Rakhi Special Sweet Recipe : రాఖీ స్పెషల్ కుక్కర్ పాయసం.. సింపుల్‌గా, టేస్టీగా చేసుకోగలిగే రెసిపీ ఇది
Payasam Recipe : రాఖీ కట్టిన తర్వాత అన్నా లేదా తమ్ముడికి స్వీట్ తినిపిస్తారు. అదేదో బయట చేసిన స్వీట్స్ ఎందుకు ఇంట్లోనే టేస్టీగా పాయసం చేసి తినిపించేయండి.
Cooker Payasam Recipe : రక్షాబంధన్(Rakshabandhan 2024) కట్టిన తర్వాత అన్న లేదా తమ్ముడికి స్వీట్ తినిపిస్తారు. దానికోసం బయట నుంచి స్వీట్స్ తెప్పిస్తారు. అలాకాకుండా ఇంట్లోనే తయారు చేయగలిగే టేస్టీ స్వీట్ చేసి పెడితే వారు కూడా హ్యాపీగా ఫీలవుతారు. మీకు ఎక్కువ సమయం లేదు అనుకున్నా.. ఈ స్వీట్‌ని నిమిషాల్లో వండి పెట్టేయొచ్చు. అదే బెల్లం పాయసం. దీనిని టేస్టీగా కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. మరి దీనిని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏంటి? ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
బియ్యం - అరకప్పు
పెసరపప్పు - 2 టేబుల్ స్పూన్లు
బెల్లం - ఒకటిన్నర కప్పు (బెల్లం కరగడానికి పావు కప్పు నీళ్లు)
నీళ్లు - ఒకటిన్నర కప్పు
పాలు - అరకప్పు
యాలకులు - 3
నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు
జీడిపప్పు - 10
ఎండుద్రాక్ష - 3 టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి - అర టీస్పూన్
తయారీ విధానం
బియ్యం, పెసరపప్పును బాగా కడిగి నానబెట్టాలి. అవి నానిన తర్వాత స్టౌవ్ వెలిగించి దానిపై కుక్కర్ పెట్టాలి. ఇప్పుడు దానిలో నీళ్లు, బియ్యం, పెసరపప్పు వేయాలి. అనంతరం దానిలో పాలు వేయాలి. పాలు చిక్కగా ఉండాలి. ఇప్పుడు వాటిని మూడు విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి. బియ్యాన్ని నానబెడితే ఖీర్ త్వరగా ఉడుకుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయమేమిటంటే.. మంటను సిమ్‌లోనే ఉంచాలి. తక్కువ మంటమీద ఉడికితే దాని రుచి చాలా బాగుంటుంది.
ఇప్పుడు బెల్లాన్ని తురముకోవాలి. బెల్లం తురుముకున్న తర్వాత మరో స్టౌవ్ వెలిగించి దానిపై పాన్ పెట్టాలి. దానిలో పావు నీళ్లు వేసి బెల్లాన్ని కరిగించాలి. ఇలా కరిగించిన బెల్లాన్ని వడకట్టాలి. అయితే మరీ తీగపాకం రాకముందే బెల్లాన్ని స్టౌవ్ మీద నుంచి దించేయాలి. ఈ సిరప్ సిద్ధమయ్యే లోపు అన్నం పాలల్లో ఉడికిపోతుంది. ఇప్పుడు దానిలోని ఆవిరిపోయాక మూత తీసేయాలి. ఇప్పుడు దానిలో ఈ బెల్లం సిరప్ వేయాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై ఈ కుక్కర్ పెట్టి మరో మూడు, నాలుగు నిమిషాలు పాయసం ఉడికించాలి.
ఈలోపు చిన్న కడాయి తీసుకుని దానిలో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించుకోవాలి. అవి మంచిగా వేగిన తర్వాత పాయసంలో వేసి కలపాలి. చివరగా యాలకుల పొడి వేసి కలిపి.. ఓ నిమిషం ఉంచాలి. అంతే టేస్టీ పాయసం రెడీ. కొందరు దీనిలో పచ్చకర్పూరం కూడా వేసుకుంటారు. ఈ టేస్టీ రెసిపీ ఈ రాఖీ పండుగ సందర్భంగా వారికి తినిపించి నోరు తీపి చేయండి. ఈ స్టైల్లో పాయసం చేస్తే త్వరగా చెడిపోదు. పైగా రుచికూడా చాలా బాగా వస్తుంది.
ఇంకా క్రీమీగా రావాలంటే పాలు మరిన్ని వేసుకోవచ్చు. బెల్లం సిరప్కి ముందు పాలు వేసి ఉడికించుకోవాలి. అనంతరం బెల్లం పాకం వేయాలి. మీకు టైమ్ ఇంకా ఉంటే బెల్లం సిరప్ వేసిన తర్వాత పాయసాన్ని మరింత ఉడికించవచ్చు. దీనివల్ల బెల్లం అన్నంలోకి ఇంకా బాగా వెళ్లి మంచి రుచిని ఇస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీ బ్రదర్ కోసం ఈ టేస్టీ రెసిపీని చేసేయండి.
Also Read : మీ బ్రదర్ లేదా సిస్టర్‌కి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇలా రాఖీ శుభాకాంక్షలు చెప్పేయండిలా