Kakinada High Alert: తుని వైస్ చైర్మన్ ఎన్నిక నాలుగోసారి వాయిదా, కాకినాడ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత
Tuni Vice Chairman election | కోరం లేకపోవడంతో తుని వైస్ చైర్మన్ ఎన్నిక నాలుగోసారి వాయిదా పడింది. సోమవారం నాడు వైస్ చైర్మన్ ఎన్నిక మూడోసారి వాయిదా వేయడం తెలిసిందే.

Tuni Vice Chairman Polling | కాకినాడ జిల్లా తుని వైస్ చైర్మన్ ఎన్నిక నాలుగోసారి వాయిదా పడింది. తమ చేతుల్లో ఏమీ లేదని ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న జాయింట్ కలెక్టర్ తెలిపారు. పరిస్థితిపై ఎన్నికల కమిషన్ కు నివేదిస్తామని వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికలకు టీడీపీ మద్దతుదారులు వస్తున్నారు కానీ వైసీపీ కౌన్సెలర్లు హాజరుకాకపోవడంతో కోరం సరిపోవడం లేదని వైస్ చైర్మన్ ఎలక్షన్ వాయిదా పడుతోంది.
రసవత్తరంగా మారిన తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక
నేడు జరగాల్సిన తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. దాంతో వైస్ చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది. గతంలో తుని మున్సిపల్ ఎన్నికల్లో 28 మంది కౌన్సిలర్లను వైసిపి గెల్చుకుంది. ఏపీ ఎన్నికల్లో నెగ్గి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు ఏర్పాట్లు చేశారు. కానీ మూడుసార్లు వాయిదా పడిన వైస్ చైర్మన్ ఎన్నిక నేడు నాలుగోసారి కోరం లేని కారణంగా వాయిదా పడింది.
మరోవైపు క్యాంప్ రాజకీయాలతో ఎన్నిక వాయిదా పడుతూ వస్తోంది. వైసీపీ మద్దుతుతో గెలిచిన పదిమంది కౌన్సిలర్లు టిడిపిలో చేరారు. దాంతో 17 మంది కౌన్సిలర్లతో క్యాంపు నిర్వహిస్తోంది. కానీ ఎన్నిక సమయానికి వైసీపీ కౌన్సెలర్లు పోలింగ్ కు రావడం లేదు. వైసీపీ కౌన్సిలర్లను టీడీపీ బలవంతంగా లాక్కుంటుందని మాజీ మంత్రి కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆందోళనకు దిగారు.
చలో తునికి మాజీ మంత్రి ముద్రగడ
కాకినాడ జిల్లా కిర్లంపూడి నుంచి చలో తునికి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి బయలుదేరారు. పోలీసులు నోటీసులు ఇచ్చినా పట్టించుకోకుండా ముద్రగడ తునికి వెళ్తున్నారు. ఎటువంటి నిరసనలకు అనుమతి లేదని ఇప్పటికే తుని పోలీసులు తెలిపారు. ఛలో తునికి పిలుపునివ్వడంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా వైసిపి నేతలు హౌస్ అరెస్టు చేస్తున్నారు. మరోవైపు కాకినాడ నుండి తుని వెళ్ళేందుకు సిద్ధమవుతున్న మాజీమంత్రి కురసాల కన్నబాబు, తదితర వైసీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.
వైసీపీ నేతల అరెస్టులు
కాకినాడ : మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర వైసీపీ ఇంచార్జ్ కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ లు తునికి వెళుతుండగా గొల్లప్రోలు వద్ద పోలీసులు నిలిపివేశారు. వారి వాహనాలను అడ్డుకోవడంతో ఆ ముగ్గురు నాయకులతో పాటు వారి అనుచరులు రోడ్డుపైనే బైటాయించి ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ఒక్క వైస్ చైర్మన్ పదవికి ఎన్నిక నిర్వహించలేని స్థితిలో ఉందని కన్నబాబు మండిపడ్డారు. కాకినాడ, తుని ప్రజలు అన్ని గమనిస్తున్నారు. తగిన సమయంలో కూటమి నేతలకు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తమను ఇళ్ల నుంచి బయలుదేరినప్పుడు అడ్డుకోకుండా, రోడ్డు పైకి వచ్చాక ఇక్కడ ఎందుకు అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు పోలీసుల్ని గట్టిగా నిలదీశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

