Corona: ఇలాంటి వారికి కరోనా సోకితే మరణించే అవకాశాలు ఎక్కువ... తేల్చిన కొత్త అధ్యయనం
కరోనా తీవ్రత తగ్గింది కానీ, అది ఇంకా మన మధ్యనే ఉంది, తేలికగా తీసుకుంటే మళ్లీ విజృంభించడం ఖాయం.
కరోనా గండం గడిచిందనుకుంటున్నారు చాలా మంది, కానీ ఇంకా ముప్పు ముంచుకొచ్చే అవకాశం ఇంకా ఉందంటున్నారు ఎయిమ్స్ వైద్యులు. మాస్క్ వాడడంతో పాటూ, వ్యాక్సినేషన్ చేయించుకోమని సలహా ఇస్తున్నారు. అయితే వ్యాక్సినేషన్ వేయించుకున్నా కూడా కొంతమంది మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది ఓ కొత్త అధ్యయనం. దాని ప్రకారం అధిక శరీర బరువుతో బాధపడేవారిలో కరోనా మరణాల రేటు అధికంగా ఉండొచ్చని వారి అంచనా. అంటే మిగతా వారితో పోలిస్తే ఊబకాయుల్లో కోవిడ్ మరణాల రేటు అధికంగా ఉండొచ్చు. సాధారణ బరువు ఉన్న వారితో పోలిస్తే ఊబకాయుల్లో కోవిడ్ సోకిన తరువాత ఆసుపత్రిలో చేరే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. దీనికి వారి అధిక బరువే కారణం. నిజానికి ఊబకాయం అనేక దీర్ఘకాలిక వ్యాధులకు కారణం అవుతుంది. అందుకే బరువు పెరగడం ప్రమాదకరమని వైద్యులు చెబుతూనే ఉన్నారు.
టెక్సాస్, విస్ కాన్సిన్ రాష్ట్రాల్లోని రెండు యూనివర్సిటీలు ఈ అధ్యయనాన్ని నిర్వహించాయి. అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ చెప్పిన ప్రకారం ఊబకాయం అనేది అనేక ప్రమాదకరమైన దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది. కరోనా సోకితే తీవ్రమైన అనారోగ్యం మారేందుకు సహకరిస్తుంది. దీనివల్ల ఆసుపత్రిలో చేరే అవకాశం మిగతా వారితో పోలిస్తే వీరిలో మూడు రెట్లు ఎక్కువ. అధిక బరువు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఛాతీ నొప్పి కలగవచ్చు. రోగనిరోధక శక్తి కూడా వీరిలో బలహీనంగా ఉంటుంది. అందుకే వీరికి కరోనా సోకితే పరిస్థితి విషమించే అవకాశాలు ఎక్కువవుతాయని వివరిస్తోంది కొత్త అధ్యయనం.
పరిశోధనా బృందంలోని సభ్యులు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 154 దేశాలకు చెందిన 550 కోట్ల మంది ప్రజల కరోనా లెక్కలను విశదీకరించి చూసింది. వచ్చిన వాళ్లు, రాని వాళ్లు, అధిక బరువు ఉన్న వాళ్లు, ఇలా కరోనాతో సంబంధాన్ని కలిగి ఉన్న వారి డేటాను విశ్లేషించింది. ఊబకాయులకు కోవిడ్ సోకితే అంత త్వరగా వదలదు కూడా. కొన్ని రోజుల పాటూ వారిలోనే తిష్ట వేసుకుని కూర్చుంటుంది. వీరికి ఒకసారి వచ్చాక మళ్లీ రాకూడదని లేదు, సోకే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఊబకాయులు కరోనా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు అధ్యయన కర్తలు. ముఖ్యంగా బరువు తగ్గమని సలహా ఇస్తున్నారు.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: బొప్పాయి వల్ల నిజంగానే గర్భం పోతుందా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు?
Also read: చాలామందికి భోజనం చేసేటప్పుడు ఇదే సమస్య.. మీకూ ఉందా? తేలికగా తీసుకోకండి
Also read: ప్యాకెట్ పాలను మరగబెట్టాల్సిన అవసరం ఉందా? నేరుగా తాగొచ్చా?