Viral Video: బాపట్లలో ఈగో పార్కింగ్ - కారును కలిపేసి రోడ్ నిర్మాణం - మరి కారెలా బయటకు తీస్తారు ?
Road and Car : బాపట్లలో ఓ కారును కలిపేసి సిమెంట్ రోడ్ వేసేశాడు కాంట్రాక్టర్. కారు ఓనర్, కాంట్రాక్టర్ మధ్య వచ్చిన ఈగో సమస్యల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని గ్రామస్తులు అంటున్నారు.

Bapatla News: పార్కింగ్ అని ఓ సినిమా ఓటీటీలో వచ్చింది. తమిళంలో వచ్చిన ఆ సినిమా లో ఇద్దరు మనుషుల మధ్య కార్ పార్కింగ్ ఈగో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందన్నది చర్చించారు. చివరికి ఈగో కారణంగా ప్రాణాలు పణంగా పెట్టుకుంటారు. సినిమా కాబట్టి చివరికి తెలుసుకుంటారు. కానీ నిజ జీవితంలో మాత్రం కొన్ని జరగరానివి జరిగిపోతూంటాయి. కొన్ని దారుణాలు.. మరికొన్ని కామెడీ ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కాస్త హిలేరియస్ దే.
కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామాల్లో విస్తృతంగా రోడ్లు వేస్తున్నారు. ఈ క్రమంలో బాపట్ల జిల్లాలోని దేశాయి పేట అనే గ్రామంలోనూ రోడ్లు మంజూరు అయ్యాయి. కాంట్రాక్టర్ కూడా ఎంపికయ్యాడు. ఇక రోడ్డు వేయడం ఆలస్యం. కొలతలు తీసుకుని ఊరందరికీ సమాచారం ఇచ్చాడు. ముఖ్యంగా రోడ్లు ఏయే మార్గాల్లో వేస్తున్నారో వారందరికీ.. కొద్ది రోజుల పాటు వాహనాలు వేరే చోట్ల పెట్టుకోమని చెప్పాడు. అందరూ అతను చెప్పినట్లుగానే చేశారు కానీ ఒక్కరు మాత్రం తన కారును ఇంటి ముందే ఉంచాడు.
కాంట్రాక్టర్ రోజూ వచ్చి చెబుతున్నాడు. ఫలానా రోజు కాంక్రీట్ వేస్తామని చెబుతూ వస్తున్నాడు. అయితే కాంట్రాక్టర్ చెబితే నా ఇంటి ముందు కారును తీయడం ఏమిటని ఓ వ్యక్తి ఈగోకు పోయాడు. తీయకుండా అంతే ఉంచారు. చివరికి రోడ్డు వేసే రోజు కారుకు తాళం వేసుకుని కనిపించకుండా పోయాడు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న రోడ్డు కావడం.. ఇప్పుడు కారు అడ్డంగా ఉన్న కారణంతో ఆపేస్తే మళ్లీ ఎప్పటికి అవుతుందో తెలియదని.. గ్రామస్తులు రోడ్డు వేయాల్సిందేనని పట్టుబట్టారు . అంత కంటే కావాల్సిందేముందని కాంట్రాక్టర్గ తన పని తాను పూర్తి చేశాడు.
బాపట్లలో విచిత్రమైన ఘటన
— ASHOK VEMULAPALLI (@ashuvemulapalli) April 16, 2025
ఇంటిముందు పార్క్ చేసిన కారుని అలాగే ఉంచేసి కాంక్రీట్ రోడ్డు వేసేసిన కాంట్రాక్టర్
బాపట్ల జిల్లా దేశాయిపట్నంలో కొత్తగా సిమెంట్ రోడ్డు వేస్తున్న సందర్భంలో రోడ్డుపక్కనే ఉన్న కారు
ఆ వాహనం తీయాలని ఎన్నిసార్లు చెప్పినా సరే తీయకుండా కారు తాళం వేసి… pic.twitter.com/rqdMC7FLkl
ఆ కారు ఉన్న దగ్గర కూడా కాంక్రీట్ వేశాడు. ఆ కారు టైర్ రోడ్డులో ఇరుక్కుపోయింది. గ్రామస్తులు అంతా కాంట్రాక్టర్ ను సమర్థించారు. ఇప్పుడు ఆ కారు వీడియో వైరల్ గా మారింది. ఈగో సమస్య వల్లనే ఇలాంటి సమస్య వచ్చిందని.. రోడ్డు వేస్తున్నప్పుడు ఎవరైనా కారు తీస్తారని గ్రామస్తులు అంటున్నారు. ఆ కారు ఓనర్.. కాంట్రాక్టర్ తో..గ్రామస్తులతో ఈగోకు పోయి కారుకు డ్యామేజ్ చేసుకున్నాడని అంటున్నారు.
నిజానికి కాంట్రాక్టర్ ఇక్కడ కాస్త ఔదార్యం చూపించారని అనుకోవాలి. ఆ కారును సగం వరకూ పూడిపోయేలా రోడ్డు వేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ కారు సగం రోడ్డు మీదనే ఉంది. కానీ ఆ కాంట్రాక్టర్ మరీ ఎక్కువ ఈగోకు పోకుండా కేవలం ఓ టైర్ మాత్రమే సిమెంట్ లో మునిగేలా రోడ్డు వేశాడు. దాంతో అతని కారు కాస్త డ్యామేజ్‌తోనే బయటపడింది.



















