Delhi Election Schedule: ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
Delhi: ఢిల్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఫిబ్రవరి ఐదో తేదీన పోలింగ్ జరుగుతుంది.
Delhi Elections: ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. పోలింగ్ ఫిబ్రవరి ఐదో తేదీన జరుగుతుంది. ఎనిమిదో తేదీన కౌంటింగ్ జరుగుతుంది. మొత్తం 70 స్థానాలకు పోలింగ్ ఒకే విడతలో జరుగుతుంది. ఫిబ్రవరి 23తో ఢిల్లీ అసెంబ్లీ పదవీకాలం ముగియనుండడంతో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. బీజేపీ, ఆప్, కాంగ్రెస్ ఇప్పటికే కొన్ని స్థానాల్లో తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించాయి.
గత ఏడాది జరిగిన అన్ని ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించామని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది తొలి ఎన్నికలు ఢిల్లీలో జరగబోతున్నాయి. ఢిల్లీలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఉంటారని గుర్తు చేశారు.దేశంలో ఓటర్ల సంఖ్య 99 కోట్లు దాటిందన్నారు. ఇక, ఓట్ల తొలగింపు ఆరోపణలను సైతం ఖండించారు. ఓటర్ లిస్ట్ ట్యాంపరింగ్ ఆరోపణలను తోసిపుచ్చింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని సీఈసీ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఈవీఎంలను ఎవరూ ట్యాంపర్ చేయలేరని చీఫ్ ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ తెలిపారు. ఈవీలంతోనే పారదర్శకంగా ఫలితాలు వస్తాయి.. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిట్లు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు.
ఢిల్లీలో మూడు ప్రధాన పార్టీలు అయిన ఆప్, బీజేపీ, కాంగ్రెస్‌లు విడివిడిగా పోటీ చేస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. అయితే ప్రజలు తిరస్కరించారు. అన్ని స్థానాల్లోనూ బీజేపీ ఎంపీ అభ్యర్థులు విజయం సాధించారు. ప్రతీ సారి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి.. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజలు ఏకపక్షంగా ఓట్లేస్తున్నారు. కేజ్రీవాల్ గత రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఏకపక్ష మెజార్టీతో పదవి చేపట్టారు. ఢిల్లీలిక్కర్ స్కాంలో ఆయనను ఈడీ,సీబీఐ అరెస్టు చేయడంతో రిలీజయిన తర్వాత తన పదవికి రాజీనామా చేసి అతీషిని సీఎంను చేశారు. తాను అవినీతి చేశానో లేదో ప్రజలే తీర్పు చెప్పాలని.. ఆయన అంటున్నారు. తాను అవినీతి చేయలేదని ప్రజలు తీర్పు చెబితే తాను పదవి చేపడతానని లేకపోతే లేదని అంటున్నారు. ఆయన గెలిస్తే పదవి చేపడతారు.. ఓడిపోతే ఎలాగూ పదవి రాదు. కేసులు మాత్రం గెలిచినా ఓడినా కొనసాగుతూ ఉంటాయి.
కాంగ్రెస్ తో పొత్తు కలసి రాకపోవడంతో ఆయన ఒంటరిగానే పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ కూడా విడిగా పోటీ చేస్తోంది.కాంగ్రెస్ పార్టీ షీలాదీక్షిత్ టైంలో ఢిల్లీలో బలంగా ఉండేది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అక్కడ గెలవలేదు. గెలవడం కాదు కదా..అసలు కనీసం పోటీ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఈ ఎన్నికల్లో అయినా ప్రభావం చూపాలనుకుంటోంది. గెలుపుపై కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఆశల్లేవు. బీజేపీ ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఢిల్లీ పీఠం కేైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. అందుకే హోరాహోరీ పోరాటం ఖాయంగా కనిపిస్తోంది.