Tollywood Holi Songs: హోలీ పండుగ స్పెషల్ - టాలీవుడ్‌లో దుమ్మురేసిన కలర్ ఫుల్ సాంగ్స్ ఇవే!
కులమతబేధాలు లేకుండా అందరూ కలిసి ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పండుగ హోలీ. హోలీ పండుగ సందర్భంగా టాలీవుడ్ లో హోలీ నేపథ్యంలో వచ్చిన పాటలేంటో ఓసారి చూద్దాం..
దేశవ్యాప్తంగా రంగుల పండుగ హోలీను జరుపుకోవడానికి అంతా సిద్దమైపోయారు. హోలీ పండుగ మన భారతీయ సంస్కృతిలో భాగం. ఈ పండుగను దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇరుగు పొరుగు, చిన్నా పెద్దా అని తేడా లేకుండా ఆ రోజంతా రంగుల ప్రపంచంలో విహరిస్తూ ఆటపాటలతో, పసందైన వంటకాలతో సరదాగా గడుపుతారు. ఈ ఏడాది కూడా హోలీను రెండు రోజులు జరుపుకోనున్నారు. మార్చి 7(మంగళవారం) సాయంత్రం కామ దహనం నిర్వహించి మార్చి 8(బుధవారం) నాడు హోలీ పండుగను చేసుకోవాలని చెబుతున్నారు. అయితే చాలా మంది రెండు రోజుల్లోనూ హోలీ జరుపుకోనున్నారు. ఇక ఈ హోలీ పండుగ నాడు మీకు మరింత ఉత్సాహాన్నిచ్చే కొన్ని తెలుగు సినిమాల్లోని టాప్ హోలీ పాటలను ఇక్కడ చూడండి.
‘నాయకుడు’-సందె పొద్దు మేఘం
తెలుగు సినిమాల్లో 80వ దశకం నుంచే రంగుల హోలీ పాటలు, సన్నివేశాలతో వెండితెరపై మరిన్ని రంగులను తీసుకొచ్చింది ఈ హోలీ. అప్పటినుంచి పలు తెలుగు సినిమాల్లో ఈ హోలీపై ఏదొక పాటో లేదో సన్నివేశంలో కనిపిస్తూ ఉంటాయి. అంతేకాదు ఈ పాటలు ఆ సినిమాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవడమే కాకుండా తర్వాత ఫేవరేట్ సాంగ్ లుగా నిలుస్తుంటాయి. అలాంటి సినిమాల్లో మొదట చెప్పుకోవాల్సిన సినిమా కమల్ హాసన్ నటించిన ‘నాయకుడు’. ఈ సినిమాలో హోలీ పండుగపై వచ్చే ‘సందె పొద్దు మేఘం’ పాట ప్రేక్షకాదరణ పొందింది. హోలీ పండుగ వస్తే గుర్తొచ్చే పాటల్లో ఇది కూడా ఒకటి. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతంలో వెన్నెలకంటి సాహిత్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ పాటను ఆలపించారు.
‘చక్రం’- రంగోలీ హోలీ
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘చక్రం’ మూవీలో ‘రంగోలీ హోలీ’ పాట అత్యంత ఆదరణ పొందిన హోలీ పాటల్లో ఒకటి. ఈ సినిమాకు దివంగత సంగీత దర్శకుడు చక్రి సంగీతం అందించారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఈ హోలీ పాటకు అర్థవంతమైన సాహిత్యాన్ని అందించగా శంకర్ మహదేవన్ ఈ పాటను ఎనర్జటిక్ గా ఆలపించారు. ఆ పాట ఆద్యంతం హోలీ పండుగను గుర్తుచేసే విధంగా ఉంటుంది. ఈ పాట కూడా టాలీవుడ్ హోలీ సాంగ్స్ లలో చెప్పుకోదగినది.
‘రాఖీ’- రంగు రబ్బా రబ్బా:
యంగర్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘రాఖీ’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమాలో పాటలు కూడా అంతే హిట్ ను అందుకున్నాయి. సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ ఈ మూవీకు మ్యూజిక్ అందించారు. అందులో ముఖ్యంగా హోలీ పండుగ మీద వచ్చే ‘రంగు రబ్బా రబ్బా’ పాట ఎంతో ఉత్సాహభరితంగా ఉంటుంది. సుద్దాల అశోక్ తేజ సాహిత్యంలో డీఎస్పీ సంగీతంలో ప్రియా హిమేష్ తో కలిసి అమల్‌రాజ్ పాడిన ‘రంగు రబ్బా రబ్బా’ సాంగ్ హోలీ పండుగలో పత్యేక ఆకర్షణగా నిలుస్తుందనడంలో అతిశయోక్తి లేదు.
‘జెమిని’- దిల్ దీవానా:
విక్టరీ వెంకటేష్ నటించిన ‘జెమిని’ సినిమాలోని ‘దిల్ దీవానా’ పాట కూడా హోలీ పండుగ నేపథ్యంలో సాగే పాటే. వేటూరి సుందరరామమూర్తి రాసిన సాహిత్యంలో ఉష పాడిన దిల్ దీవానా పాట మార్వాడీ ఫ్యామిలీలో జరిగే హోలీ పండగను తలపించేలా ఉంటుందీ. ఈ పాటలో నమిత డాన్స్ ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్ కూడా హోలీ పండుగ సందర్భంగా ప్రత్యేకంగా చెప్పుకోదగినది.
‘సీతారామరాజు’- హోలీ రంగోలీ
నందమూరి హరికృష్ణ, అక్కినేని నాగార్జున నటించిన ఫ్యామిలీ డ్రామా సినిమా ‘సీతారామరాజు’. ఈ సినిమాకు కీరవాణి స్వరాలను అందించారు. ఈ సినిమాలో ‘హోలీ రంగోలీ’ అంటూ సాగే పాట హోలీ పండుగను గుర్తు చేస్తుంది. గ్రామాలలో జరిగే హోలీ వేడుకను తలపించేలా ఈ పాట ఉంటుంది. ఎస్పీ బాలు, సుజాత, కీరవాణి కలసి ఈ పాటను ఆలపించారు. ఈ పాటలో నాగార్జునతో పాటు హరికృష్ణ కూడా స్టెప్పులేశారు. ఈ పాట కూడా టాలీవుడ్ హోలీ పాటల్లో చెప్పుకోదగినది.
Also Read : రొయ్యల చెరువులో రొమాంటిక్ గీతం - వెన్నెల్లో కార్తికేయ, నేహా శెట్టి