో ఆవులు చనిపోతున్నాయని వైసీపీ ఆరోపణలు చేస్తున్న టైంలో పవన్ కల్యాణ్ చేస్తున్న తిరుమల పర్యటన ఆసక్తిగా మారుతోంది. పవన్ కల్యాణ తిరుమల చేరుకొని ముందు తిరుమల వెంకన్న స్వామిని దర్శించుకుంటారు. తన కుమారుడు ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వచ్చిందుకు స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు.
గోశాలపై సమీక్ష చేయనున్న పవన్
స్వామి వారిని దర్శించుకున్న తర్వాత పవన్ కల్యాణ్ టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలను సందర్శిస్తారు. అక్కడ ఉన్న పరిస్థితులు గురించి తెలుసుకుంటాం. జరుగుతున్న ప్రచారంలో నిజానిజాలు నిగ్గుతేల్చనున్నారు. అధికారులతో మాట్లాడి అసలు ఇలాంటి ప్రచారం జరగడానికి కారణాలు గురించి తెలుసుకుంటారు. ఆవుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు, వాటి ఆరోగ్యం కోసం తీసుకుంటున్న జాగ్రత్తలపై సమీక్ష చేయనున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.
నేడు తిరుమల గోశాలకు వెళ్లేందుకు వైసీపీ సిద్ధం
మరోవైపు తిరుపతి గోశాలలో ఆవులు మృతి చెందాయని విస్తృతంగా ప్రచారం చేస్తున్న భూమన కరుణాకర్ రెడ్డి ఇవాళ గోశాలను సందర్శిస్తామని ప్రకటించారు. డిప్యూటీ సీఎం పవన్ పర్యటనకు ముందే వీళ్లు విజిట్ చేస్తామని చెప్పడం రాజకీయ వాతావరణం వేడెక్కింది. బుధవారం మరోసారి మీడియాతో మాట్లాడిన భూమన కరుణాకర్ రెడ్డి... గురువారం పది గంటలకు గోశాలకు వెళ్తున్నట్టు ప్రకటించారు. అక్కడే అన్ని సాక్ష్యాలు బయటపెడతామని చెప్పారు. గోశాల గురించి ఏ మాత్రం అవగాహన లేకుండా టీడీపీ నేతలు తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. గోవులు చనిపోయినట్టు టీటీడీ ఈవో అంగీకరించారని అయినా కూటమి నేతలు బుకాయిస్తున్నారని మండిపడ్డారు.
కూటమి నేతలపై మండిపడతుున్న భూమన
కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తిరుమలను అపచారం చేస్తోందని భూమన ఆరోపించారు. లడ్డూ కల్తీ జరిగిందని తప్పుడు ప్రచారం చేశారని మొన్నీ మధ్య మద్యం బాటిళ్లు కూడా తిరుమలలో దొరికాయని అన్నారు. కొందరు చెప్పులతో ఆలయంలోకి ప్రవేశించారని తెలిపారు. డ్రోన్ కెమెరాలతో ఈజీగా కొండపైకి వెళ్లిపోతున్నారని ఆరోపించారు. ఇప్పుడు గోవులు మృతి చెందుతున్నా పట్టించుకున్న వాళ్లే లేరని ఆవేదన వ్యక్తం చేశారు.
పది నెలలుగా తిరుమలపై జరుగుతున్న ఘటనలు భక్తులను కలవరపరుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు భూమన. ఇలాంటి తప్పులను చూపిస్తున్న తమపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారని కొందరిపై కేసులు కూడా పెడుతునత్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
చంద్రబాబు, అనితపై మల్లాది ఫైర్
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేక పాలన చేతకాక చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి రోజుకో విషయంపై రగడ చేస్తున్నారని వైసీపీ నేత మల్లాది విష్ణు మండిపడ్డారు. తిరుమలలో చాలా కాలంగా జరుగుతున్న అపచారాలపై చర్యలు తీసుకోకుండా తమను హోంమంత్రి బెదిరిస్తున్నారని అన్నారు. అలాంటి భాష మాట్లాడేవాళ్లను క్రిమినల్స్ అంటారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటివి ఎత్తి చూపుతున్న జగన్‌పై మత ముద్ర వేస్తున్నారని అన్నారు. జగన్ హిందూ ధర్మాన్ని కాపాడితే చంద్రబాబు హయాంలో హిందువులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.





















