Parents Property Rights: తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఆస్తులు వెనక్కే, వారి పేరిటే తిరిగి రిజిస్ట్రేషన్: ఏపీ ప్రభుత్వం
SC Verdict: ఆస్తి రాయించుకుని, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల్ని పట్టించుకోని పిల్లలు.. తాము రాయించుకున్న ఆస్తులను వారికి తిరిగి ఇచ్చేయాలని సుప్రీం ఆదేశించింది.
Property Rights for Parents | ఆస్తులు రాయించుకున్నాక, వయసు మీద పడిన తల్లిదండ్రుల బాగోగులను పట్టించుకోకుండా వారి పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్న వారిపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రుల ఆలనాపాలనా చూడకుండా బాధ్యత లేకుండా ఉంటున్న పిల్లల విషయంలో గిఫ్ట్/సెటిల్‌మెంట్ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ ఆస్తులను తిరిగి తల్లిదండ్రుల పేరిటకు మార్చాలని అధికారులను ఏపీ రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ ఆదేశించింది. సుప్రీంకోర్టు సహా పలు రాష్ట్రాల హైకోర్టులు ఇచ్చిన తీర్పులను ఆధారంగా ఏపీ రిజిస్ట్రేషన్ల శాఖ తల్లిదండ్రులకు ఊరట కలిగేలా నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేసింది.
తమకు న్యాయం చేయాలంటూ ఎంతో మంది తల్లిదండ్రులు కోర్టులు, ట్రైబ్యునళ్లను ఆశ్రయిస్తున్నారు. ఆర్డీవో వాటిపై విచారణ జరిపి ఆదేశాలు ఇస్తే ఆస్తుల రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ ఐజీ ఎం.శేషగిరిబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ‘పోస్టు రిజిస్ట్రేషన్ ఈవెంట్స్’ అనే ఆప్షన్ ఉందని, వృద్ధుల ఆస్తులకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు క్లారిటీ ఇచ్చింది.
కాలం మారుతున్నా కొద్దీ మనుషులు, నైతిక విలువలు కూడా మారుతున్నాయి. దానికి తగ్గట్లు చట్టంలోనూ పలు మార్పులు చేస్తున్నారు. కారణాలేమైనా గానీ ఇటీవలి కాలంలో తల్లిదండ్రుల్ని బాధ్యతగా కంటే బరువుగా భావించే పిల్లలే చాలా మంది ఉంటున్నారు. వృద్ధాప్యంలో వాళ్లకు కావల్సిందేముంటుంది.. మహా అయితే సమయానికి భోజనం, ఆలనా పాలనా.. ఆరోగ్యం బాగోలేకపోతే ఆస్పత్రి ఖర్చు. పిల్లలు తమను బాగా చూసుకుంటే అంతకన్నా గొప్ప ఆనందం ఏముంటుంది వాళ్లకు మాత్రం. పగలనక, రాత్రనక కష్టపడి, ఎన్నో త్యాగాలు చేసిన తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఆస్తులు కూడబెట్టి.. చివరి దశలో వాళ్లకు అప్పజెప్పడం చూస్తూనే ఉంటాం. కానీ కొందరు పిల్లలు మాత్రం ఆస్తులు తమ చేతిలో పడగానే వాళ్లను పట్టించుకోరు. అలాంటి బిడ్డలకు కనువిప్పు కలిగించే ఘటన రీసెంట్ గా వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రుల పట్ల కర్కశంగా వ్యవహరించే వారసులకు ఇచ్చిన ఆస్తుల రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని ఇటీవల ఓ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది.
కొడుకు నరకం చూపిస్తున్నారంటూ వృద్ధ దంపతుల ఆవేదన
మధ్యప్రదేశ్ లోని చిత్తార్ పూర్‌కు చెందిన వృద్ధ దంపతులు తమ కుమారుడికి వ్యతిరేకంగా కోర్టు మెట్లెక్కారు. 2019లో తల్లిదండ్రులు తమ ఆస్తిలో కొంత భాగాన్ని కొడుక్కి బదిలీ చేశారు. అయినప్పటికీ అతను తమ బాగోగులు చూసుకోవడం లేదని, మిగతా ఆస్తి కూడా రాసివ్వాలని డిసెంబర్ 24, 2020లో తనపై, తన భర్తపై దాడి చేశాడని వృద్ధ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. తొలుత సబ్-డివిజనల్ మెజిస్ట్రేట్‌ను ఆశ్రయించడంతో న్యాయం దక్కింది. మెజిస్ట్రేట్ ఆ గిఫ్ట్‌డీడ్‌ను రద్దుచేసి, ఆస్తిపై వృద్ధ దంపతుల హక్కులను పునరుద్ధరించడంతో.. కొడుకు ఇదే విషయంపై హైకోర్టుకు అప్పీల్ చేశాడు. సింగిల్ బెంచ్ వద్ద వృద్ధ దంపతులకు న్యాయం జరిగినప్పటిీ. డివిజన్ బెంచ్ మాత్రం గిఫ్డ్‌డీడ్ రద్దు సాధ్యం కాదని తేల్చిచెప్పింది.
సుప్రీంకోర్టును ఆశ్రయించిన వృద్ధ తల్లిదండ్రులు
ఆ తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ద్విసభ్య ధర్మాసనం పైన పేర్కొన్న 2007 చట్టంలోని సెక్షన్ 23 ప్రకారం.. తల్లిదండ్రుల బాగోగులను పట్టించుకోని పిల్లలకు ఇచ్చిన గిఫ్ట్‌డీడ్ దానంతట అదే (డీమ్డ్ టు బి) రద్దవుతుందని తేల్చి చెప్పింది. గిఫ్ట్‌డీడ్ ద్వారా ఆ వృద్ధ దంపతులు తమ కుమారుడికి ఇచ్చిన ఆస్తిని, తిరిగి వారి పేరిటకు మార్చేయాలని చెప్పింది. నెలాఖరులోగా ఆస్తి బదలాయింపు జరగాలని ఆదేశాలు జారీ చేసింది.
చట్టం ఏం చెబుతోందంటే..
తల్లిదండ్రుల సంరక్షణ పరంగా బాధ్యతాపరంగా నడుచుకోకుంటే.. తల్లిదండ్రుల, వృద్ధుల సంరక్షణ, పోషణ చట్టం -2007 ప్రకారం, తమ వారసులకిచ్చిన ఆస్తులను తల్లిదండ్రులు రద్దు చేసుకునే హక్కుంటుంది. పిల్లలకు రాసిచ్చిన ఆస్తులను తిరిగి తల్లిదండ్రుల పేర మార్చే అధికారం ట్రైబ్యునళ్లకు ఉంటుంది. ఈ చట్టం సీనియర్ సిటిజన్లు ఎదుర్కొంటున్న సవాళ్లను దృష్టిలో పెట్టుకుని వారి హక్కులను కాపాడే లక్ష్యంతో రూపొందించారని స్పష్టంగా తెలుస్తోంది.