BRS Latest News: ఆ మూడు కారణాలతోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా బీఆర్‌ఎస్- గట్టిగా కొట్టాలని భారీ ప్లాన్
Telangana Latest News: కారణాలు ఏవైనా, వ్యూహం ఏదైనా రాజకీయ పార్టీ పరీక్ష ఎదుర్కోనేది ఎన్నికల్లోనే. అలాంటి పరీక్షను బీఆర్‌ఎస్ రాయకపోవడం విస్మయం కలిగిస్తోంది. అది భయంతోనా, లేక వ్యూహమా?

Telangana Latest News: గత రెండు దశాబ్ధాలుగా తెలంగాణలో రాజకీయాలను శాసించిన పార్టీ బీఆర్ఎస్. ఆ పార్టీ అధినేత కేసీఆర్. గత ఎన్నికల ఫలితాల నుంచి మౌన వ్రతంలో ఉన్నారు కేసీఆర్. ఫిబ్రవరి, మార్చి నెలలో పెద్ద ఎత్తన కార్యక్రమాలు, బహిరంగ సభలతో కేసీఆర్ తన పాత రాజకీయాలను గుర్తు చేస్తారని గులాబీ నేతలు చెబుతున్నారు. అయితే సాధారణ ఎన్నికల తర్వాత తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధాయ్య, పట్టభద్రుల నియోజకవర్గం, వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఎన్నికైన ఎమ్మెల్సీల పదవీ కాలం ఈ ఏడాది మార్చి 29తో ముగియనుంది. ఈ మూడు స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 27వ తేదీన జరగనున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. నల్గొండ- ఖమ్మం- వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నరోత్తం రెడ్డి, కరీంనగర్ - మెదక్ - నిజామాబాద్- ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి మల్కా కొమరయ్య, పట్టభద్రుల నియోజకవర్గానికి సి. అంజిరెడ్డిని బీజేపీ నిలబెట్టింది. కాంగ్రెస్ నుంచి కరీంనగర్- మెదక్- నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వి. నరేందర్ రెడ్డిని నిలబెట్టింది. వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఎవర్నీ కాంగ్రెస్ బలపరచలేదు. బీఆర్ఎస్ మాత్రం మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో రెండు జాతీయ పార్టీల నాయకులు- కార్యకర్తలు కోలహాలంగా ప్రచారం చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు నిరుత్సాహంలో ఉన్నారు.
భయమా - వ్యూహమా..కారణాలేంటి.
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటిస్తే ఓడిపోతామన్న భయంతో ప్రకటించ లేదా లేక ఇప్పుడు ఓడిపోతే ఆ ఓటమి ప్రభావం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపై పడుతుందన్న అనే ఆలోచన అనే చర్చ జరుగుతోంది. అయితే రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ మాత్రం పోటీ చేయకపోవడం పట్ల గులాబీ పార్టీని ఎద్దేవా చేస్తున్నాయి. దీంతో గులాబీ కార్యకర్తలు డీలా పడుతున్నారు.
మొదటి కారణం - ఓటర్లైన నిరుద్యోగులు - పట్టభద్రుల నియోజకవర్గంలో కీలమైన ఓటర్లు నిరుద్యోగులు. చదువుకుని నిరుద్యోగంతో ఉన్న వారు ఇంకా తమపై కోపంతో ఉన్నారా అన్న ఆలోచనలో బీఆర్ఎస్ అధినేత ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో తాము నిరుద్యోగుల విషయంలో ఏం చేయలేదన్న ఆలోచనతో తమకు వారు ఓటు వేయలేదన్న విశ్లేషణలో కారు పార్టీ ఉంది. ఇప్పటికిప్పుడే వారికి తమపై కోపం పోయే అవకాశం లేదని ఆ పార్టీ అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ అభ్యర్థిని ప్రకటించి ఓడిపోతే ఆ ప్రభావం పార్టీపై మరోసారి పడే అవకాశం ఉంటుంది. దీన్ని కాంగ్రెస్, బీజేపీ ఉపయోగించుకొని బీఆర్ఎస్‌ను ప్రజలు తిరస్కరించారన్న ప్రచారం చేసే అవకాశం ఉంది. అలాంటి ఛాన్స్ రెండు పార్టీలకు ఇచ్చినట్లు అవుతుందన్న భావన ఆ పార్టీలో వ్యక్తం అవుతుంది. ఇది క్యాడర్‌ను నిరుత్సాహానికి గురి చేయడమే కాకుండా, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపైన ప్రభావం చూపెడుతుందేమో అన్న ఆలోచనతోనే కేసీఆర్ ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: తెలంగాణలో రేషన్ కార్డుల పంపిణీ ఏ జిల్లాలో ప్రారంభిస్తారు? రాష్ట్రమంతటా ఎప్పుడు ఇస్తారు?
