Christmas Tree: క్రిస్మస్ రోజు ఆ ట్రీ ఎందుకు పెడతారు? ఆ సాంప్రదాయం ఎలా మొదలైంది?
Christmas Tree Tradition: క్రైస్తవ మతావిర్భావానికి ముందే క్రిస్మస్ ట్రీ సంప్రదాయం ఉండేదా? ఉంటే దాని పేరేమిటి? అసలు క్రిస్మస్ ట్రీ వెనుకున్న అర్థం ఏమిటి?
క్రిస్మస్ వస్తుందంటే ప్రతి ఒక్కరి ఇంట్లో స్టార్, ట్రీ ఉండాల్సిందే. క్రైస్తవులు తమ ఇంట్లో ఒక క్రిస్మస్ ట్రీ ఏర్పాటు చేయడమనేది శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం. ఈ క్రిస్మస్ ట్రీని ఆత్మకు ప్రతీకగా భావిస్తారు. ఏసు క్రీస్తు మొదటి పుట్టినరోజున ఇలాంటి ఒక చెట్టు కింద ఆయనకు బహుమతులు ఇవ్వడమనేది ఆనవాయితిగా వస్తోంది.
ఇవే క్రిస్మస్ ట్రీస్
19వ శతాబ్దం వరకు కూడా జర్మనీ, రోమ్, అమెరికాలో సంప్రదాయ బద్దంగా పచ్చని వృక్షాలే క్రిస్మస్ ట్రీలుగా ఉండేవి. 19 శతాబ్దం నుంచి జర్మనీలో జరుపుకున్నట్టుగా కొవ్వొత్తులతో వెలిగే క్రిస్మస్ ట్రీలను ఏర్పాటు చేయడం మొదలుపెట్టారట. పూర్వకాలం నుంచి నేటి న్యూయార్క్ లోని రాక్ ఫెల్లర్ సెంటర్ లో ఏర్పాటు చేసే క్రిస్మస్ ట్రీ వరకు కూడా ఈ విషయం గురించి ఏన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి.
అసలు క్రిస్మస్ ట్రీ సాంప్రదాయం మొదలైంది?
క్రైస్తవ మత ఆవిర్భావానికి ముందు శీతాకాలంలో పచ్చని మొక్కల మీద ఎక్కువ శ్రద్ధ చూపించేవారు. ప్రస్తుత కాలంలో ఆధునికులు పైన్, స్ప్రూస్, ఫిర్ చెట్లతో ఇల్లు అలంకరించుకుంటున్నారు. వృక్షాల కొమ్మలను గుమ్మాలకు, కిటికీలకు వేలాడ దీసేవారు. ఎల్లప్పుడు పచ్చగా ఉండే ఈ హరిత వృక్షాలు దుష్లశక్తులు, ప్రేతాత్మలను పారద్రోలుతాయనేది వారి విశ్వాసం.
ఉత్తరార్థగోళంలోని ప్రజలు సూర్యుడిని దేవుడిగా కొలిచే వారు. డిసెంబర్ నెలలో వచ్చే 21, 22 తేదీలు ఎక్కువ రాత్రి, తక్కువ పగలు సమయం కలిగి ఉంటాయి. ప్రతి సంవత్సరం సూర్యుడు అనారోగ్యం బారిన పడి తన శక్తి కోల్పోవడం వల్ల శీతాకాలం వస్తుందని అప్పట్లో విశ్వసించేవారు. సోలిస్టిస్ తర్వాత సూర్యుడు తిరిగి శక్తి సంతరించుకుంటాడని, ఆయన బలానికి సంకేతంగా ఈ హరిత మొక్కలు నిలుస్తాయని నమ్మేవారు.
క్రైస్తవానికి ముందు నుంచే..
పూర్వ కాలంలో ఈజిప్షియన్లు గద్ద తలతో ఉండే ‘రా’ అనే దేవుడిని ఆరాధించారు. మండుతున్న సూర్యుడు అతడి తల మీద కిరీటంగా ఉండేవాడు. ‘రా’ తన అనారోగ్యం నుంచి కోలుకోవడానికి గుర్తుగా పామ్ వృక్ష కొమ్మలను ఇళ్లలో పెట్టుకొనేవారట. దీన్ని మరణం మీద జీవితం సాధించిన విజయానికి ప్రతీకగా భావిస్తారు.
రోమన్లు సైతం..
రోమన్లు సాటర్నాలియా అనే పండగ జరుపుకునే వారు. ఇది వ్యవసాయానికి దేవుడిగా భావించే సాటర్న్‌కు జరిపే పండగ. సూర్యోదయం జరిగిన వెంటనే పొలాలు, తోటలు తిరిగి సస్యశ్యామలం అవుతాయనే నమ్మకంతో ఈ పండగ జరిపే వారు. బౌద్ధ మతంలో కూడా ఇలా పచ్చని కొమ్మలతో ఇంటిని అలంకరించుకునే సంప్రదాయం ఉంది.
శాశ్వతమైన జీవానికి చిహ్నంగా యూకే నుంచి డ్రూయిడ్స్ అనే పిలిచే పురాతన సెల్ట్ పూజారుల ఆధ్వర్యంలో వృక్షాల కొమ్మలతో ప్రార్థనా స్థలాలను అలంకరించడం సంప్రదాయంగా కొనసాగుతూనే ఉంది. హరిత వృక్షాల తత్వం సూర్య భగవానుడు ప్రసాధించే వరంగా భావించడం దీని వెనుక ఉన్న ఉద్దేశం.
Disclaimer : ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.