Artificial Intelligence: విద్యార్థులకు గుడ్‌న్యూస్- బీఏలోనూ ఏఐ, డేటా సైన్స్ కోర్సులు - ఎప్పటినుంచంటే?
NEW COURSES: పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా విద్యార్థులను తీర్చిదిద్ది వారికి ఉద్యోగావకాశాలు పెంపొందించేందుకు వీలుగా బీఏ డిగ్రీలో ఎమర్జింగ్ సబ్జెక్టులకు తీసుకోవాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.

AI Course in BA Degree: బీఏ డిగ్రీలో విప్లవాత్మక మార్పులను రాష్ట్ర ఉన్నత విద్యామండలి శ్రీకారం చుట్టింది. పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా విద్యార్థులను తీర్చిదిద్ది వారికి ఉద్యోగావకాశాలు పెంపొందించడం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్(బీఏ) కోర్సులో సిలబస్‌ను సమగ్రంగా మార్చాలని నిర్ణయించింది. మార్కెట్లో ప్రస్తుతం విస్తృతంగా డిమాండ్‌లో ఉన్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి వినూత్న సబ్జెక్టులను ఈ మేరకు బీఏ కోర్సులో ప్రవేశపెట్టనుంది. ప్రతి విద్యార్థికి ప్రాథమికంగా కొత్త సాంకేతికతలపై కనీస అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో పాఠ్యాంశాలను చేర్చనుంది. ఈ నిర్ణయం వల్ల శిక్షణ అవసరం లేకుండానే ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు విద్యార్థులు పోటీపడే అవకాశం కలుగనుంది.
ఉన్నతస్థాయి సమావేశం..
రాష్ట్రంలో వచ్చే విద్యాసంవత్సరం(2025-26) నుంచి డిగ్రీ సిలబస్‌లో తీసుకురావాల్సిన మార్పులు, చేర్పులపై ఉన్నత విద్యామండలి ఫిబ్రవరి 17న బీఏ కోర్సులోని వివిధ సబ్జెక్టుల బోర్డు ఆఫ్ స్టడీస్(బీఓఎస్) ఛైర్మన్లతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం బీఏ సిలబస్‌ను 20-30 శాతం మార్చనున్నారు. ఇందుకోసం సబ్జెక్టు నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో బీఏ కోర్సులకు ఒకేవిధంగా 150 క్రెడిట్లు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశానికి ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి, సిలబస్ కమిటీ ఛైర్మన్, విద్యామండలి ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ పురుషోత్తం, ఆచార్య ఎస్‌కే మహమూద్, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ తదితరులు హాజరయ్యారు.
డిగ్రీలోనే సివిల్స్ సిలబస్..
వచ్చే ఏడాది నుంచే కొత్త సిలబస్‌ను అమలు చేయాల్సి ఉండటంతో.. అందుకు అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ కోరారు. సమావేశం తర్వాత పురుషోత్తం మాట్లాడుతూ.. సివిల్స్‌లో రాష్ట్ర విద్యార్థులు ఎక్కువ మంది ఎంపిక కావాలన్న ధ్యేయంతో కొత్తగా నాలుగేళ్ల బీఏ ఆనర్స్(తెలుగు) కోర్సును అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. బీఎస్సీ గణితం లాంటి వాటిలో మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, అర్థమెటిక్ లాంటి వాటిని చేర్చాలని భావిస్తున్నామని చెప్పారు. డిగ్రీ కోర్సుల సిలబస్‌లో మార్పులు చేయడంతో సివిల్స్‌ను సలభతరం చేయగలమన్న దిశలో బీఏ తెలుగు కోర్సుకు రూపకల్పనచేశామన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ కోర్సును ఆర్ట్స్ కాలేజీలో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.
ఓయూలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సు..
ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో తొలిసారిగా నాలుగేళ్ల డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టనుంది. ఇప్పటి వరకు క్యాంపస్‌లో పీజీ కోర్సులను మాత్రమే నిర్వహిస్తున్నారు. అయితే 1970కి ముందు తొలగించిన డిగ్రీ కోర్సులను ఆ తర్వాత పునరుద్ధరించడం ఇదే తొలిసారి. కొన్ని కళాశాలలు మాత్రం ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చాయి. కాని తాజాగా కొత్తగా నాలుగేళ్ల డిగ్రీ కోర్సును ఆర్ట్స్ కళాశాలలో ప్రవేశపెట్టాలని అధికారులు నిర్ణయించారు. తొలుత బీఏ తెలుగు కోర్సును ఓయూ ఆర్ట్స్ కాలేజీలో ప్రవేశపెడతారు. ఆ తర్వాత దశలవారీగా డిగ్రీ కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తారు. ఇది నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ కోర్సు కాగా ఈ కోర్సు పూర్తిచేసిన వారు ఏడాదిలోపు పీజీ కోర్సును పూర్తిచేసుకోవచ్చు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

