Kedarnath Yatra 2025 : కేదార్నాథ్ యాత్ర 2025 ప్రారంభ తేది ఇదే.. యాత్ర ప్రాముఖ్యత, ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవే
Kedarnath Yatra : చార్ధామ్ తీర్థయాత్ర ప్రదేశాలలో కేదార్నాథ్ ఒకటి. ఈ ఏడాది మీరు కూడా ఇక్కడికి వెళ్లాలనుకుంటున్నారా? అయితే కేదార్నాథ్ యాత్ర గురించి తెలుసుకోవాల్సిన అంశాలు ఇవే.

Kedarnath Yatra 2025 Date : పన్నెండు జ్యోతిర్లింగాల్లో కేదార్నాథ్ (Kedarnath Temple) ఒకటి. శివుని అత్యంత పవిత్రమైన జ్యోతిర్లింగాలలో ఇది కూడా ఒకటి కావడంతో భక్తులు దీనిని చూసేందుకు వెళ్తూ ఉంటారు. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ జిల్లాలో ఈ జ్యోతిర్లింగం ఉంది. అయితే దీనిని రెగ్యులర్‌గా వెళ్లేందుకు వీలు ఉండదు. శీతాకాలం ప్రారంభమైతే దీనిని ఆరు నెలల పాటు మూసి ఉంచుతారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్లే అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకుంటారు. అయితే కేదార్‌నాథుడి విగ్రహాలను ఓంకారేశ్వర్ ఆలయానికి తరలించి.. అక్కడ పూజలు చేస్తారు. గుడి తెరిచిన తర్వాత మళ్లీ కేదార్‌నాథ్‌కి తీసుకువస్తారు.
కేదార్నాథ్ యాత్ర ప్రారంభ తేదీ
కేదార్‌నాథ్‌కు 2025లో వెళ్లాలనుకుంటే దీనిని మళ్లీ ఎప్పుడు ఓపెన్ చేస్తారో అని ఆలోచిస్తున్నారా? ఈ తేదీ ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. పరిస్థితులకు, వాతావరణానికి అనుగుణంగా చార్ధామ్ దేవస్థానం నిర్వహణ బోర్డు అధికారిక ప్రకటన చేస్తుంది. దీనిలో భాగంగా 2025లో ఫిబ్రవరి 26వ తేదీన మహా శివరాత్రి సందర్భంగా కేదార్నాథ్ యాత్ర ప్రారంభం కానున్నుట్లు తెలిపింది.
కేదార్నాథ్ యాత్రకు వెళ్లాలనుకుంటే..
కేదార్నాథ్ ఆలయానికి వెళ్లడానికి రోడ్డు మార్గం లేదు. గౌరీకుండ్ నుంచి ట్రెక్కింగ్ ద్వారా ఆలయాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. ట్రెక్ ద్వారా చేరుకోలేనివారికి డోలీ సేవలు అందుబాటులో ఉంటాయి. చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి తగిన లగేజ్ ప్యాక్ చేసుకోవాలి. అలాగే కాళ్ల నొప్పులు ఉన్నవారు దానికి తగిన మెడిసిన్, వైద్యుల సూచనలతో ఈ యాత్రను ప్రారంభించవచ్చు. యాత్ర ప్రారంభించాలనుకుంటే ముందుగానే రిజిస్ట్రేషన్ (Kedarnath Yatra Registration) చేసుకుంటే మంచిది. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో కూడా ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.
అంతకష్టపడి అక్కడకు వెళ్లడం అవసరమా అనుకునేవారికి తెలియాల్సింది ఏంటంటే.. హిందూ మతంలోని నాలుగు ముఖ్యమైన తీర్థయాత్రలలో కేదార్నాథ్ యాత్ర ఒకటి. ఈ ఆలయాన్ని సందర్శించడం వల్ల భక్తులకు ఆధ్యాత్మిక విముక్తి లభిస్తుందని భావిస్తారు. అందుకే ఇక్కడికి ప్రతి ఏడాది భక్తులు అధిక సంఖ్యలో వెళ్తూ ఉంటారు.
చార్ ధామ్ యాత్ర..
కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి పవిత్ర గమ్యస్థానాలను సమిష్టిగా కలిపి చార్ ధామ్ యాత్ర (Char Dham Yatra) అని కూడా పిలుస్తారు. కేదార్‌నాథ్‌లో శివుడు, బద్రీనాథ్‌లో విష్ణువు, గంగోత్రిలో గంగాదేవి, యమునోత్రిలో యమునాదేవి ఉంటారు. ఇవన్నీ పవిత్ర గంగా నది ఒడ్డున ఉన్నాయి. అందుకే ఈ యాత్రకు భక్తులు అంతగా ఆసక్తి చూపిస్తారు. ఎక్కువమంది భక్తులు హరిద్వార్ నుంచి చార్ ధామ్ యాత్ర ప్రారంభించి.. ఈ నాలుగు ప్రదేశాలను కవర్ చేసి తర్వాత అదే ప్రదేశంలో ప్రయాణాన్ని ముగిస్తారు. వివిధ ప్రాంతాల నుంచి వెళ్లేవారు వారికి అనుగుణంగా.. ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు.
కేదార్నాథ్ ధామ్ వల్ల కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలివే (Spiritual Benefits of Kedarnath Yatra)
భక్తుల విశ్వాసం ప్రకారం.. జీవితంలో ఒక్కసారైనా కేదార్నాథ్ తీర్థయాత్ర చేస్తే.. ఆ వ్యక్తి జనన పునర్జన్మ చక్రం నుంచి విముక్తి పొందుతాడని భావిస్తారు. జ్యోతిర్లింగాన్ని పూజించి.. ఆలయంలోని పవిత్ర జలాన్ని తాగితే జీవితకాలానికి సరిపడా ఆశీర్వాదం శివుని నుంచి దక్కుతుందని భావిస్తారు. అలాగే చిన్నవయసులో ఈ యాత్రకు వెళ్తే.. ఎక్కువ జ్ఞానం, పరిపక్వతతో తిరిగి వస్తారని.. ఇది వారి జీవితాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లడంలో హెల్ప్ చేస్తుందని చెప్తారు.
Also Read : జ్యోతిర్లింగాలను ఒకే ట్రిప్‌లో ఎలా కవర్ చేయొచ్చో తెలుసా? హైదరాబాద్ నుంచి ఇలా స్టార్ట్ అయిపోండి






















