Warangal News: వేధింపులు ఇక భరించలేం, చచ్చిపోతాం, అనుమతివ్వండి- భూపాలపల్లి కలెక్టరేట్ ఎదుట దంపతుల ఆందోళన
Bhupalapally Old Couple Protest | తమ పొలంలోకి వెళ్లలేక వ్యవసాయం చేయలేకపోతున్నాం, ఎస్సై వేధింపులు భరించలేం. ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతించాలని ఫ్లెక్సీతో కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు.

Bhupalapally Collectorate | భూపాలపల్లి: సాధారణంగా అప్పులు చేసి తీర్చలేకనో, లేకపోతే ప్రేమలో విఫలమయ్యాం అనో.. లేక మార్కులు తక్కువొచ్చాయని, ఫెయిల్ అయ్యామనో ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తుంటాం. కానీ ఎస్సై వేధింపులు తట్టుకోలేకపోతున్నాం.. ఆత్మహత్యకు అనుమతించండి సార్ అంటూ దంపతులు ఫ్లెక్సీతో భూపాలపల్లి కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే తమపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తమకు చావే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
అసలేం జరిగిందంటే..
భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం వేములపల్లికి చెందిన సంది సులోచన, ప్రతాప్ రెడ్డి దంపతులకు 12 ఎకరాల భూమి ఉంది. ఈ భూమికి వెళ్లడానికి ఉన్న దారిని రెండున్నరేళ్లుగా ములుగు జిల్లా కన్నాయిగూడెం ఎస్సైగా పనిచేస్తున్న ఇనిగాల వెంకటేష్, అతడి సోదరుడు, తండ్రి కలిసి మూసివేశారని దంపతులు ఆరోపించారు. తమ సమస్యపై హైదరాబాద్ వెళ్లి ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే ఆ ఎస్సై తమపై అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మూడేళ్ల నుంచి తమ పొలానికి వెళ్లలేక వ్యవసాయం చేయట్లేదని.. తమకు ఆత్మహత్య తప్ప వేరే దారి లేదని వాపోయారు. కనీసం ఆత్మహత్యకు అనుమతించాలని ఫ్లెక్సీతో భూపాలపల్లి కలెక్టరేట్ ఎదుట వృద్ధ దంపతులు నిరసన తెలపడంతో తెలంగాణ వ్యాప్తంగా ఈ ఘటన హాట్ టాపిక్ అవుతోంది.
Also Read: Crime News: ప్రియుడితో ఏకాంతంగా భార్యను చూసిన భర్త! ఆవేశంతో చెయ్యి నరికి ఆపై దారుణం






















