Nara Lokesh On PM Modi Tour: ప్రధాని మోదీ ఏపీకి రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇస్తున్నారు: నారా లోకేశ్
విశాఖపట్నంలో బుధవారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ డిజిటల్ టెక్నాలజీ సదస్సులో పాల్గొన్న నారా లోకేష్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ఏపీకి రూ.2 లక్షల కోట్లు ప్రాజెక్టులు ఇస్తున్నారని పేర్కొన్నారు.
Nara Lokesh About PM Modi AP Tour: విశాఖపట్నం: ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఏపీ పర్యటనకు వస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం అందుకుగానూ భారీ ఏర్పాట్లు చేసింది. ప్రధాని మోదీ ఏపీ పర్యటనపై రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇస్తున్నారని తెలిపారు. విశాఖలో నిర్వహించిన డీప్ టెక్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ డిజిటల్ టెక్నాలజీ సదస్సులో నారా లోకేష్ పాల్గొని ప్రసంగించారు. డేటా సిటీ ప్రపంచానికి తలమానికంగా రూపుదిద్దుకోవాలని ఆకాంక్షించారు. గతంలో తీసుకొచ్చిన ఒక్క కియా పరిశ్రమ రాయలసీమ ముఖచిత్రాన్నే మార్చిందన్నారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సహాయ కార్యక్రమాల్లోనూ డ్రోన్ల టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఏపీ పర్యటనలో ప్రధాని మోదీ ప్రారంభించనున్న ప్రాజెక్టులు ఇవే
పూడిమడకలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ (రూ.1,85,000 కోట్లు)
నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ (రూ.1,876 కోట్లు)
పాడేరు బైపాస్ (రూ.244 కోట్లు)
దువ్వాడ-సింహాచలం (నార్త్) 3,4 ట్రాక్‌ల నిర్మాణం (రూ.302 కోట్లు)
ద.కో. రైల్వే జోన్ ప్రధాన కార్యా లయం (రూ.149 కోట్లు)
విశాఖ-గోపాలపట్నం 3,4 ట్రాక్‌ల నిర్మాణం (రూ.159 కోట్లు)
గంగవరం పోర్ట్-స్టీల్ ప్లాంట్ 3,4 రైల్వే ట్రాక్ ప్రారంభం (రూ.154 కోట్లు)
బౌదార-విజయనగరం రోడ్డు విస్తరణ (రూ.159 కోట్లు)
నేటి సాయంత్రం విశాఖకు ప్రధాని మోదీ
ప్రధాని మోదీ బుధవారం సాయంత్రం 4.15 గంటలకు ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్ డేగాకు చేరుకుంటారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి 4.45 గంటలకు సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ వరకు ఈ ముగ్గురు నేతలు రోడ్ షోలు పాల్గొంటారు. ఏయూ గ్రౌండ్ లో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొని పలు కీలక ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
వేదిక మీద ప్రధాని మోదీతో పాటు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి, ఎంపీలు శ్రీ భరత్, సీఎం రమేశ్, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, నారా లోకేష్, సత్య కుమార్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, యలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్‌లుు వేదిక మీద కూర్చునే అవకాశం ఉంది. ప్రధానితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు.