Telangana Ration Card Latest News: తెలంగాణలో రేషన్ కార్డుల పంపిణీ ఏ జిల్లాలో ప్రారంభిస్తారు? రాష్ట్రమంతటా ఎప్పుడు ఇస్తారు?
Telangana Ration Card Latest News: తెలంగాణలో రేషన్ కార్డుల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కోడ్ లేని ఆ జిల్లాల్లో మొదట డిస్ట్రిబ్యూషన్ చేయాలని చూస్తున్నారు.

Telangana Ration Card Latest News: తెలంగాణలో రేషన్ కార్డుల పంపిణీనికి అధికారులు చర్యలు చేపట్టారు. ఒకట్రెండు రోజుల్లో కీలక నిర్ణయం కూడా రానుంది. ఇప్పటికే కార్డు ఎలా ఉండాలనే విషయంపై ప్రభుత్వం ఓ క్లారిటీకి వచ్చినట్టు సమాచారం. డిజైన్‌ను ఓకే చేశారని టాక్ నడుస్తోంది.
బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నట్టు ప్రధానమంత్రి ఫొటో మాత్రం పెట్టలేదని సమాచారం. చివరి నిమిషంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే తప్ప ప్రస్తుతానికి మాత్రం మోదీ ఫొటో లేకుండా కేవలం రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫొటోలు మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై బీజేపీ నేతలు ఎలా ఫైట్ చేస్తారో అన్న ఆసక్తి నెలకొంది.
Also Read: కొత్త రేషన్ కార్డు ఆశావాహులకు గుడ్ న్యూస్ - కీలక అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
కార్డును కూడా చాలా భిన్నంగా డిజైన్ చేసినట్టు చెబుతున్నారు. గతంలో చేసినట్టు పెద్దగా చేయకుండా చిన్న ఏటీఎం కార్డులా డిజైన్ చేశారని అంటున్నారు. అందులోనే అందరి పేర్లు వచ్చేలా అని వివరాలు ఉండేలా స్మార్ట్ కార్డు మాదిరిగా ఉంటుంది. దీనిపై ఓ క్యూఆర్ కోడ్ కూడా ఉంటుందని బోగట్టా.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. అందుకే లక్షల్లో జనం ఈ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. అందరికీ ఒకేసారి కార్డులు ఇవ్వాలంటే సమయం పడుతుంది. స్మార్ట్ కార్డులు అయితే త్వరగా ఇవ్వొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దీంతోపాటు ఈ రేషన్ కార్డు వినియోగించుకొని మోసాలు చేసే వారికి చెక్ పెట్టాలని చూస్తోంది. నకిలీ బెడద లేకుండా, పక్కదారి పట్టకుండా తప్పు జరగకుండా ఈ స్మార్ట్ యూజ్ అవుతుందని అంచనా వేస్తోంది. వీటన్నింటికీ తోడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కీలక ముందడుగు వేశామని కూడా చెబుతోంది.
ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున ఆయా జిల్లాల్లో కాకుండా కోడ్ లేని జిల్లాల్లో పంపిణీనికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతానికి తెలంగాణలో కోడ్ లేని జిల్లాలు మూడే ఉన్నాయి. ఉమ్మడి హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమలులో లేదు. అందుకే ఆ జిల్లాల్లో రేషన్ కార్డుల పంపిణీకి అధికారులు సిద్ధమవుతున్నారు. మొదటి విడతలో ఒక్కో జిల్లాకు లక్ష కార్డులు పంపిణీ చేయబోతున్నారు. ఈ మేరకు ప్రింటింగ్ పనుల‌్లో అధికారులు బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మూడు జిల్లాలు అయ్యేసరికి ఎన్నికల కోడ్ తొలగిపోతుందని ఆ తర్వాత మిగతా రాష్ట్రమంతటా కార్డులు పంపిణీ ముమ్మరం చేస్తామని చెబుతున్నారు.
Also Read: ఏటీఎం కార్డులా తెలంగాణలో రేషన్ కార్డు- జిల్లాకు లక్ష చొప్పున పంపిణీకి సిద్ధం
రేషన్ కార్డుల అప్లికేషన్లు, రద్దీ, పంపిణీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పౌరసరఫరాల అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రామసభలు, మీ సేవా కేంద్రాలు, కుల గణన ద్వారా వచ్చిన దరఖాస్తులను వీలైనంత త్వరగా ప్రోసెస్ చేయాలని చెప్పారు. ఎక్కడా డూప్లికేషన్‌కు అవకాశం లేకుండా జాప్యం జరగకుండా జాగ్రత్త పడాలన్నారు. అదే టైంలో అర్హులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వాళ్లు మరోసారి అప్లై చేయకుండా అవగాహన కల్పించాలని చెప్పారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