రెండో కారణం. ఉపాధ్యాయులు - తమ హయాంలో ప్రమోషన్లు, బదిలీలు, ఇంక్రిమెంట్ల విషయంలో ఉపాధ్యాయులు కొంత ఆగ్రహంతో ఉన్నట్లు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఉపాధ్యాయ ఎన్నికలు పార్టీ జెండా, ఎజెండా మీద జరగేవి కావు కాబట్టి ఈ ఎన్నికల్లో పాల్గొనకపోవడం, ఏ ఉపాధ్యాయ అభ్యర్థికి మద్ధతు ప్రకటించకపోవడం మేలన్న ఆలోచనలో బీఆర్ఎస్ అధినాయకుడు కేసీఆర్ ఉన్నట్లు పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు.
మూడో కారణం - ఈ ఎన్నికల్లో పాల్గొనే ఓటర్ల సంఖ్య- ఈ ఎన్నికల్లో కేవలం పట్టభద్రులు, ఉపాధ్యాయులు మాత్రమే పాల్గొంటారు. వీరి ఎన్నిక ప్రభావం పరిమితం. గెలిచినా, ఓడినా అది ప్రజాభిప్రాయంగా స్వీకరించలేని పరిస్థితి రాజకీయ పార్టీలది. సాధారణ ఎన్నికల్లోను, స్థానిక ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటర్లు పాల్గొంటారు. ఆ అభిప్రాయమే ప్రజాభిప్రాయంగా కేసీఆర్ భావిస్తున్నారని, గ్రౌండ్ లెవల్‌లో ప్రభుత్వంపై ప్రజలు ఏ ఆలోచనతో ఉన్నారో స్పష్టంగా తెలిసేది స్థానిక సంస్థల ఎన్నికల్లోనే. ఆ దిశగా క్యాడర్ ముందుకు సాగాలని అంతర్గతంగా సూచించినట్లు గులాబీ నేతలు చెబుతున్నారు.
పై మూడు కారణాల వల్లే ఈ ఎన్నికలకు బీఆర్ఎస్ ప్రాధాన్యం ఇవ్వడం లేదని తెలుస్తోంది. అయితే పార్టీలో ఆశావాహుల్లోను, క్యాడర్‌లోను కొంత నిస్తేజం అలుముకుంది. పార్టీలో రాజకీయంగా ఎదిగే అవకాశం కోల్పోతున్నామని ఎన్నికల్లో నిలబడాలన్న కోరికతో ఉన్న నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 25 ఏళ్ల పాటు పలు ఎన్నికల్లో పాల్గొని, పదేళ్లు అధికారంలో ఉండి ఇప్పుడుఈ ఎన్నికల్లో ఓటమి భయంతో ఉండటం ఏంటని నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ క్యాడర్ జోష్‌తో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంటే, తాము రోడ్లపైకి వచ్చి ఓ గులాబీ జెండా పట్టుకోలేని పరిస్థితి ఏర్పడిందని క్యాడర్ నిరాశ వ్యక్తం చేస్తోంది. కారణాలు ఏవైనా, వ్యూహం ఏదైనా రాజకీయ పార్టీ పరీక్ష ఎదుర్కోనేది ఎన్నికల్లోనే. అలాంటి ఎన్నికలకు దూరంగా ఉండటం మాత్రం ఆసక్తికరం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

