Justin Trudeau: అమెరికాలో కెనడా విలీనమా? అంత సీన్ లేదు, డొనాల్డ్ ట్రంప్‌నకు ఇచ్చి పడేసిన ట్రూడో
Canada as 51 state of America | ఎట్టి పరిస్థితుల్లోనూ కెనడా అమెరికాలో విలీనం కాదని జస్టిన్ ట్రూడో స్పష్టం చేశారు. డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనపై ట్రూడో ఘాటుగా స్పందించారు.
Justin Trudeau says Canada never merge in US | ఒట్టావా: కెనడాను అమెరికాలో విలీనం చేయాలంటూ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau)ను గవర్నర్ ఆఫ్ కెనడా అంటూ ట్రంప్ గిల్లిగజ్జాలు పెట్టుకునే ప్రయత్నం చేశారు. కెనడాను ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికాలో విలీనం చేసే ఆలోచన లేదని జస్టిన్ ట్రూడో స్పష్టం చేశారు.
అగ్గి రాజేస్తున్న డొనాల్డ్ ట్రంప్
ఇటీవల కెనడా, మెక్సికోలపై 25 శాతం దిగుమతి సుంకం విధిస్తున్నట్లు ప్రకటించిన అనంతరం వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణాను సరిహద్దుల్లోనే కట్టడి చేయకపోతే పన్నులు మరింత పెంచుతామని ట్రూడోను ట్రంప్ హెచ్చరించారు. అమెరికాలో 51వ రాష్ట్రంగా కెనడాను చేర్చుకుంటామని, కొత్త రాష్ట్రానికి స్వాగతం అంటూ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టక ముందే డొనల్డ్ ట్రంప్ అగ్గి రాజేశారు. కెనడా ప్రధాని పదవికి ఇటీవల రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన జస్టిన్ ట్రూడో రిపబ్లికన్ నేత ట్రంప్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. అమెరికా, కెనడాలోని ప్రజలు, కార్మికులు, వ్యాపారం సహా పలు రంగాల వారు సెక్యూరిటీ భాగస్వామ్యం ద్వారా లబ్ధి పొందుతున్నారని ట్రూడో తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. అమెరికాలో కెనడా విలీనం కావడం, 51వ రాష్ట్రంగా చేరాలన్న ట్రంప్ పిచ్చి ప్రతిపాదనను జస్టిన్ ట్రూడో ఘాటుగానే తిరస్కరించారు.
రెండు రోజుల కిందట జస్టిన్ ట్రూడో (Justin Trudeau) కెనడా ప్రధాని పదవికి, లిబరల్ పార్టీ (Liberal Party) నాయకత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకూ కెనడా ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతారు. దాదాపు దశాబ్ద కాలం తరువాత కెనడాలో అధికారం మారుతుండటం దేశ రాజకీయాల్లో కీలక పరిణామంగా చెప్పవచ్చు. లిబరల్ పార్టీలో అసంతృప్తి, దాదాపు 10 ఏళ్ల అధికారంతో ప్రజల్లో ఆయనపై నెలకొన్న వ్యతిరేకత వచ్చే ఎన్నికలలో పార్టీపై ప్రతికూలా ప్రభావం చూపుతుందని ట్రూడో ఆ నిర్ణయం తీసుకున్నారు.
డొనాల్డ్ ట్రంప్ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పనామా కాలువతో పాటు గ్రీన్‌ల్యాండ్‌లను అమెరికా నియంత్రణలోకి తీసుకురావడానికి ప్రయత్నించే అవకాశం ఉందన్నారు. అందుకోసం తాను సైనిక చర్యకు వెళ్లే అవకాశాలు లేకపోలేదన్నారు. అగ్రరాజ్యం అమెరికాకు వాటి ద్వారా గొప్ప ఆర్థిక, వ్యూహాత్మక లాభాలు ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు.